Car number plate
-
ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తన చిన్నప్పటి జ్ఞాపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోడు, ఎందుకంటే మళ్ళీ అలాంటి రోజులు కావాలనుకున్న దొరకవు. కష్టాలు, సుఖాలు తెలియకుండా ఎంతో సంతోషంగా గడిచిపోయిన రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటే ఆ అనుభూతి వర్ణానాతీతం అనే చెప్పాలి. అయితే ఇటీవల ఒక వ్యక్తి తాను చదువుకునే రోజుల్లో ప్రయాణించి బస్సు నెంబర్‌ను తన కొత్త కారుకి తీసుకున్నాడు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో స్థిరపడిన బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఒక టెస్లా కారుని కొనుగోలు చేశారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న ఈ కారుకి ఫ్యాన్సీ నెంబర్ కాకుండా తన చిన్నతనంలో ప్రయాణించిన బస్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలిన నెంబర్ తీసుకున్నాడు. ఇందులో అంత గొప్ప ఏముందని కొంత మంది అనుకోవచ్చు. అయితే ఇది అతని బాల్యం మీద, ఆ బస్సు మీద ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. ధనపాల్ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి 1992లో బెంగళూరులోని విద్యారణ్యపుర & యశ్వంత్ పుర మధ్య బీఎంటీసీ బస్సులో ప్రయాణించినట్లు, ఆ బస్సు నడిపిన డ్రైవర్ చెంగప్ప గౌరవార్థంగా ఆ బస్సు నెంబర్ తన కారుకి పెట్టుకున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. సుమారు మూడు దశాబ్దాల కిందట ధనపాల్ ప్రయాణించిన బస్సు నెంబర్ 'KA01F232' ఇప్పుడు తన కొత్త కారుకి తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఆ బస్సుతో ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనదని, దాంతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆ బస్సు నడిపిన డ్రైవర్ ఇప్పుడు రిటైర్ అయ్యారని ఆయన మీద గౌరవంతో ఈ నెంబర్ తీసుకున్నట్లు కూడా వెల్లడించాడు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) BMTC మీద ఉన్న ప్రేమకు, చిన్నప్పుడు స్కూలుకి వెళ్లిన బస్సుని, దానిని డ్రైవ్ చేసిన డ్రైవర్‌ను గుర్తుపెట్టుకుని గౌరవించడం చాలా గొప్ప విషయం అని పలువురు నెటిజన్లు ధనపాల్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
వామ్మో! రూ. 122 కోట్లకు అమ్ముడైన కారు నెంబర్ ప్లేట్
కారు ధర అంటే లక్షల్లో ఉంటుందని, ఇంకా ఖరీదైన లగ్జరీ కార్లు అయితే కోట్ల రూపాయల వరకు ఉంటాయని అందరూ వినే ఉంటారు. అయితే ఇటీవల ఒక నెంబర్ ప్లేట్ ఏకంగా రూ. 122 కోట్లకు అమ్ముడైంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దాని పూర్తి వివరాలేంటి అనేది ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, దుబాయ్‌లో మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలంలో ‘పీ 7' (P 7) అనే ఓ వీఐపీ కారు నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయింది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 122. 6 కోట్లు. ఇంత ధరకు అమ్ముడుపోవడంతో ఇది ప్రపంచంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇంత డబ్బు చెల్లించి ఈ నెంబర్ ప్లేట్ ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం వెల్లడి కాలేదు. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని 'వంద కోట్ల భోజనాల వితరణ నిధి' (1 Billion Meals Endowment) కార్యక్రమానికి అందించనున్నట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా ఆహార సాయం కోసం భారీ దాతృత్వ నిధిని సేకరించేందుకు ఈ బిలియన్ మీల్ ఎండోమెంట్ కార్యక్రమం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. (ఇదీ చదవండి: కృతి కర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!) ప్రపంచంలోని చాల దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు, ఇతరత్రా కారణాల వల్ల మరణించే వారికంటే రోజూ ఆకలి బాధతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో ఆకలిపై యుద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమిరేట్ ఆక్షన్స్, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ సంయుక్తంగా ఈ వేలాన్ని నిర్వహించాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) వేలంలో పీ7 మాత్రమే కాకుండా ఏఏ19, ఏఏ22, ఏఏ80, ఓ71, ఎక్స్36, డబ్ల్యూ78, హెచ్31, జెడ్37, జే57, ఎన్41 వంటి 10 నెంబర్ ప్లేట్స్ విక్రయించారు. ఇందులో వై900, క్యూ22222, వై6666 లాంటి స్పెషల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఏఏ19 నంబర్ ప్లేట్ ఈ వేలంలో 4.9 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోగా.. ఓ71 నంబర్ ప్లేట్ 1.50 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించారు. -
అధి‘కార్ల’ బాగోతం.. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తి పోలేదు!
ఇక్కడ కనిపిస్తున్న వాహనాన్ని ఓ ఐసీడీఎస్ అధికారి వినియోగిస్తున్నారు. కారుపైన ‘ఆన్ గౌట్ డ్యూటీ’ అని రాసి ఉంది. నిబంధనల ప్రకారం ఎల్లో ప్లేట్ వాహనం వినియోగించాలి. కానీ ఇందులోనే సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈయనొక్కరే కాదు.. ఆర్అండ్బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, వైద్యారోగ్యశాఖ, వయోజన విద్య, బీసీ వెల్ఫేర్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డీపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు చాలా వరకు వైట్‌ప్లేట్ వాహనాల్లోనే తిరుగుతూ ఎల్లో ప్లేట్ పేరిట బిల్లులు డ్రా చేసుకుంటుండడం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ఇంకా కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా స్థాయితో పాటు కొంతమంది క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లే అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేని చోట అద్దె వాహనాల వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత వాహనాల్లోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ‘అద్దె’ను సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది వైట్ ప్లేట్ వాహనాల్లో వెళ్తూ ఇతరుల పేరిట బిల్లులు తీసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా శాఖల్లో ప్రభుత్వ వాహనాలు లేని అధికారులకు ట్యాక్స్ ప్లేట్ వాహనాలు అద్దెకు తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర శాఖల నుంచి నిరుద్యోగులకు ఓనర్ కమ్ డ్రైవర్ వంటి స్కీమ్‌లను ప్రవేశపెట్టి వాహనాలను సబ్సిడీ రూపంలో అందించింది. ఆయా శాఖల్లో వాహనాలు అద్దెకు పెట్టేందుకు అనుమతినిచ్చింది. అయితే కొంతమంది అధికారులు ఎల్లో ప్లేట్‌కు బదులు వైట్ ప్లేట్ వాహనాలనే వినియోగిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. బిల్లులు తీసుకునే సమయంలో ఇతరుల వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు విషయం తెలిసినప్పటికీ ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు 2,500 కిలో మీటర్లు వాహనం తిరగాల్సి ఉంటుంది. ఇందుకు గాను రూ.33వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొంతమంది అధికారులు తమ వాహనాల్లో తక్కువ కిలో మీటర్లు తిరుగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాహనాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకపోయినా టూర్ డైరీలో మాత్రం వెళ్లినట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. చదవండి: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి సర్కారు ఆదాయానికి గండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వినియోగించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వైట్ ప్లేట్ వాహనాలను సొంత పనులకు మాత్రమే వినియోగించాలి. వీటికి పన్ను చెల్లింపు ఉండదు. ఎల్లో ప్లేట్ ట్యాక్స్ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అద్దె కోసం వినియోగించాల్సి ఉంటుంది. వీటికి మాత్రం ఫిట్నెస్, ఏడాదికి ఇన్సూరెన్స్ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రం దాటితే టీపీ తీయాలి. అయితే ఇలాంటివి పన్నులు లేకుండా కొందరు అధికారులు తమ సొంత వాహనాలనే వినియోగిస్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన వాహనాలుగా చూపుతూ వారికి నెలకు రూ.1500 నుంచి రూ.2వేలు వరకు చెల్లిస్తున్నారు. అదే బాటలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు.. జిల్లాలో 18 మండలాలున్నాయి. క్షేత్రస్థాయిలో ప ర్యటించే తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ప్రభుత్వం అద్దె వాహన సౌకర్యం కల్పించింది. కొంతమంది మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అద్దె వాహనాలు వినియోగించాల్సి ఉన్నా కాసులకోసం కక్కుర్తి పడుతూ తమ సొంత వాహనాలనే విని యోగిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. రోజు కార్యాలయానికి వచ్చేది వైట్ ప్లేట్ వాహనంలోనే అయినా.. బిల్లులు మాత్రం ఎల్లో ప్లేట్‌కు సంబంధించి తీసుకుంటున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్ నటరాజ్, డీఆర్డీవో కిషన్‌ను ఫోన్లో సంప్రదించగా వారు సమావేశంలో ఉన్నామని తెలిపారు. వివరాలు తెలిపేందుకు అందుబాటులోకి రాలేదు. -
ఆ నెంబర్ ప్లేట్ జస్ట్ రూ.132 కోట్లు మాత్రమే...!
భారతీయులకు ఫ్యాన్సీ నెంబర్లున్న వాహనాలంటే ఎంత క్రేజే మనందరికీ తెలిసిందే. సినిమాస్టార్స్, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల సెలబ్రెటీలు మొదలుకుని ఒకస్థాయి వారి వరకు తమ వాహనానికి కోరుకున్న అంకెలున్న రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశంలో ప్రాంతీయ రవాణా సంస్థల వేలంలో 9999, 6666, 1234, 786, AK 47. 8055 (ఇంగ్లిష్ అక్షరాల్లో బాస్‌గా కనిపించే సారూప్యత కారణంగా) ఇలా వారి వారి అభిరుచులకు అనుగుణంగా కార్లు, ద్విచక్ర వాహనాల నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి లక్కీ నెంబర్‌ను ఎంత ధరకు దక్కించవచ్చునని అనుకుంటున్నారు ? లక్షో, రెండు లక్షలో అంతగా కాకపోతే, మరీ ఇష్టపడి తప్పనిసరిగా పలానా నెంబర్‌నే దక్కించుకోవాలని అనుకుంటే ఎక్కువలో ఎక్కువ 20 లక్షల వరకు పెట్టవచ్చునని ఉదారంగా అంచనా వేసుకోవచ్చు. కానీ...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన ఈ నెంబర్ ప్లేట్ ధర అక్షరాలా రూ. 132 కోట్లు. ఇంత డబ్బుకు 4,500 మారుతి సుజుకి ఆల్టో కార్లు,, పది విలువైన బుగాటి వేయ్రాన్స్ కార్లు వస్తాయి. శ్రీమంతులైన కస్టమర్లు కోరుకున్న విధంగా హై ఎండ్ లగ్జరీ కార్లకు అదనపు సొబగులు, మరిన్ని ప్రత్యేకతలు కల్పిస్తున్న ప్రపంచ ప్రసిద్ద ‘ఖాన్ డిజైన్స్’ అధిపతి అఫ్జల్ ఖాన్ 1.45 కోట్ల పౌండ్లకు ఈ నెంబర్‌ను బ్రిటన్‌లో వేలానికి పెట్టాడు. ఇంతకీ ఈ నెంబర్ ఏమిటంటే...అత్యంత వేగంగా నడిపే కార్లతో పోటీ నిర్వహించే అంతర్జాతీయ క్రీడకు ప్రాతినిధ్యంగా నిలిచే ఎఫ్–1 (ఫార్మూలా–1) అనే నెంబర్ అది. ఎఫ్ అక్షరంతో పాటు ఒకే డిజిట్ 1 అంకె కారణంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ నెంబర్‌ను ఖాన్ తన బుగాటి వేయ్రాన్ కారుకు ఉపయోగిస్తున్నాడు. 2008లో ఈ నెంబర్‌ను ఆయన దాదాపు రూ. 4 కోట్లకు (6.19 లక్షల డాలర్లకు) కొన్నాడు. ఇప్పుడు దానిని 3,200 శాతం ఎక్కువ లాభానికి అమ్మాలని అనుకుంటున్నాడు. 1904 నుంచి 104 ఏళ్ల పాటు ఈ నెంబర్ ప్లేట్‌కు ఎసెక్స్ సిటీ కౌన్సిల్ సొంతదారుగా ఉంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కృపారాణి ఇంకా లోక్‌సభ సభ్యురాలేనా?
శ్రీకాకుళం : కేంద్ర మాజీ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కారు నంబరు ప్లేట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె వాహనం నంబరు ప్లేట్‌పై ‘మెంబర్ ఆఫ్ లోక్‌సభ’అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆమె గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గురువారం కలెక్టరేట్ వద్ద వివిధ సంఘాలు, ప్రభుత్వ పథకాల మహిళా ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఐటీయూకు మద్దతుగా కృపారాణి వచ్చి వాళ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వాహనం నంబరు ప్లేట్ చూసి ఔరా! పదవిపై ఇంకా కోరిక తీరలేదా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.