రెండువేల గ్రామాల్లో తాగునీటి పథకాలకు బ్రేక్
746 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం అంచనాలు
కేంద్రం నుంచి నిధులందక రాష్ట్రం ఊగిసలాట
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రా్రష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ)’కు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రంలోని రెండువేలకు పైగా గ్రామాల్లో చేపట్టాల్సిన తాగునీటి ప్రాజెక్టులకు బ్రేక్‌పడింది. గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద కేంద్రం 50శాతం, రాష్ట్రం 50 శాతం నిధులను ఖర్చు చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కార్యక్రమానికి 2014-15 బడ్జెట్లో రూ.8,869 కోట్లు కేటాయించగా, 2015-16 బడ్జెట్లో కేటాయింపులను రూ.2,500 కోట్లకు కుదించింది. కాగా, ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద గతేడాది రాష్ట్రంలో తాగునీటి పథకాలకు రూ.655.40 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్రం నుంచి రూ.212 కోట్లు రాగా, రాష్ట్రం రూ.443 కోట్లు భరించింది. ఈ ఏడాది తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉన్న 2,106 గ్రామాలను గుర్తించిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు.. ఆయా గ్రామాల్లో తాగునీటి వసతుల కల్పనకు రూ.746.50కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
సర్కారు ఊగిసలాట..
కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూ ప్రోగ్రామ్‌కు ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంతో ఎంపిక చేసిన గ్రామాల్లో మంచినీటి వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఊగిసలాడుతోంది. వాస్తవానికి ఈ పథకం కింద ఎస్‌వీఎస్(సింగిల్ విలేజ్ స్కీమ్), ఎంవీఎస్(మల్టీ విలేజ్ స్కీమ్) ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా మంచినీటి వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులకు నిధుల గురించి గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు తాజాగా ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిధుల కొరత ఏర్పడడంతో ఎన్‌ఆర్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ పథకం చేపట్టాల్సిన చోట అత్యవసర పరిస్థితి ఉన్న గ్రామాలను గుర్తించాలని ఆర్థిక శాఖ సూచించింది. తీవ్రమైన నీటి ఇబ్బందులున్న గ్రామాలకు మాత్రం అవసరమైన మేరకు నిధులిచ్చేందుకు ఆర్థికశాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తాగునీటి నిధుల కు కేంద్రం కత్తెర
Published Sat, May 23 2015 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement