సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పీడ్ పెంచింది. పేపర్ లీకేజీలో హవాలా లావాదేవీలకు అవకాశం ఉన్నందున వీటిపై దర్యాప్తు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ కేసులో కీలకమైన టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితోపాటు టీఎస్‌పీఎస్సీ తరఫున ఈ కేసులో ఫిర్యాదుదారు సత్యనారాయణలను గురువారం ఈడీ అధికారులు 10 గంటలపాటు విచారించినట్టు సమాచారం. శంకర లక్ష్మిని ఈ కేసులో కేవలం సాక్షిగానే సిట్ పేర్కొనగా.. ఇప్పుడు ఈడీ మాత్రం శంకర్ లక్ష్మి నుంచే దర్యాప్తు ప్రారంభించడం ఈ కేసు విచారణపర్వంలో కొత్త కోణంగా చెప్పవచ్చు. మొత్తం పేపర్ల లీకేజీ కుట్రకు శంకర్‌లక్ష్మి కంప్యూటర్ నుంచే మూలాలు ఉండడంతో తొలుత ఆమెను ఈడీ అధికారులు విచారించినట్టు సమాచారం.
ప్రధా నంగా ఈ కేసులో కీలక నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించి ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారని విచారణానంతరం శంకరలక్ష్మి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తన ఆధార్, పాన్ వివరాలు తీసుకున్నారని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని ఆమె చెప్పారు.
మీ సిస్టంలోకి వాళ్లు యాక్సెస్ ఎలా అయ్యారు?
శంకర్‌లక్ష్మికి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలతో ఉన్న పరిచయం, ఆఫీస్‌లో వారి ప్రవర్తన, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో వారు వచ్చేవారా..? డబ్బు లావాదేవీల గురించి మీతో ఎప్పుడైనా చర్చించే వారా..? మీ కంప్యూటర్‌లోకి యా క్సెస్ ఎలా అవుతారు..? ఈ కంప్యూటర్ పాస్‌వర్డ్‌లు ఇంకా ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా?..మీ కంప్యూటర్ పరిసరా ల్లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఉంటాయా?.. అన్న అంశాలపై నా ప్రశ్నించినట్టు తెలిసింది.
టీఎస్‌పీఎస్సీ అధికారి సత్యనారాయ ణ నుంచి సైతం కీలక వివరాలు సేకరించినట్టు తెలిసింది. పేపర్‌లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీ దృష్టికి ఎలా వచ్చింది? ఏయే పేపర్లు లీకైనట్టు గుర్తించారు..? ఉద్యోగుల పాత్రపై అంతర్గతంగా ఏ చర్యలు తీసుకున్నారు? ఇలాంటి వివరాలు సేకరించినట్టు తెలిసింది. వీటిని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.
సిట్ అధికారులను వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు హాజరైన శంకర్‌లక్ష్మి, సత్యనారాయణలను అవసరం మేరకు మరోమారు పిలుస్తామని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ప్రవీణ్, రాజశేఖర్‌ల ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్
పేపర్ల లీకేజీలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. గురువారం దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, ఈ కేసులో సిట్ వివరాలు ఇవ్వవడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది.
8 డాక్యుమెంట్లు కావాలని, కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌ను ఆదేశించాలని ఈడీ కోరింది. అయితే కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment