సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో దొంగలను కాపాడేందుకు మంత్రి కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ హడావుడి, తొందరపాటు తీరు చూస్తుంటే ప్రజలకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తనకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారని, మంత్రి కేటీఆర్‌కు మాత్రం విచారణకు సంబంధించిన కీలక సమాచారం సిట్ అధికారులు ఇస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ కొనసాగుతోందన్న రేవంత్‌రెడ్డి... విచారణ నివేదిక కోర్టుకు అందకముందే జగిత్యాలలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల సమాచారం కేటీఆర్‌కు ఎలా అందిందని ప్రశ్నించారు.
పేపర్ లీకేజీ విషయంలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్నపావు మాత్రమేనన్నారు. కేటీఆర్‌కు నిర్దిష్ట సమాచారం ఉన్నప్పు డు కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వకుండానే తమపై క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు నేరగాళ్లు సమాచారం ఇచ్చారో లేక సిట్ విచారణ అధికారి ఇచ్చారో కేటీఆరే ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
విచారణపై కేటీఆర్ ఒత్తిడి...
పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలే ఎక్కువని.. ఇందులో రూ. కోట్లు చేతులు మారాయని రేవంత్ ఆరోపించారు. మనీలాండరింగ్, హవాలా, విదేశీ లావాదేవీలు జరిగినందున కేసును సీబీఐ, ఈడీ, ఏసీబీ విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు తమ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్‌మెంట్లు అడుగుతున్నా తమకు సమయం ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసు కాబట్టి అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని... కానీ సిట్ ఈ చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా చేర్చలేదని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మంత్రి కేటీఆర్ విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెచ్చి ఎదురుదాడికి దిగుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ అధికారులను రక్షించేందుకు ప్రభుత్వం కేసును సిట్‌కు అప్పగించిందన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు లేదు..
గతంలో ఎంసెట్, నయీం కేసులు మొదలుకుని వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదిక కూడా ఇవ్వలేదని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ గుర్తుచేశారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధి కారి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు బాగా లేదని, అంతకుముందు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆయనకు రెండు వారాల జైలు శిక్ష విధించిన విషయాన్ని గుర్తించాలన్నారు. ‘ఇది 50 లక్షల మంది నిరుద్యోగుల సెంటిమెంట్‌కు సంబంధించిన సమస్య. తెలంగాణ విద్యార్థులు కేసీఆర్‌కు నచ్చకపోవచ్చు. కానీ వారి జీవితాలతో చెలగాటమాడే హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదు’అని పేర్కొన్నారు.
రాహుల్ భయ్యా... నా ఇంటికి రావయ్యా
సాక్షి, హైదరాబాద్: బహిష్కృత ఎంపీ రాహుల్‌గాంధీని తన ఇంట్లో ఉండాలని ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్ వేటు వేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఇచ్చిన నోటీసును జత చేస్తూ ‘రాహుల్ భయ్యా... నా ఇల్లు మీ ఇల్లే. నా ఇంటికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మనది ఒక కుటుంబం. ఇది మీ ఇల్లు కూడా..’అని మంగళవారం రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment