16 సీట్లలోనూ మాదే గెలుపు | We Have won the TRS16 Seats Says KTR | Sakshi
Sakshi News home page

16 సీట్లలోనూ మాదే గెలుపు

Published Mon, Apr 15 2019 2:32 AM | Last Updated on Mon, Apr 15 2019 2:32 AM

We Have won the TRS16 Seats Says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 16 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని... కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై అందరితో మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తేనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు చేసినట్లుగా భావించవద్దన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోతుందని, మరికొన్ని చోట్ల మూడో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా లాభం ఉండదన్నారు.

తెలంగాణ సమాజంలో బీజేపీకి స్థానం లేదని, రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌లో టీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజారిటీ వస్తుందని, ఆ తర్వాత రెండో స్థానంలో వరంగల్, మూడు లేదా నాలుగో స్థానంలో కరీంనగర్‌ ఉండొచ్చన్నారు. సెటిలర్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లకుండా ఉండి ఉంటే టీఆర్‌ఎస్‌కు ఇంకా మెజారిటీ పెరిగేదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రగతికి ఆటంకం కాకూడదనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మే 23లోగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్‌ చెప్పారు. అన్ని ఎన్నికలు ముగిస్తే నాలుగున్నరేళ్లు పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. 

రెవెన్యూఉద్యోగుల్లో అత్యధికులు మంచివారే
అవినీతిని పారద్రోలాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకొస్తోందని కేటీఆర్‌ తెలిపారు. పటిష్టమైన మున్సిపల్‌ చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని చెప్పారు. అందువల్ల మున్సిపల్‌ ఎన్నికలు మే నెల తర్వాతే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల్లో సింహ భాగం మంచివాళ్లేనని, అయితే కొద్దిమంది ఉద్యోగులవల్ల ఉద్యోగులందరికీ చెడ్డపేరు రావడం మంచిది కాదన్నారు. పంచా యతీ ఎన్నికలు ఉన్నందున టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. 
చంద్రబాబు గెలిచినప్పుడు

ఈవీఎంలు బాగా పనిచేసినట్లా? 
‘తెలంగాణలో ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో దేశమంతా చూసింది. పక్క రాష్ట్రంలో (ఏపీ) ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా ఉందో అర్థమవుతోంది. టెక్నాలజీ నా వల్లే వచ్చిందని చెప్పే చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించడం హాస్యాస్పదం. చంద్రబాబువి సిల్లి కామెంట్స్‌. 2014లో ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పని చేసినట్లా? పెడబొబ్బలు పెట్టడం చంద్రబాబుకే మంచిది కాదు. ఆయన తీరుతో టీడీపీ కార్యకర్తలు సైతం తమకు ఓటమి తప్పదని అంగీకరిస్తున్నారు. మే 23న ఏం జరుగుతుందో తేలిపోతుంది. ఒకవేళ పొరపాటున చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలపై ఇప్పుడు చేసిన ఆరోపణల సంగతి ఏమిటి? సమాచారం ఎస్సెమ్మెస్‌ ద్వారా పంపితే ఏమిటి? లేఖ ద్వారా పంపితే ఏమిటి? ఎన్నికలు బ్యాలెట్‌ ద్వారా జరిగితే ఏమిటి? ఈవీఎంల ద్వారా జరిగితే ఏమిటి? రెండు రోజుల్లో తెలంగాణ పోలింగ్‌ పర్సెంటేజీలు మారాయన్న ఆరోపణలు సరికాదు.

పదేళ్ల నుంచి చూడండి. పోలింగ్‌ శాతం వివరాలు ప్రతిసారీ రెండో రోజు మారుతుంటాయి. మొదటి రోజు పోలింగ్‌ వివరాలు దాదాపుగా అంటారే తప్ప కచ్చితంగా అం దవు. ఏ ఒక్క పథకంతో పార్టీలు అధికారంలోకి రావు. బహుళ అంశాలు ప్రభావం చూపుతాయి (పసుపు కుంకుమ, మహిళలు టీడీపీకి ఓటేశారన్న అంశంపై). కేసీఆర్, జగన్‌లు మోదీ పెంపుడు కుక్కలని చంద్రబాబు అంటారా? నాలుగేళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టి మేం అలా మాట్లాడం. జగన్, కేసీఆర్‌ హుందాగా వ్యవహరించారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం దాటలేదు. వై.ఎస్‌. పులివెందుల దాటలేదు. కేసీఆర్‌ రాష్ట్రంలోని చాలా చోట్ల పోటీ చేశారు. జనామోదం ఉంటే ఎక్కడైనా గెలుస్తారు. అది కేసీఆర్‌కు మాత్రమే ఉంది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఓట్ల తొలగింపును ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు
ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘ఎన్నికల సంఘంలో సంస్కరణలు అవసరం. నిబంధనల విషయంలో చర్చ జరగాలి. ప్రజలు ఓటు వేయడానికి ఎందుకు రావడంలేదో రాజకీయ పార్టీలన్నీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీజేపీకి చెందిన రూ. 8 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి డ్రా చేస్తే ఈసీ దీనిపై కనీసం ప్రశ్నించలేదు సరికదా 24 గంటల్లోనే ఐటీశాఖ బీజేపీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది’అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

అంబేడ్కర్‌ తత్వంతోనే తెలంగాణ: కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిజమైన దార్శనికుడని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం జరిగిన అంబేడ్కర్‌ జయంతి వేడుకలో కేటీఆర్‌ ప్రసంగించారు. ‘అందరికీ అంబేడ్కర్‌ జయంతి శుభాకాంక్షలు. అంబేడ్కర్‌ ఒక కులానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. గాంధీ, నెహ్రులకు ఏ మాత్రం తీసిపోని దార్శనికుడు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం శాసనసభలో మెజారిటీ అవసరంపై రాజ్యాంగం రచించేటప్పుడు కేటీషా, అంబేడ్కర్‌ల మధ్య వాదనలు నడిచాయి. అసెంబ్లీలో మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు కావా లనే వాదనను తోసిపుచ్చి అల్ప సంఖ్యాకుల గొంతు కకు అంబేడ్కర్‌ బలమిచ్చారు.

అంబేడ్కర్‌ తత్వంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ సాధించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణలో సంక్షే మం అమలవుతోంది. శనివారం పంజగుట్టలో అంబే డ్కర్‌ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నా. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం..’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మంత్రులు మహమ్మద్‌ మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు వివేకానంద, బాల్క సుమన్, పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement