
సాక్షి, హైదరాబాద్: తమపై జరుగుతున్న అసత్య ప్రచారం.. సంచలన ఆరోపణలపై తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్లు, వాళ్ల తల్లిదండ్రులు స్పందించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. రీవాల్యూయేషన్ పేరిట హైకోర్టు వీళ్ల ఆశలపై నీళ్లు చల్లని సంగతి తెలిసిందే. అదే సమయంలో రాజకీయంగానూ వీళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సుమారు 200 మంది అభ్యర్థులు, వాళ్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియలో అవకతవకలు, పేపర్ మూల్యాంకనంలో అక్రమాలు, రాజకీయ జోక్యం ఉన్నాయని ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగానికి రూ.3 కోట్ల చొప్పున రూ.1700 కోట్ల కుంభకోణం జరిగిందనే ప్రభుత్వం, రిక్రూట్‌మెంట్ బోర్డుపైనా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు.. మెయిన్స్ పరీక్షల వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయని, కొందరికి అసాధారణ ర్యాంకులు వచ్చాయని.. ఆఖరికి పరీక్ష రాయనివారికి కూడా ఫలితాలు ఇచ్చారని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ర్యాంకులు రద్దుచేస్తూ రీవాల్యూయేషన్ జరపాలని ఆదేశించింది.
అయితే అప్పులు చేసి తమ పిల్లల్ని చదివించుకున్నామని.. అలాంటిది రూ.3 కోట్లు లంచాలు ఇచ్చి ఉద్యోగులు కొన్నామనే ప్రచారం తగదని తల్లిదండ్రులు వాపోయారు. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమలో కొందరికి తెలియదని అన్నారు
‘‘పస్తులుండి.. అప్పులు చేసి చదివించాం.. కష్టపడి మా పిల్లలు ఉద్యోగాలు సంపాదించారు. పేద విద్యార్థులే కష్టపడి గ్రూప్ 1ల్లో మెరిట్ ర్యాంకులు సాధించారు. రూ.3 కోట్లు చెల్లించి ఉద్యోగాలు కొనుగోలు చేశామనే ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం ఎంతగానో బాధిస్తోంది. అంత డబ్బే ఉంటే వేరే వ్యాపారాలు చేసుకునేవాళ్లం. నిరుద్యోగులు పెళ్లిళ్లు చేసుకోకుండా.. కొన్ని ఏళ్ల నుంచి చదువుకున్నారు. యూపీఎస్సీ పరీక్షల కోసం కాకుండా ఈ పరీక్ష కోసమే ప్రిపేర్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు అసత్య ఆరోపణలు మనోవేదనకు గురి చేస్తున్నాయి.
రాజకీయాలు పార్టీల మధ్య ఉండాలి కానీ నిరుద్యోగులపై చూపించొద్దు. ఎన్నికల్లో ఓడితే మళ్లీ ఎన్నికలు పెట్టమని కోర్టులకెళ్తారా?. ఆరోపణలు చేస్తున్నవాళ్లు వాటిని నిరూపించాలి. వాటిపై ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. గ్రూప్-1ను ఇంకెంత కాలం నిర్వహిస్తారో రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టత ఇవ్వాలి. మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి.’’ అని ర్యాంకర్ల తల్లిదండ్రులు పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ‘‘ఉద్యోగ భర్తీ మీద రాజకీయాలు ఎందుకు?’’, ‘‘మూడు కోట్లు ఎక్కడ?’’ అంటూ పలు ఫ్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలియజేశారు.
x

హైకోర్టులో ఏం జరిగింది?
మెయిన్స్ వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయన్న వాదనలతో హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏకీభవించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్లను తిరిగి రీవాల్యూయేషన్ చేయాలని, ఈసారి అవకతవకలు లేకుండా చూడాలని, మళ్లీ అవకతవకలు జరిగినట్లు తేలితే ఊరుకోబోమని.. మళ్లీ పరీక్షకు తామే ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 8 నెలల్లోగా రీవాల్యూయేషన్ ప్రకక్రియ పూర్తి చేయాలని, అలాకాని పక్షంలో మళ్లీ పరీక్ష నిర్వహించే దిశగా ఆలోచనలు చేయాలని సూచించింది.
మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30న ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచింది. కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు, పత్రాల పరిశీలన, విశ్లేషణ అనంతరం మంగళవారం 222 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. అయితే.. కష్టపడి చదివిన తమ శ్రమ వృధా అవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు ర్యాంకర్లు హైకోర్టు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు.