రైతన్నకు బీమా ధీమా | CM KCR Announce Rs 5 Lakh Life Insurance For Farmers | Sakshi
Sakshi News home page

రైతన్నకు బీమా ధీమా

Published Sat, May 26 2018 12:58 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

CM KCR Announce Rs 5 Lakh Life Insurance For Farmers - Sakshi

సీఎం చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులకు ఎంత భూమి ఉన్నా, వారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు. ఏటా ఆగస్టు 1న ప్రీమియం చెల్లిస్తామని చెప్పారు. 

విశ్వసనీయత, విస్తృత యంత్రాంగమున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. సాధా రణ మరణమైనా, ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా అయితే.. ప్రభుత్వంపై వ్యయ భారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత ఖర్చయినా మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడాన్ని బాధ్యతగా భావించి బీమా చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రైతుల జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. 

వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు, ఎల్‌ఐసీ ప్రతినిధులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేస్తున్నందున ఎల్‌ఐసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కోరారు. ‘‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఉంటే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు. 

కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం’’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ వినోద్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్మోహన్‌ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌ రావు, ఎల్‌ఐసీ రీజినల్‌ మేనేజర్‌ ఆర్‌.చందర్, డీఎం బీఎస్‌ నర్సింహ, డీఎం సుబ్రహ్మణ్యం, బీఎం జి.పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

విధివిధానాలివే.. 

  • ఎల్‌ఐసీతో పాటు ఇతర బీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికే సాధారణ జీవిత బీమా వర్తిస్తుంది. 59 ఏళ్లలోపు వారిని మాత్రమే బీమా పథకానికి నమోదు చేసుకుంటారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. అందుకే రైతులకు జీవిత బీమా పథకానికి 18 నుంచి 59 ఏళ్లలోపు వారి పేర్లు నమోదు చేస్తారు. 
  • ఆధార్‌ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2018 ఆగస్టు 15 నాటికి రైతు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. ఈ జాబితా ప్రకారమే ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. 
  • వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా 18–59 వయసున్న రైతుల జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం వారి తరఫున ప్రీమియం చెల్లించి, రైతుల జాబితాను ఎల్‌ఐసీకి అందిస్తుంది. ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్లను ముద్రిస్తుంది. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతులకు పంపిణీ చేస్తుంది. 
  • ప్రతి రైతుకు ప్రభుత్వం–ఎల్‌ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. 
  • బీమా పరిహారంగా రూ.5 లక్షలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించే స్వేచ్ఛ రైతుకే ఉంటుంది. ముందుగానే రైతులు నామినీని ప్రతిపాదించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలను సేకరిస్తారు. 
  • రైతు మరణించిన పది రోజుల్లోగానే రూ.5 లక్షలు నామినీకి అందజేస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించేలా ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి మధ్య ఒప్పదం కుదురుతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్‌ఐసీకి జరిమానా విధిస్తారు. 
  • ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే ప్రీమియం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆగస్టు 1న ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. ప్రతి నెలా రైతుల వివరాలను వ్యవసాయాధికారులు అప్‌ డేట్‌ చేస్తారు. దాని ప్రకారం అర్హుల జాబితా అప్‌ డేట్‌ అవుతుంది. ఎప్పుడు భూమి కొంటే అప్పటి నుంచి బీమా వర్తించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. 

దేశ చరిత్రలో ఇది రికార్డు: ఎల్‌ఐసీ 
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతులకు జీవిత బీమా సదుపాయం దేశ చరిత్రలో, బీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డుగా ఎల్‌ఐసీ ప్రకటించింది. ‘‘గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులున్నాయి. తక్కువ మంది సభ్యులు.. లక్ష నుంచి రెండు లక్షల బీమా ఉండేది. ప్రీమియం సొమ్ము తక్కువవుతుందనే ఉద్దేశంతో ప్రమాద బీమా మాత్రమే చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే, రైతులందరికీ ప్రయోజనం ఉండాలని భావించింది. ఎక్కువ ప్రీమియం అయినా సరే.. ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా చేయాలని నిర్ణయించింది. రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇన్ని లక్షల మందిని సభ్యులుగా గ్రూపు ఇన్సూరెన్సు చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదు’’అని సీఎంతో సమీక్ష అనంతరం ఎల్‌ఐసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్‌.చందర్, డీఎంలు బీఎస్‌ నర్సింహ, సుబ్రహ్మణ్యం అన్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement