సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ ఘటనపై ఢిల్లీకి వెళ్లి సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల గూడుపుఠాణీ ఉందని, కేసును నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగించారని ఆరోపించారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ ఘటనలో పెద్దల పాత్రను కప్పిపుచ్చుకునేందుకే తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తనను గృహ నిర్బంధం చేయడం ఆటవిక చర్య అని మండిపడ్డారు. అనర్హులను టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా నియమించారని, దీనిపై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసి కౌంటర్ దాఖలు చేయాలని సూచించినా ప్రభుత్వం దాఖలు చేయకుండా వాయిదాలు కోరిందన్నారు. అనర్హులను అందలం ఎక్కించడం వల్లనే ఈ అనర్థం జరిగిందని చెప్పారు. లీకేజీ కేసులో మొదట విచారించాల్సింది సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మినని, ఏ1 ప్రవీణ్‌కుమార్‌పై ఏసీబీ సెక్షన్ల కింద కేసు పెట్టి ఉంటే విచారణ త్వరగా జరిగేదని, ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఆ పని చేయలేదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులను కూడా సిట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. లీకేజీలో మంత్రి కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందన్నది తమ నిర్దుష్ట ఆరోపణ అని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పెద్ద తలల్ని సిట్ విచారిస్తేనే నిజాలు బయటకు వస్తాయన్నారు.
పాదయాత్ర ఏప్రిల్ 6 వరకు వాయిదా
టీఎస్‌పీఎస్సీ లీకేజీ ఘటనపై న్యాయం కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తన పాదయాత్రను ఏప్రిల్ ఆరో తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు రేవంత్ వెల్లడించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా, 24, 25 తేదీల్లో నిరసన తెలపాలని అనుకున్నా ప్రభుత్వం నియంతృత్వ పోకడతో తమను నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే టీఎస్‌పీఎస్సీ లీకేజీ ఘటనపై ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్1 నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తామని, ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని రేవంత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment