ఆ ముగ్గురినీ ప్రాసిక్యూట్‌ చేయాలి  | TS Congress to take defectors issue to Governor | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురినీ ప్రాసిక్యూట్‌ చేయాలి 

Published Thu, Mar 23 2023 2:34 AM | Last Updated on Thu, Mar 23 2023 3:27 PM

TS Congress to take defectors issue to Governor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వెనుక పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు ఉద్యోగ నియామకాల పేపర్లను అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు, ఇతర వ్యక్తులనే కాకుండా రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దనరెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను కూడా ప్రాసిక్యూట్‌ చేసే విధంగా విచక్షణాధికారాలు ఉపయోగించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన కోరారు.

ఈ మేరకు బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 17మందితో కూడిన కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసి ఫిర్యాదుతో కూడిన వినతిపత్రం అందజేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

కాంగ్రెస్‌ నేతలతో 40 నిమిషాల చర్చ 
 కాంగ్రెస్‌ నేతల వాదనలను విన్న గవర్నర్‌ తమిళిసై ఈ విషయమై దాదాపు 40 నిమిషాల పాటు వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ లేవనెత్తిన అంశాలన్నింటినీ గమనిస్తున్నానని, ఈ విషయాన్ని తాను రాజ్యాంగపరమైన కోణంలోనే చూడాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం.

తాను రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, ఈ మేరకు అవసరమైన సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించానని, న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నానని కాంగ్రెస్‌ నేతలతో గవర్నర్‌ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనపై మనస్తాపంతో సిరిసిల్లకు చెందిన నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా గవర్నర్, కాంగ్రెస్‌ బృందం మధ్య చర్చ జరిగింది.

ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, మల్లురవి, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్‌రెడ్డి రాంరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాములు నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్, రాములు నాయక్, రోహిణ్‌రెడ్డి, వల్లె నారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లున్నారు. 

కేటీఆర్‌దే బాధ్యత: రేవంత్‌ 
గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్‌ ఎదుట రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి ఈ కేసును విచారించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న శాఖకు చెందిన ఉద్యోగులే పేపర్‌లీకేజీలో కీలకంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఘటనకు కేటీఆరే బాధ్యత వహించాలన్నారు.

ఆర్టికల్‌ 317 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ కుండే విచక్షణాధికారం ప్రకారం వ్యవహరించి ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులందరినీ సస్పెండ్‌ చేయాలని కోరామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement