TSPSC Paper Leakage Case Police Reveals Incidents Remand Report - Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ: మెయిన్‌ సర్వర్‌ నుంచే పేపర్‌ కొట్టేసిన ప్రవీణ్‌.. ఆపై కథ నడిపించిన రేణుక

Published Tue, Mar 14 2023 6:09 PM | Last Updated on Tue, Mar 14 2023 6:29 PM

TSPSC Paper Leakage Case Police Reveals Incidents Remand Report - Sakshi

టీఎస్‌పీఎస్‌సీ వద్ద బీజేపీ శ్రేణుల ఆందోళన.. పక్కన నిందితుడు ప్రవీణ్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ తన నేరాన్ని అంగీకరించినట్లు అందులో పేర్కొంటూనే.. ఈ మొత్తం తతంగం ఎలా జరిగిందనేది అందులో వివరించారు. 

మెయిన్‌ సర్వర్‌ నుంచే ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌ కుమార్‌. లూప్‌ ఉన్న కంప్యూటర్ల ద్వారా ఆ పేపర్‌ను సేకరించాడు. సేకరించిన పేపర్‌ను ప్రింట్‌ తీసుకుని తనతో సన్నిహితంగా ఉంటున్న రేణుకకు షేర్‌ చేశాడు ప్రవీణ్‌. ఆపై.. పేపర్‌ అమ్మేందుకు రేణుకు ఫ్యామిలీ చాలా ప్రయత్నాలే చేసింది. 

రేణుక తన కమ్యూనిటీలోని పలువురికి తన దగ్గర పేపర్‌ ఉందని సమాచారం ఇచ్చింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు ముఖ్యపాత్ర పోషించారు. ఒక్కో పేపర్‌కి రూ.20 లక్షలు డిమాండ్‌ చేసింది రేణుక. అయినప్పటికీ పేపర్‌ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాళ్లను తన ఇంట్లోనే ఉంచి ప్రిపేర్‌ చేసింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి.. సరూర్‌నగర్‌లోని సెంటర్‌ వద్ద స్వయంగా దింపేసి వెళ్లిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. 

ఇక ప్రవీణ్‌ ఫోన్‌లో చాలామంది మహిళల కాంటాక్ట్స్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లతో సంబంధాలు నడిపినట్లు నిర్ధారించుకున్నారు కూడా. అయితే ఇది హనీ ట్రాపా? లేదంటే పక్కా ప్రణాళికగా జరుగుతున్న స్కామా? అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

ఇదీ చదవండి: ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల అసభ్య ఫొటోలు

నిందితులకు 14 రోజుల రిమాండ్‌
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలోని నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. ఈ లీకేజ్‌ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచగా, వారికి రెండు వారాల పాటు రిమాండ్‌ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలోనే నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కస్టడీ కోరిన పోలీసులు
పేపర్ లీకేజీ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్‌ బేగంబజార్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన తొమ్మిది మందిని.. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement