సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ తనకిచ్చిన లీగల్ నోటీసులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ ఉదంతంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తనను అడ్డుకోవడంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన లీగల్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు తన న్యాయవాది కుమార్ వైభవ్ ద్వారా కేటీఆర్ న్యాయవాది ఇనుగంటి సుధాన్షురావుకు శనివారం సమాధానం పంపారు.
కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు..
‘ఏదైనా ప్రజాసంబంధిత అంశంలో ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో నేను చేసింది కూడా అదే. కానీ ప్రతిపక్ష నేతగా ప్రజల వాణిని వినిపించే నా గొంతును నియంత్రించేందుకు కేటీఆర్ నాకు నోటీసులిచ్చారు. దర్యాప్తు సంస్థలనే కాకుండా ప్రజలను కూడా ప్రభావితం చేసేలా మాట్లాడారు.
లీకేజీలో ఇద్దరు ఉద్యోగుల తప్పిదమే ఉందంటూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని నేను ప్రజలకు చెబుతూ కేటీఆర్ వైఖరిని ప్రశ్నించాను. మంత్రిగా కేటీఆర్ నాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ దురుద్దేశాలతో కూడినవి. అందువల్ల కేటీఆర్ వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలి. లేదంటే తదుపరి పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’అని రేవంత్ తన సమాధానంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment