సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలైన రేణుక భర్త డాక్యా ఆమెకు తెలియకుండానే మరో ఇద్దరికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి ప్రశ్నపత్రాలను మరో నిందితుడు ప్రవీణ్ నుంచి అందుకున్న రేణుక... తన బంధువు ద్వారా నీలేష్ , గోపాల్‌లతోనే పేపర్ల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని ప్రవీణ్‌కు చెప్పి ప్రశ్నపత్రాలు తీసుకునేప్పుడే రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డదారిలో రాసిన ‘ప్రవీణ్ అండ్ కో’మెయిన్స్‌ను అదే పంథాలో క్లియర్ చేయాలనే పథకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేయొద్దని ప్రవీణ్ రేణుకకు చెప్పాడు. అందుకే రేణుక తన భర్తతో కలిసి నీలేష్, గోపాల్‌లను ఇంటికే తీసుకెళ్లి చదివించింది.
అయితే ఈ పేపర్లను మరో ఇద్దరికి అమ్మి ఎక్కువ మొత్తం సొమ్ము చేసుకోవాలని డాక్యా భావించాడు. ఇందులో భాగంగానే భార్యకు చెప్పకుండా తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ అనే మరో ఇద్దరు అభ్యర్థులకు ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సులు సైతం తీసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ నెల 4న (పరీక్ష ముందురోజు రాత్రి) హైదరాబాద్‌లో తాము బస చేసిన ఓ లాడ్జికి రప్పించి పేపర్లు అందించాడు.
ప్రవీణ్ ఇంటి నుంచి నగదు స్వాదీనం...
ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆర్జించిన రేణుక అందులో రూ. 10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. రెండు దఫాలుగా ఈ డబ్బు అందుకున్న ప్రవీణ్ అందులో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. అకౌంట్‌లో ఉన్న డబ్బును ప్రవీణ్ అరెస్టు సందర్భంలోనే అధికారులు గుర్తించారు. అదనపు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తున్న సిట్ అధికారులు సోమవారం బడంగ్‌పేటలోని మల్లికార్జునకాలనీలో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు.
అక్కడ లభించిన రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌లను అరెస్టు చేసిన సిట్ పోలీసులు... సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. వారి నుంచి మరెవరికైనా పేపర్ అందిందా అనే కోణంలో ఆరా తీయనున్నారు.
గ్రూప్–1 టాపర్లకు సామర్థ్య పరీక్షలు..
గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100కుపైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే 53 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు... అభ్యర్థుల సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు.
నిపుణులతో మరో ప్రశ్నపత్రం తయారు చేయించి వాటికి సమాధానాలు రాయించడం ద్వారా అభ్యర్థుల సమర్థతను పరీక్షిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వచ్చి గతేడాది గ్రూప్–1 పిలిమ్స్ రాసి 100కుపైగా మార్కులు పొందిన మరో నిందితుడైన రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌కు సిట్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
హ్యాకింగ్ ద్వారానే...
పేపర్ల లీకేజీ కేసులో అదనపు కస్టడీకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను రెండో రోజైన సోమవారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.ప్రవీణ్, మాజీ నెట్‌వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌లను లోతుగా విచారించి పేపర్ల లీకేజీ అంశంలో మరో చిక్కుముడిని విప్పారు.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న శంకరలక్ష్మి కంప్యూటర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్ సిస్టం ద్వారా హ్యాక్ చేసిన రాజశేఖర్ అందులోంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్నట్లు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment