సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అడ్డగోలు నిబంధనలు విధిస్తూ, వాటిని తరచూ మార్పు చేస్తూ తమ జీవితాలతో చెలగాటమాడుతోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఏపీపీఎస్సీ తప్పులకు తాము బలవ్వాలా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే మే 26న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు సంబంధించి కమిషన్ నిర్ణయంతో అన్యాయం జరిగిందని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌లో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే.. పరీక్షకు వారం ముందు అనుమతించబోమని ప్రకటించింది. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌కు అనుమతి ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడంతో నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. అలాగే పరీక్షలో ఆంగ్లం నుంచి తెలుగులో అనువాదం చేసి ఇచ్చిన ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయారు. వీటిపైనా అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
డీఏవో పరీక్షకూ షరతులు
జూలై 7న నిర్వహించే డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రిలిమ్స్ పరీక్షకు కూడా క్యాలిక్యులేటర్ అనుమతిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఏపీపీఎస్సీ శుక్రవారం అనుమతి ఇవ్వబోమని వెబ్‌నోట్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో ఒకటి పేర్కొని పరీక్ష సమయంలో మరో నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అభ్యర్థులు అంటున్నారు. క్యాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నోటిఫికేషన్‌లో ముందే పేర్కొని ఉంటే దానికనుగుణంగా సన్నద్ధమయ్యేవారమని చెబుతున్నారు. ఇదంతా పరిశీలిస్తే.. సకాలంలో పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేసేందుకు, అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కేలా కావాలనే ఇలా చేస్తుందనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక నిష్పత్తి పైనా..
కాగా.. ఏపీపీఎస్సీ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలు కూడా అభ్యర్థులకు శాపంగా మారుతున్నాయి. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ.. ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా అభ్యర్థుల నిష్పత్తిపై నిర్ణయాన్ని ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఏ నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారో ఏపీపీఎస్సీ ముందుగా వెల్లడించడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గతంలోని నోటిఫికేషన్ పోస్టులకు అదనంగా 400 పోస్టులు జత చేసి 1:50 నిష్పత్తిలో ఎంపికకు అవకాశం కల్పించారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్య పెరగకపోయినా కనీసం మెయిన్స్‌కు అవకాశం కల్పించాలని నిరుద్యోగులు వేడుకుంటున్నా కమిషన్ వారి మొర ఆలకించడం లేదు. గతంలో గ్రూప్–1కు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు అన్నింటికీ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. దీంతో అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు శిక్షణా కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఆప్టిట్యూడ్ ప్రశ్నలపైనా అదే తీరు
యూపీఎస్సీ తరహా అంటూనే ఏపీపీఎస్సీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో యూపీఎస్సీ.. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టింది. దీనిలో పూర్తిగా అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన పరీక్షలో అర్థమెటిక్ అవసరం లేదని, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ అంశాలు ఉంటే చాలని పలువురు అభిప్రాయపడ్డారు. అర్థమెటిక్ అంశాల వల్ల తమకు నష్టం జరుగుతుందని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో యూపీఎస్సీ సీ–శాట్ పేపర్‌ను కేవలం క్వాలిఫైయింగ్ పేపర్‌గా మార్చింది. కానీ ఇప్పుడు ఏపీపీఎస్సీ అదే ఆప్టిట్యూడ్ ప్రశ్నలను గ్రూప్–1లో ప్రవేశపెట్టడంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు.
తెలుగులో ప్రశ్నలు ఇవ్వకుండా..
కొన్ని కేటగిరీల పోస్టులకు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతామని, తెలుగు మాధ్యమంలో ప్రశ్నలు ఉండవని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రకటించడం కూడా వివాదాస్పదంగా మారింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. యూపీఎస్సీ, బ్యాంకింగ్ నియామక సంస్థలే అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు అడుగుతుండగా ఏపీపీఎస్సీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మరోపక్క కొన్ని కేటగిరీల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నలు అడుగుతున్నా అనువాదంలో అనేక తప్పులు ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ తెలుగు మాధ్యమ ప్రశ్నల్లో ఏకంగా 36 ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
కమిషన్ చైర్మన్ తీరుపై నిరసన
కాగా.. గతంలో ఎన్నడూ లేని వివాదాలు ప్రస్తుత చైర్మన్ పి.ఉదయభాస్కర్ హయాంలోనే ఏపీపీఎస్సీని చుట్టుముడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నియమితులైన ఈయన ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలో గ్రూప్–2లో పేపర్ లీకేజీ ఆరోపణల వివాదంపై పలువురిపై అక్రమంగా కేసులు పెట్టించారని, ఇప్పటికీ విచారణకు రావాల్సిందిగా సీఐడీ నుంచి నోటీసులు వస్తున్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ హయాంలో తమకు న్యాయం జరగదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment