విలేకరులతో మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య
ఆత్మకూరు: రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలన సాగుతోందని, ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడనున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలన్నీ టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేస్తున్నారన్నారు. అమరావతిలోని అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఒకవైపు మోసగిస్తూ..మరోవైపు తాము ధర్మపోరాటం చేస్తున్నామని నీతులు చెప్పడం సిగ్గు చేటన్నారు. పొదుపు మహిళలు, రైతులను రుణమాఫీ పేరుతో నిలువునా ముంచినందుకా దీక్షలు అంటూ ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని సంతల్లా పశువుల్లా కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అది డ్రామా అంటూ టీడీపీ వారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలనూ రాజీనామా చేయిస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులను సైతం చంద్రబాబు వదలలేదని, వారిపై నిందారోపణలు చేయడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారని, రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
నాలుగేళ్ల పాలనలో టీడీపీ విఫలం: బీవై రామయ్య
నాలుగేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు 600 హామీలిచ్చి అందులో 70 కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
హామీలను నెరవేర్చనందున వచ్చే ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మైనార్టీలకు ఒరిగిందేమీలేదన్నారు. దుల్హన్ పథకం కింద రుణాలు అందడం లేదన్నారు. కాగా.. ఆత్మకూరు పట్టణంలోని 23 మసీదుల వద్ద ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును శిల్పా చక్రపాణిరెడ్డి ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment