సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్మా సిటీ ఒక్కచోట ఉండకూడదనే వికేంద్రీకరణ చేశామని చెప్పారు. లగచర్లలో భూమిలేని వారు అధికారులపై దాడి చేశారని, కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించాడని ఆరోపించారు. ఫార్ములా వన్ రేసులో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని, ఆయన తప్పు చేశాడని ఫీలవుతున్నాడు కాబట్టే జైలుకుపోతా అంటున్నాడని తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపడం లేదేంటని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అవినీతి అధికారులపై పద్దతి ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిపక్షహోదా ఉన్నప్పటికీ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు. ఆయన ఎక్కడ దాకున్నారని ఆయన ప్రశ్నించారు.
‘కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన రుణమాఫీ కంటే మేము 9 నెలల్లో ఎక్కువ చేశాం. నిర్బంధ పాలన నుంచి ప్రజా పాలన తీసుకొచ్చాం. అందుకే బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప్రజలు కోరినట్లు పాలన సాగింది కాబట్టే విజయోత్సవాలు చేస్తున్నాం. బీఆర్‌ఎస్ హయాంలోని అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి.
హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్‌లో చోటుచేసుకున్న ఉపద్రవాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూసీ ప్రక్షాళన అవసరం. పేదలెవరూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment