బీసీ రుణాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. నాలుగేళ్లుగా స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రుణాల పంపిణీ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖకు ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగాలు ఎలాగూ లేవు.. కనీసం స్వయం ఉపాధితో జీవనం గడుపుదామని భావించిన బీసీ వర్గాలకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖకు బీసీలు, ఎంబీసీలు, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం 100 మందికి రూ.50 వేల చొప్పున 50 లక్షల రుణాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మిగతా దరఖాస్తుదారులు తమకు రుణాలు వస్తాయా లేదా అనే మీమాంసలో పడ్డారు.
సాక్షి, కరీంనగర్: జనాభాలో సగభాగమున్న బీసీల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని, బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని, కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని, సంక్షేమం కోసం ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడబోమని పదేపదే వేదికలపై వల్లెవేస్తున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రుణాల జాడే లేదు. ఫెడరేషన్ల పరిస్థితి అదే తీరు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక ఊసేలేదు. దీంతో బడుగులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాయితీలతో ఆశలు..
ఎన్నడూ లేని విధంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రుణప్రణాళికలో భారీ రాయితీలను ప్రకటించింది. గతంలో ఇంత భారీ మొత్తం ఇవ్వలేదు. ఇచ్చినా రూ.2 లక్షలు మించి ఇచ్చేవారు కాదు. రాయితీ రుణంలో 50 శాతం మించేది కాదు. ఈసారి ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచింది. కేటగిరి 1,2,3 పేరిట ఈ మొత్తాన్ని పెంచినట్లు ప్రకటించింది. కేటగిరి 1 లో రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 80 శాతం రాయితీ, రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం, ఆపై 50 శాతం రాయితీ వర్తింపజేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. బీసీ కార్పొరేషన్‌లో 21,323 దరఖాస్తులు వచ్చాయి. ఫెడరేషన్ రుణాల పరిమితిని పెంచి రాయితీని పెంచారు. రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రాయితీ ప్రకటించారు. దీనికితోడు గౌడ సంఘానికి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ఫెడరేషన్స్ రుణాల కోసం దరఖాస్తులు వచ్చాయి.
అందేది ఎప్పుడు..?
బీసీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరానికి మార్జిన్ మనీ కింద లక్ష్యం 434 యూనిట్లకు రూ.388.80 లక్షలు ఇవ్వగా 418 యూనిట్లకు రూ. 320.78 లక్షలకు మంజూరు ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి 146 యూనిట్లకు రూ.108.64 లక్షల నిధులు మంజూరు కాగా, 272 యూనిట్లకు రూ. 212.06 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చేతి వృత్తుల వారికి సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన కింద 128 యూనిట్లకు రూ.121 లక్షలుగా లక్ష్యం నిర్దేశిస్తే 120 యూనిట్లకు రూ.93.40 లక్షలు మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇందులో కేంద్ర కార్యాలయం నుంచి 102 యూనిట్లకు రూ.76.25 లక్షల నిధులు లబ్ధిదారుల చేతికి వచ్చాయి. ఇంకా 11 మందికి రూ.12.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. మొత్తంగా 283 మంది లబ్ధిదారులకు రూ.224.21 లక్షల నిధులు రావాల్సి ఉంది.
ఫెడరేషన్ల పరిస్థితీ అంతే..
జిల్లాలో వివిధ సామాజిక ఫెడరేషన్లలో 37 యూనిట్లకు రూ.432.50 లక్షలు మంజూరు ఇస్తే ఇప్పటివరకు 14 ఫెడరేషన్ యూనిట్ల కు రూ.168 లక్షలు మాత్రమే మంజూరు చే శారు. ఇంకా 23 ఫెడరేషన్లకు రూ.264.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఫెడరేషన్ల సభ్యులు రుణాలకు ఎదురుచూస్తున్నారు.
కమ్ముకున్న నీలినీడలు..
2015–16, 2016–17 సంవత్సరాలకు మంజూరు చేసిన రుణాలకే రాయితీలు రాక లబ్ధిదారులు బ్యాంకులు, బీసీ అభివృద్ధి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు 2017–18 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతోంది. అయినా.. ఇప్పటివరకు పాత రుణాల జాడలేదు. కొత్త రుణాలకు సంబంధించిన ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీసీ, ఎంబీసీలకు, ఫెడరేషన్లకు మూడు కేటగిరీలలో 100 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మరో 20 వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మళ్లీ రుణాలు ఇస్తారో లేదో అనే సందేహంలో పడ్డారు. ఇప్పటికే స్టెప్‌కార్ ద్వారా ఇచ్చే రుణాలను ఎత్తివేసిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు మంగళం పాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా..
రూ.2 లక్షలు రుణం మంజూరు చేసి ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటివరకు రుణం డబ్బులు బ్యాంకులో వేయలేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు. బీసీ కార్పొరేషన్ అధికారుల వద్దకు వెళ్తే నేరుగా మీ ఖాతాకే లోన్ మొత్తం వస్తుందంటున్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు లోన్ జాడే లేదు. – నాగవెల్లి లక్ష్మీనారాయణ, లబ్ధిదారుడు
బీసీలను విస్మరించడం బాధాకరం..
జనాభాలో సగభాగమున్న బీసీలను దగా చేయడం బాధాకరం. భారీ రాయితీలు ప్రకటించి నిరుద్యోగులకు ఆశలు కల్పించి రుణాలు మంజూరు చేయకుండా కాలయాపన చేయడం బీసీల మనోభావాలను దెబ్బతీయడమే. నాలుగేళ్ల అనంతరం కేవలం 50 వేల చొప్పున రుణం ఇవ్వడం సరికాదు. – కేశిపెద్ది శ్రీధర్‌రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభల ద్వారా ఎంపికై ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్ల ద్వారా వంద మందిని ఎంపిక చేశాం. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు అందించాం. మిగితా దరఖాస్తుదారులకు సంబంధించి బడ్జెట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగానే పంపిణీ చేస్తాం. – రంగారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment