పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు
పరీక్ష రాయనున్న 1,48,881 మంది
ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
ఇక, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారన్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులకు సూచించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment