group1
-
group-1 : ఎగ్జామ్‌లో కాపీ..చీరకొంగులో చిట్టీలు..పట్టుబడ్డ అభ్యర్థి
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌లో కాపీయింగ్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరిగింది. అయితే పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.చీర కొంగులో చిట్టీలు అతికించుకొచ్చిన అభ్యర్థి పరీక్ష జరిగే సమయంలో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. అయితే కాపియింగ్‌కు పాల్పడే సమయంలో పోలీసులు అధిపులోకి తీసుకున్నారు.మహబూబ్ నగర్లో ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న ఇస్లావత్ లక్ష్మీపై టీజీపీఎస్ఈ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలుతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. -
తొలిసారే ఈ గడ్డు పరిస్థితులు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునున్నామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అనేకమంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులుగా చేసింది.పార్టీ పెట్టిన తర్వాత మెదటిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి పదవినికి కాపాడుకునే పనిలో ఉన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. పోరాటాలు మనకు కొత్త కాదు. రాజకీయ ఉద్దండులతోనే మన పార్టీ కొట్లాడింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో నష్టం చేస్తున్నారు. తమకు అండగా నిలవాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని తీసుకొచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారు.తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవు.రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. 12వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద సభ నిర్వహిస్తాం. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29ను తెచ్చారు. జీవో 29వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోంది.నవంబర్ 5న జరిగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పాలనలో భాదపడని వారు లేరు. సిద్ధిపేటలో ఒకే ఇంట్లో నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయి. హరీష్ రావు కుట్రతోనే నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి అనుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరంకాదు. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడదు?కవితను అక్రమంగా ఐదు నెలల్లో జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు ప్రత్యుర్థులే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. అందరికి అవకాశాలు వస్తాయి’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారన్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులకు సూచించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలైన రేణుక భర్త డాక్యా ఆమెకు తెలియకుండానే మరో ఇద్దరికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి ప్రశ్నపత్రాలను మరో నిందితుడు ప్రవీణ్ నుంచి అందుకున్న రేణుక... తన బంధువు ద్వారా నీలేష్ , గోపాల్లతోనే పేపర్ల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కు చెప్పి ప్రశ్నపత్రాలు తీసుకునేప్పుడే రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డదారిలో రాసిన ‘ప్రవీణ్ అండ్ కో’మెయిన్స్‌ను అదే పంథాలో క్లియర్ చేయాలనే పథకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేయొద్దని ప్రవీణ్ రేణుకకు చెప్పాడు. అందుకే రేణుక తన భర్తతో కలిసి నీలేష్, గోపాల్‌లను ఇంటికే తీసుకెళ్లి చదివించింది. అయితే ఈ పేపర్లను మరో ఇద్దరికి అమ్మి ఎక్కువ మొత్తం సొమ్ము చేసుకోవాలని డాక్యా భావించాడు. ఇందులో భాగంగానే భార్యకు చెప్పకుండా తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ అనే మరో ఇద్దరు అభ్యర్థులకు ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సులు సైతం తీసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ నెల 4న (పరీక్ష ముందురోజు రాత్రి) హైదరాబాద్‌లో తాము బస చేసిన ఓ లాడ్జికి రప్పించి పేపర్లు అందించాడు. ప్రవీణ్ ఇంటి నుంచి నగదు స్వాదీనం... ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆర్జించిన రేణుక అందులో రూ. 10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. రెండు దఫాలుగా ఈ డబ్బు అందుకున్న ప్రవీణ్ అందులో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. అకౌంట్లో ఉన్న డబ్బును ప్రవీణ్ అరెస్టు సందర్భంలోనే అధికారులు గుర్తించారు. అదనపు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తున్న సిట్ అధికారులు సోమవారం బడంగ్‌పేటలోని మల్లికార్జునకాలనీలో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ లభించిన రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌లను అరెస్టు చేసిన సిట్ పోలీసులు... సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. వారి నుంచి మరెవరికైనా పేపర్ అందిందా అనే కోణంలో ఆరా తీయనున్నారు. గ్రూప్–1 టాపర్లకు సామర్థ్య పరీక్షలు.. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100కుపైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే 53 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు... అభ్యర్థుల సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. నిపుణులతో మరో ప్రశ్నపత్రం తయారు చేయించి వాటికి సమాధానాలు రాయించడం ద్వారా అభ్యర్థుల సమర్థతను పరీక్షిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వచ్చి గతేడాది గ్రూప్–1 పిలిమ్స్ రాసి 100కుపైగా మార్కులు పొందిన మరో నిందితుడైన రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌కు సిట్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. హ్యాకింగ్ ద్వారానే... పేపర్ల లీకేజీ కేసులో అదనపు కస్టడీకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను రెండో రోజైన సోమవారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.ప్రవీణ్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌లను లోతుగా విచారించి పేపర్ల లీకేజీ అంశంలో మరో చిక్కుముడిని విప్పారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న శంకరలక్ష్మి కంప్యూటర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్ సిస్టం ద్వారా హ్యాక్ చేసిన రాజశేఖర్ అందులోంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్నట్లు తేల్చారు. -
నేడు గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష
- కర్నూలులో 20 సెంటర్లు ఏర్పాటు - పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 9,448 మంది - ఉదయం 10.30 నుంచి 1 గంట వరకు పరీక్ష కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరుకానున్న 9,448 మంది అభ్యర్థుల కోసం నగరంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. పరీక్ష పర్యవేక్షణకు ఏపీపీఎస్సీ నుంచి ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు వచ్చారు. కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, డోన్, పగిడ్యాల తహసీల్దార్లను లైజన్ ఆఫీసర్లుగా నియమించారు. ప్రతి సెంటరుకు ఒక డిప్యూటి తహసీల్దారును సిట్టింగ్ స్క్వాడ్‌గా నియమించారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు మొదలవుతుండగా అభ్యర్థులను 10.15 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కావున అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకుంటే మంచిది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకరావాలని సూచించారు. ఈ పరీక్షలోనూ మైనస్ మార్కులు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోను వైట్నర్ వాడరాదు. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాల్సి ఉంది. ఓఎంఆర్ షీట్లో అభ్యర్థుల ఫొటో, పేరు వివరాలుంటాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వైట్నర్ అనుమతించబోమని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. -
రేపు 20 సెంటర్లలో ప్రిలిమినరీ పరీక్ష
పకడ్బందీ నిర్వహణకు ఏర్పాట్లు నిమిషం ఆలస్యమైన అనుమతించం డీఆర్ఓ గంగాధర్ గౌడ్ కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు–1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 7వ తేదీ (ఆదివారం) జరుగనుంది. ఈ పరీక్షకు 9258 మంది హాజరు కానున్నారు. పరీక్ష కోసం కర్నూలు నగరంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది.. ఈ సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంటు లైజన్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు మాట్లాడుతూ... పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు మొదలవుతుందని, అభ్యర్ధులను 10.15 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమన్నారు. కర్నూలు, కల్లూరు, నందికోట్కూరు, డోన్, పగిడ్యాల తహశీల్దార్లను లైజన్ అధికారులుగా నియమించామని తెలిపారు. ప్రతి సెంటరుకు ఓ డిప్యూటీ తహసీల్దారును సిట్టింగ్ స్క్వాడ్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ స సెక్షన్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా హాల్ టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకరావాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, పరీక్షల సూపరింటెండెంటు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.