సాక్షి, ఖమ్మం : మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రంలో భారీ కుంభకోణాలకు టీఆర్ఎస్ సర్కార్ పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఈ పథకాలేవీ నడవనీయకుండా చేసి కృత్రిమంగా నీటి ఎద్దడి పరిస్థితులను సృష్టిస్తున్నాయని భట్టి నిప్పులు చెరిగారు. సీపీడబ్ల్యూడీ పథకాలను నిర్వీర్యం చేసి మిషన్ భగీరథ లేకపోతే.. రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేదనే పరిస్థితులను తయారు చేస్తున్నారని అన్నారు. గత మూడేళ్లుగా.. ఈ సీపీడబ్ల్యూడీ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిపేసిందని భట్టి తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.30 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టి.. ఎవరినీ పనిచేయనీకుండా ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేస్తూ.. వీటికి మాత్రం రూపాయి విడుదల చేయడం లేదని భట్టి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లాలొనే ఇటువంటి పథకాల్లో 340 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 9 నెలలుగా జీతాలు లేవని చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భట్టి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పేరు చెప్పుకుని.. దానిమీద 56 వేల కోట్ల రూపాయల్లో, కొన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఆ సొమ్ముతో రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చేయాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని భట్టి తెలిపారు.
నేను అసెంబ్లీకే పోటీ చేస్తా..!
లోక్ సభకు పోటీచేస్తారని వస్తున్న వార్తలపై భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి మాత్రమే పోటీచేస్తానని ప్రకటించారు. తన కుటుంబం నుంచి మరెవ్వరూ ఎన్నికల్లో పోటీచేయరని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment