మంగళవారం ఖమ్మంలో చేపట్టిన జలదీక్షలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగునీటి వ్యవహారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొన్న అనంతరం జల దీక్ష చేపట్టారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుగుతున్న నష్టాన్ని ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సాగు నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించామని పదే పదే చెప్పే కేసీఆర్.. ఎగువ, దిగువ ప్రాంతాల వారు నిబంధనలకు విరుద్ధంగా నీటిని తోడుకుని వెళ్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు రాకపోతే ఖమ్మం, నల్లగొండ జిల్లా లు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు., దీనిపై రాజకీయాలకతీతంగా అందరూ సమైక్య పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ పోరాటంలో కలసి రాని వారిని ప్రజలు తెలంగాణ ద్రోహులుగానే పరిగణిస్తారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం ఆరేళ్ల క్రితం సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇన్నేళ్లు గడిచినా ఆ లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదని, గ్రూప్–1 నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఎదురుచూడటంతోనే సరిపోతోందని చెప్పారు.
ప్రశ్నించే వారి గొంతును నొక్కుతున్నారు..
ప్రజల పక్షాన ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ తాము చెప్పిందే వేదమన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని భట్టి విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి, కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలే కారణమని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment