భారతీయులకు ఫ్యాన్సీ నెంబర్లున్న వాహనాలంటే ఎంత క్రేజే మనందరికీ తెలిసిందే. సినిమాస్టార్స్, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల సెలబ్రెటీలు మొదలుకుని ఒకస్థాయి వారి వరకు తమ వాహనానికి కోరుకున్న అంకెలున్న రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశంలో ప్రాంతీయ రవాణా సంస్థల వేలంలో 9999, 6666, 1234, 786, AK 47. 8055 (ఇంగ్లిష్ అక్షరాల్లో బాస్‌గా కనిపించే సారూప్యత కారణంగా) ఇలా వారి వారి అభిరుచులకు అనుగుణంగా కార్లు, ద్విచక్ర వాహనాల నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు.
అయితే ఇలాంటి లక్కీ నెంబర్‌ను ఎంత ధరకు దక్కించవచ్చునని అనుకుంటున్నారు ? లక్షో, రెండు లక్షలో అంతగా కాకపోతే, మరీ ఇష్టపడి తప్పనిసరిగా పలానా నెంబర్‌నే దక్కించుకోవాలని అనుకుంటే ఎక్కువలో ఎక్కువ 20 లక్షల వరకు పెట్టవచ్చునని ఉదారంగా అంచనా వేసుకోవచ్చు. కానీ...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన ఈ నెంబర్ ప్లేట్ ధర అక్షరాలా రూ. 132 కోట్లు. ఇంత డబ్బుకు 4,500 మారుతి సుజుకి ఆల్టో కార్లు,, పది విలువైన బుగాటి వేయ్‌రాన్స్ కార్లు వస్తాయి. శ్రీమంతులైన కస్టమర్లు కోరుకున్న విధంగా హై ఎండ్ లగ్జరీ కార్లకు అదనపు సొబగులు, మరిన్ని ప్రత్యేకతలు కల్పిస్తున్న ప్రపంచ ప్రసిద్ద ‘ఖాన్ డిజైన్స్’ అధిపతి అఫ్జల్ ఖాన్ 1.45 కోట్ల పౌండ్లకు ఈ నెంబర్‌ను బ్రిటన్‌లో వేలానికి పెట్టాడు.
ఇంతకీ ఈ నెంబర్ ఏమిటంటే...అత్యంత వేగంగా నడిపే కార్లతో పోటీ నిర్వహించే అంతర్జాతీయ క్రీడకు ప్రాతినిధ్యంగా నిలిచే ఎఫ్–1 (ఫార్మూలా–1) అనే నెంబర్ అది. ఎఫ్ అక్షరంతో పాటు ఒకే డిజిట్ 1 అంకె కారణంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ నెంబర్‌ను ఖాన్ తన బుగాటి వేయ్‌రాన్ కారుకు ఉపయోగిస్తున్నాడు. 2008లో ఈ నెంబర్‌ను ఆయన దాదాపు రూ. 4 కోట్లకు (6.19 లక్షల డాలర్లకు) కొన్నాడు. ఇప్పుడు దానిని 3,200 శాతం ఎక్కువ లాభానికి అమ్మాలని అనుకుంటున్నాడు. 1904 నుంచి 104 ఏళ్ల పాటు ఈ నెంబర్ ప్లేట్‌కు ఎసెక్స్ సిటీ కౌన్సిల్ సొంతదారుగా ఉంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment