rws Department
-
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్/అశ్వాపురం: దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2,250 కోట్ల వ్యయంతో అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద పనులు చేపట్టారు. 23 మండలాల పరిధిలోని 1,828 గ్రామాల్లో 9.97 లక్షల మందికి, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) పట్టణాల్లోని 2.98 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 2016లో డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు, అశ్వాపురం మండలం మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40ఎంఎల్డీ, పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద 145 ఎంఎల్డీ, పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్డీ, పూసూరు వద్ద 9ఎంఎల్డీ సామర్థ్యం గల ఇన్‌టేక్ వెల్లు నిర్మించారు. ప్రతిరోజూ 145 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల డబ్ల్యూటీపీలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలోనే తొగ్గూడెంలోని నీటిశుద్ధి కేంద్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఇంట్రా విలేజ్ స్కీమ్ ద్వారా.. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో పైపులైన్, ట్యాంక్‌లు నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.191.09 కోట్లు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 818 ట్యాంక్‌లు, 2,234 కిలోమిటర్ల పొడవునా పైపులైన్ నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది లేదు జిల్లాలో మిషన్ భగీరథ పథకం రాకముందు తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధానంగా వేసవిలో సమస్య జఠిలంగా ఉండేది. మిషన్ భగీరథ స్కీం అమల్లోకి వచ్చాక తాగునీటి సమస్య పరిష్కారం అయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు దాదాపుగా తాగునీరు అందుతోంది. 85 గొత్తికోయల గ్రామాలకు గాను 75 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.10 గ్రామాలకు అటవీశాఖ అనుమతి లేనందున పైపులైన్ నిర్మించలేకపోయాం. –తిరుమలేశ్వరరావు, ఇంట్రా విలేజ్ ఈఈ -
తాగునీటి పరీక్షల్లో మనమే ముందు
సాక్షి, అమరావతి: తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే బోర్లు, ఇతర స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన నీరు ఫ్లోరైడ్ వంటి ఇతర ప్రమాదకర కారకాలు లేకుండా సురక్షితమైనదేనా అని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నీటి వనరులో నమూనాకు ఏటా నాణ్యత పరీక్షలు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు (5 నెలల్లో) దేశం మొత్తంలో 8,78,667 నీటి నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అందులో దాదాపు ఐదోవంతు అంటే 1,63,065 నమూనాల పరీక్షలు మన రాష్ట్రంలో నిర్వహించినవే. పలు పెద్ద రాష్ట్రాలతో సహా దేశంలోని మిగిలిన వాటిలో మరే రాష్ట్రంలోను లక్షకు మించి నీటి నాణ్యత పరీక్షలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ వివరాలను తమ వెబ్ పోర్టల్‌లో తెలిపింది. రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యంలో మొత్తం 112 నీటినాణ్యత పరీక్ష కేంద్రాలున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లా కేంద్రంలోను, డివిజన్ కేంద్రంలోను ఒకటి వంతున ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటివనరుల నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటివరకు 1,81,518 నీటి నమూనాలను సేకరించగా, వాటిలో 1,63,065 నమూనాల నాణ్యత పరీక్షలు పూర్తిచేసి ఎటువంటి కలుషిత కారకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఆ వనరుల్లో నీటిని తాగునీటిగా ఉపయోగించుకోవడానికి అనుమతించినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 12 ల్యాబ్‌లకు కొత్తగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ సర్టిఫికెట్ పొందినట్టు చెప్పారు. -
3 ఏళ్లు.. రూ.15,989 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తొలి విడతలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతోపాటు ఇతర తాగునీటి వసతి సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.15,989 కోట్ల ఖర్చు చేసేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.3,720 కోట్లు, 2022–23లో రూ.8,089 కోట్లు, 2023–24లో రూ.4,180 కోట్లు వెచ్చించనున్నారు. పనిచేయని మంచినీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావడానికి, జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి మొదటి విడతలో రూ.3,090 కోట్లు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇటీవల పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో తాగునీటి వసతుల కల్పన ప్రాధాన్యత అంశంగా నిర్ధారించారు. ఇప్పటికే పనులు మొదలైన 3 జిల్లాలకు తోడు.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా డోన్, వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రాంతాల్లో రూ.684 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు ప్రాంతాలతో కూడిన పశ్చిమ ప్రాంతంతో పాటు చిత్తూరు జిల్లా ఉత్తర ప్రాంతంలో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రొయ్యల చెరువులు, సముద్రజలాల ఉప్పునీటితో ఇబ్బందులు పడుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలో రూ.7,840 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఏపీలోని 13 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మంచినీటి వసతుల కల్పనకు రూ.3,250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
తాగునీటి నిధుల కు కేంద్రం కత్తెర
రెండువేల గ్రామాల్లో తాగునీటి పథకాలకు బ్రేక్ 746 కోట్లతో ఆర్డబ్ల్యూఎస్ విభాగం అంచనాలు కేంద్రం నుంచి నిధులందక రాష్ట్రం ఊగిసలాట హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రా్రష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ)’కు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రంలోని రెండువేలకు పైగా గ్రామాల్లో చేపట్టాల్సిన తాగునీటి ప్రాజెక్టులకు బ్రేక్‌పడింది. గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద కేంద్రం 50శాతం, రాష్ట్రం 50 శాతం నిధులను ఖర్చు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కార్యక్రమానికి 2014-15 బడ్జెట్లో రూ.8,869 కోట్లు కేటాయించగా, 2015-16 బడ్జెట్లో కేటాయింపులను రూ.2,500 కోట్లకు కుదించింది. కాగా, ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద గతేడాది రాష్ట్రంలో తాగునీటి పథకాలకు రూ.655.40 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్రం నుంచి రూ.212 కోట్లు రాగా, రాష్ట్రం రూ.443 కోట్లు భరించింది. ఈ ఏడాది తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉన్న 2,106 గ్రామాలను గుర్తించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.. ఆయా గ్రామాల్లో తాగునీటి వసతుల కల్పనకు రూ.746.50కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సర్కారు ఊగిసలాట.. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూ ప్రోగ్రామ్‌కు ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంతో ఎంపిక చేసిన గ్రామాల్లో మంచినీటి వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఊగిసలాడుతోంది. వాస్తవానికి ఈ పథకం కింద ఎస్వీఎస్(సింగిల్ విలేజ్ స్కీమ్), ఎంవీఎస్(మల్టీ విలేజ్ స్కీమ్) ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా మంచినీటి వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులకు నిధుల గురించి గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు తాజాగా ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిధుల కొరత ఏర్పడడంతో ఎన్ఆర్డబ్ల్యూ ప్రోగ్రామ్ పథకం చేపట్టాల్సిన చోట అత్యవసర పరిస్థితి ఉన్న గ్రామాలను గుర్తించాలని ఆర్థిక శాఖ సూచించింది. తీవ్రమైన నీటి ఇబ్బందులున్న గ్రామాలకు మాత్రం అవసరమైన మేరకు నిధులిచ్చేందుకు ఆర్థికశాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
‘నిషేధం’ అమలయ్యేనా?
బాన్సువాడ : జిల్లాలో విచ్చలవిడిగా బోర్లు వేస్తూ వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజూ సగటున 60 వరకు బోర్లు వేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ శాఖనే ధ్రువీకరిస్తోంది. ఈ బోర్లకు ఏ ప్రాంతంలోనూ అనుమతి తీసుకొ న్న దాఖలాలు లేవు. వాల్టా చట్టం ప్రకారం బోర్లు వేసే సందర్భంలో తప్పకుండా సంబంధిత శాఖ ద్వారా అనుమతి తీసుకోవాలి. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితమైంది. విచ్చల విడిగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 127 గ్రామాల్లో బోర్ల తవ్వకాన్ని నిషేధిస్తూ ఇటీవల కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల పంట పొలాలతో పాటు ఇండ్ల నిర్మాణానికి బోర్లు వేస్తున్న వారి సంఖ్య పెరిగింది. వంద మీటర్లలోపు దూరంలో రెండు బోర్లు వేయకూడదనే నిబంధనలున్నాయి. అయితే వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూమికి చిల్లు పెట్టడమే కాదు జేబుకు చిల్లు పడుతున్నా లెక్క చేయడం లేదు. గ్రామ పంచాయతీల ఆవ రణలో ‘అనుమతి లేనిదే బోరు వేయకూడదు. పర్యావరణానికి విఘాతం కలిగించవ ద్దు. ఎడాపెడా బోర్లు వేయొద్దు’ అని పేర్కొం టూ వాల్టా చట్టం గురించి రాస్తున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నీళ్లు లేవనే నిజం గ్రహించకుండానే బోర్ల తవ్వకానికి పూనుకొంటున్నారు. రైతులకు తోడు ప్రస్తు తం పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు వే గం పుంజుకోవడంతో తాగునీటికి సైతం బో ర్లు వేసే వారి సంఖ్య పెరిగిపోయింది. బోరు లేనిదే ఇండ్ల నిర్మాణం చేపట్టమంటూ మేస్త్రీలు మొండికేయడంతో బోర్లు వేసిన తర్వాతే ఇం డ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. బోరు యం త్రాల యజమానులు సైతం కనీస నిబంధనలను పాటించకుండా బోర్లు వేస్తున్నారు. అనుమతి పత్రం లేనిదే బోరు బండిని పంపకూడదు. కానీ యజమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో బోరు బండ్లు అనేకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో నిత్యం బోరు వేసే యంత్రం చప్పుడు వినిపించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. వర్షాభావ పరిస్థితులకు తోడు విచ్చలవిడిగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జల మట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కో బోరు 400 నుంచి 500 అడుగుల లోతు వరకు వేస్తున్నాఫలితం ఉండడం లేదు. రోజూ 10 నుంచి 20 బోర్లకు నీళ్లు పడడం లేదని తెలుస్తోంది. చివరికి నీళ్లు పడకపోవడంతో రైతులకు అప్పులే మిగులుతున్నాయి. రైతులు ఈ బోర్లు వేయడానికి రూ. 30 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రజల అవసరం బోరు యంత్రపు యజమానులకు కాసుల పంట కురిపిస్తోంది. తలసరి నీటి లభ్యత 15 లీటర్లకు తగ్గితేనే భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటినట్లు నిర్ధారిస్తారు. ప్రస్తుతం 40 నుంచి 60 లీటర్ల వరకు తలసరి నీటి లభ్యత ఉంది. రానున్న వేసవిలో బోరు బావులు, చేతి పంపుల నుంచి నీటిని అధికంగా వాడడం వల్ల భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బోర్లు వేసి నష్టపోతున్న పేదరైతులకు అవగాహన కల్పిం చే చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా ఉండడంతో కలెక్టర్ స్పందించారు. 127 గ్రామాల్లో బోర్లు వేయడాన్ని మూడేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కిందిస్థాయి అధికారులు ఎంతవరకు అమలు చేస్తారు అన్నది వేచి చూడాల్సిందే. -
స్థలాలు సరే.. నిధులేవీ?
చిత్తూరు(టౌన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నిధులివ్వకనే అరచేతిలో వైకుంఠం చూపుతోంది. జిల్లాలో తొలివిడతగా 225 గ్రామ పంచాయతీలకు యార్డులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 135 యార్డులను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించగా మిగిలిన 90 యార్డుల బాధ్యతను జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తీసుకున్నారు. నిధులు రాకపోవడంతో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఏం చేయనున్నారంటే.. మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో పోగయ్యే చెత్తను సేకరించి యార్డులో ఎరువులను తయారు చేసి తద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచాలనేదే ప్రభుత్వ యోచన. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు యార్డుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించనుంది. తొలివిడతగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోరు డ్రిల్ చేసి, దానికి మోటారు అమర్చి, యంత్రాల వినియోగం కోసం షెడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందులో తయారైన ఎరువును ఆయా గ్రామ పంచాయతీలే అమ్ముకుని ఆదాయాన్ని పెంచుకునే ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది. నిధులే సమస్య.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే స్థలాలనైతే ప్రభుత్వం కేటాయించింది కాని యార్డుల నిర్మాణానికి నిధులను మాత్రం మంజూరు చేయలేదు. ప్రభుత్వం అనుకున్న విధంగా డంపింగ్ యార్డులను నిర్మించాలంటే ఒక్కో దానికి కనీసం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా మంజూరు చేయకుండా ఆదేశాలు మాత్రం జారీ చేసి మిన్నకుంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించిన 135 యార్డులకు ప్రభుత్వం కేటాయిచిన స్థలాలను ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు చూపలేదు. నిధులు మంజూరు కాక, కేటాయించిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులును వివరణ కోరగా యార్డుల పర్యవేక్షణ బాధ్యతను తమకైతే అప్పగించారు కానీ నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదన్నారు. తమకు కూడా నిధులు రాలేదని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు వివరించారు. -
ఆర్‌డబ్ల్యూఎస్‌లో నాలుగు స్తంభాలాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చిచ్చు ప్రభుత్వ శాఖల ఉన్నత ఉద్యోగుల్లోనూ అగ్గి రాజేస్తోంది. పని విభజనలో ఏకపక్ష వైఖరి కనిపిస్తుందంటూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు వెళ్లిన ఉన్నతాధికారులు గగ్గోలు పెడుతున్నారు. నలుగురు అధికారులకు సమానంగా పంచాల్సిన బాధ్యతలు ఒక్కరికే కట్టబెట్టడంతో ఆర్డ బ్ల్యూఎస్(గ్రామీణ నీటిసరఫరా పథకం)లో ఒకింత అయోమయం నెలకొంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉన్న మొత్తం ఏడుగురు చీఫ్ ఇంజనీర్లలో ఆరుగురు తెలంగాణకు చెందినవారు ఉండగా, జనాభా నిష్పత్తి మేరకు నలుగురు సీఈలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. వారిలో ముగ్గురు తెలంగాణకు చెందినవారే కావడంతో సమస్య మొదలైంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో తమకంటే ఎంతో జూనియర్ అయిన వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడన్న కారణంతో శాఖ పరిపాలన(అడ్మినిస్ట్రేషన్)తో పాటు ప్రాజెక్ట్స్, ఎన్టీఆర్ సుజల స్రవంతి తదితర కీలక శాఖలన్నీ ఆయనకే అప్పగించారు. ఈ పరిణామం మిగిలిన ముగ్గురు సీఈలకు ఆగ్రహాన్ని కలిగించింది. తాము తమ ప్రాంతాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసేందుకు సిద్ధమై వెళ్లామని, అక్కడ సమన్యాయంతో చూడాల్సిన కొందరు పెద్దలు సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సీఈల్లో ఒకరు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. -
కిలో మీటర్ వెళ్తేనే నీళ్లు
బిందెడు నీటికి కిలో మీటర్ దూరం వెళ్లాల్సి వస్తోంది. ఏటా గిరిజనం కష్టాలు పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. 12 వందల మందికిపైగా జనాభా ఉన్నా నీటి సౌకర్యం మాత్రం కల్పించలేకపోతున్నారు పాలకులు. సుమారు 225 గిరిజన కుటుంబాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నాయి. పాలకుల హామీల వర్షంతో తడుస్తున్న గిరిజనానికి మాత్రం శాశ్వత మంచినీటి సరఫరా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ‘గిరి’జనం కష్టాలు - ఎడ్ల బండ్లతో నీటి తరలింపు - పని చేయని రెండు నీటి పథకాలు - పట్టించుకోని పంచాయతీ పాలకవర్గం, అధికారులు బేల, న్యూస్‌లైన్ : మండలంలోని ఏజెన్సీ గిరిజనం నీటి గోడు వినేవారు కరువయ్యారు. సదల్పూర్ గ్రామంలో ఏటా వేసవిలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నాయి తప్పితే సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. గ్రామంలో దాదాపు 225 వరకు కుటుంబాలు ఉండగా, జనాభా 12వందలకు పైగా ఉంది. ప్రభుత్వం రూ.16 లక్షలు వెచ్చించి గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఒక ట్యాంకు, ఐటీడీఏ ఆధ్వర్యంలో బైరందేవ్-మహదేవ్ ఆలయాల సమీపంలో మరో ట్యాంకు 40 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. స్థానికంగా నీటి వనరులు(బోర్లు) పడకపోవడంతో రెండు ట్యాంకులకు ఆలయ సమీపంలోని బావికి పైపులైన్ కనెక్షన్ ఇచ్చారు. ఎండాకాలం బావిలో నీరు అడుగంటిపోతున్నాయి. చేతిపంపు నుంచి నీళ్లు రావడం లేదు. శాశ్వత నీటి పరిష్కారంకోసం రెండేళ్లక్రితం 3 కి.మీల దూరంలోని జూనోని మార్గంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ బోరు వేయించింది. బావి వరకు పైప్‌లైన్‌తో నీటి సరఫరాను గత నవంబర్‌లో ప్రారంభించారు. ఈ పైప్లైన్మార్గంలో 25రోజులక్రితం ఎయిర్వాల్ల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చేసేదిలేక కి.మీ దూరంలోని ఆలయాల సమీప బావి నుంచి నీటిని గిరిజనులు తీసుకెళ్తున్నారు. ఏం చేస్తున్నరో..? మా ఊరికి లీడర్లు, ఆఫీసర్లు ఆ మీటింగు, ఈ మీటింగు అనుకుంటూ వస్తరు. టాకీ పని చేయడం లేదని రాసుకొని పోతరు. ఏం చేస్తున్నారో..? తెలియడం లేదు. ఏటా ఎండకాలం గుడి నూతి నుంచి నెత్తిమీద బిందెలతో నీళ్లు మోసుకోక తప్పడం లేదు. - కొడప అయ్యు బాయి టాకీలు వెస్ట్గా ఉంటున్నయ్ మా ఊరికి నీళ్లకోసం కట్టిన రెండుటాకీలు వెస్ట్గా ఉన్నాయి. గుడి దగ్గరి నూతి నుంచి ఎడ్లబండిపై డ్రమ్ములతో నీళ్లు మోసుకుంటున్నం. ఏటా ఇట్లనే ఉన్నది. దీన్ని పంచాయతీ వాళ్లు గానీ,ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోరు. పట్టించుకునే వాళ్లు ఉంటే మాకు నీళ్లకోసం ఈ తిప్పలు ఉండేవి కావు. - భీంరావు