అధి‘కార్ల’ బాగోతం.. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తి పోలేదు! | Adilabad: Government Officials Taking Car Bills With Illegal | Sakshi
Sakshi News home page

అధి‘కార్ల’ బాగోతం.. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తి పోలేదు!

Sep 29 2022 2:00 PM | Updated on Sep 29 2022 2:00 PM

Adilabad: Government Officials Taking Car Bills With Illegal - Sakshi

ఇక్కడ కనిపిస్తున్న వాహనాన్ని ఓ ఐసీడీఎస్‌ అధికారి వినియోగిస్తున్నారు. కారుపైన ‘ఆన్‌ గౌట్‌ డ్యూటీ’ అని రాసి ఉంది. నిబంధనల ప్రకారం ఎల్లో ప్లేట్‌ వాహనం వినియోగించాలి. కానీ ఇందులోనే సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈయనొక్కరే కాదు.. ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, పబ్లిక్‌ హెల్త్, వైద్యారోగ్యశాఖ, వయోజన విద్య, బీసీ వెల్ఫేర్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు చాలా వరకు వైట్‌ప్లేట్‌ వాహనాల్లోనే తిరుగుతూ ఎల్లో ప్లేట్‌ పేరిట బిల్లులు డ్రా చేసుకుంటుండడం గమనార్హం.

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో కొంతమంది అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ఇంకా కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా స్థాయితో పాటు కొంతమంది క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లే అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేని చోట అద్దె వాహనాల వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత వాహనాల్లోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ‘అద్దె’ను సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది వైట్‌ ప్లేట్‌ వాహనాల్లో వెళ్తూ ఇతరుల పేరిట బిల్లులు తీసుకుంటున్నారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో..
ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా శాఖల్లో ప్రభుత్వ వాహనాలు లేని అధికారులకు ట్యాక్స్‌ ప్లేట్‌ వాహనాలు అద్దెకు తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర శాఖల నుంచి నిరుద్యోగులకు ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ వంటి స్కీమ్‌లను ప్రవేశపెట్టి వాహనాలను సబ్సిడీ రూపంలో అందించింది. ఆయా శాఖల్లో వాహనాలు అద్దెకు పెట్టేందుకు అనుమతినిచ్చింది. అయితే కొంతమంది అధికారులు ఎల్లో ప్లేట్‌కు బదులు వైట్‌ ప్లేట్‌ వాహనాలనే వినియోగిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు.

బిల్లులు తీసుకునే సమయంలో ఇతరుల వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు విషయం తెలిసినప్పటికీ ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు 2,500 కిలో మీటర్లు వాహనం తిరగాల్సి ఉంటుంది. ఇందుకు గాను రూ.33వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొంతమంది అధికారులు తమ వాహనాల్లో తక్కువ కిలో మీటర్లు తిరుగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాహనాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకపోయినా టూర్‌ డైరీలో మాత్రం వెళ్లినట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి.
చదవండి: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్‌ చేసి

సర్కారు ఆదాయానికి గండి..
ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వినియోగించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వైట్‌ ప్లేట్‌ వాహనాలను సొంత పనులకు మాత్రమే వినియోగించాలి. వీటికి పన్ను చెల్లింపు ఉండదు. ఎల్లో ప్లేట్‌ ట్యాక్స్‌ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అద్దె కోసం వినియోగించాల్సి ఉంటుంది. వీటికి మాత్రం ఫిట్‌నెస్, ఏడాదికి ఇన్సూరెన్స్‌ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రం దాటితే టీపీ తీయాలి. అయితే ఇలాంటివి పన్నులు లేకుండా కొందరు అధికారులు తమ సొంత వాహనాలనే వినియోగిస్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన వాహనాలుగా చూపుతూ వారికి నెలకు రూ.1500 నుంచి రూ.2వేలు వరకు చెల్లిస్తున్నారు.

అదే బాటలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు..
జిల్లాలో 18 మండలాలున్నాయి. క్షేత్రస్థాయిలో ప ర్యటించే తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ప్రభుత్వం అద్దె వాహన సౌకర్యం కల్పించింది. కొంతమంది మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అద్దె వాహనాలు వినియోగించాల్సి ఉన్నా కాసులకోసం కక్కుర్తి పడుతూ తమ సొంత వాహనాలనే విని యోగిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. రోజు కార్యాలయానికి వచ్చేది వైట్‌ ప్లేట్‌ వాహనంలోనే అయినా.. బిల్లులు మాత్రం ఎల్లో ప్లేట్‌కు సంబంధించి తీసుకుంటున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్‌ నటరాజ్, డీఆర్డీవో కిషన్‌ను ఫోన్‌లో సంప్రదించగా వారు సమావేశంలో ఉన్నామని తెలిపారు. వివరాలు తెలిపేందుకు అందుబాటులోకి రాలేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement