విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శిల్పా చక్రపాణి రెడ్డి, చిత్రంలో బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, హఫీజ్‌ఖాన్, మురళీ కృష్ణ తదితరులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భృతి విషయంలో నిరుద్యోగుల చెవిలో సీఎం చంద్రబాబునాయుడు పూలు పెట్టారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నెలకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని..ఇప్పుడు ఒక్క వేలు చూపుతూ రూ.1000 ఇస్తానని, దానికి ముఖ్యమంత్రి యువనేస్తం అని పేరు పెట్టుకోవడం దారుణమన్నారు.
వచ్చే ఎన్నికల్లో దాచుకున్న వేలు నిరుద్యోగులు కట్ చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే 12 లక్షల మందికే భృతి వచ్చేలా మంత్రి నారా లోకేష్‌బాబు 600 గంటలు కష్టపడి నిబంధనలను రూపొందించారన్నారు. చంద్రబాబునాయుడు..లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి ఉద్యోగాన్ని ఇచ్చారని, యువతీ, యువకులను మాత్రం మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి నిబంధనలు సడలించకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువతీయువకులతో కలసి పోరాటాలకు పిలుపునిస్తామన్నారు.
ఆ నిధులు ఎప్పుడిస్తారు?
రైతు రుణమాఫీకి రూ.11,500 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, అక్క చెల్లెమ్మలకు రూ. 4 వేల కోట్ల నిధులను జమ చేయాల్సి ఉందని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మరో ఐదారు నెలల్లో ప్రభుత్వ సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారికి పింఛన్ ఇస్తామంటే టీడీపీ నాయకులు అవహేళన చేశారని, అయితే సీఎం చంద్రబాబునాయుడు మాత్రం డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టుకునే వారికి 40 ఏళ్లకే రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో పయనించడం కాదా అని ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీరు–చెట్టు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 1.49 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో 720 భారీ పరిశ్రమలు, 2.27 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం దారుణమన్నారు. ఇలా గొప్పలు చెప్పుకుంటే పోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక హోదాను ఇస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, టీడీపీ నాయకులకు అవినీతి సొమ్ముతో పొట్టలు వచ్చాయన్నారు.
కాపులను మోసగించిన చంద్రబాబు
కాపులను బీసీల్లోకి చేరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేశా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసే పనులనే చెబుతారని, ఆయన మాటే గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం నుంచి తిరిగి వచ్చినా చంద్రబాబు స్పందించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
ఎన్నికలంటే టీడీపీకి భయం
ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం అని తేలిపోయిందన్నారు. అందులో భాగంగానే సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో అడ్డగోలుగా గెలిచేందుకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ తీసివేస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఓటర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఒటు హక్కును పొందాలని సూచించారు. కార్యక్రమంలో కోడుమూరు, కర్నూలు సమన్వకర్తలు మురళీకృష్ణ, హఫీజ్‌ఖాన్, నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, అబ్దుల్ రెహమాన్, పర్ల శ్రీధర్‌రెడ్డి, సత్యంయాదవ్, తోట కృష్ణారెడ్డి, ఆది మోహన్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, భాస్కరరెడ్డి, ఆసిఫ్, మహేశ్వరరెడ్డి, శీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment