జనవరి 8న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ | Group 1 Prelims On 8th January APPSC | Sakshi
Sakshi News home page

జనవరి 8న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌

Published Sat, Nov 12 2022 9:17 AM | Last Updated on Sat, Nov 12 2022 9:41 AM

Group 1 Prelims On 8th January APPSC - Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ పరీక్షను జనవరి 8న నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. పాలనా కారణాలతో డిసెంబర్‌ 18న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామన్నారు. డిసెంబర్‌ 17 నుంచి 20 తేదీ వరకు బ్యాంకింగ్‌ పరీక్షలు జరగనున్నందున అభ్యర్థుల మేలు కోసం గ్రూప్‌–1 పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రూప్‌–1 పోస్టుల నియామక ప్రక్రియను 9 లేదా 10 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లతో పాటు త్వరలో వెలువరించనున్న వాటికీ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చిన అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశామని గుర్తు చేశారు. వీటిలో కొన్నింటికి పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించామని తెలిపారు. సవాంగ్‌ ఇంకా ఏం చెప్పారంటే..

పకడ్బందీ ప్రణాళికతో ముందుకు..
గ్రూప్‌–1తో సహా అన్ని పోస్టుల భర్తీలో ఎక్కడా జాప్యం లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. న్యాయవివాదాలు, పలుమార్లు ఫలితాల వెల్లడి, మెయిన్స్‌ మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించాల్సి రావడం వంటి కారణాలతో 2018 గ్రూప్‌–1 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో ఆ న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి ఆ పోస్టులను భర్తీ చేశాం. సెప్టెంబర్‌ 30న గ్రూప్‌–1 కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చాం. దీనిద్వారా 92 గ్రూప్‌–1 పోస్టులను భర్తీ చేస్తాం. గత గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో భర్తీ కాని పోస్టులు ఈ కొత్త నోటిఫికేషన్‌లో చేరతాయి. దీంతో ప్రస్తుత నోటిఫికేషన్‌లోని పోస్టుల సంఖ్య కొంత పెరిగే అవకాశముంది. కొన్ని పొరపాట్లతో అప్పటి గ్రూప్‌–1 పోస్టులకు వయోపరిమితి మించిపోయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రూప్‌–1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 2తో ముగిసినా 5 వరకు అవకాశం ఇచ్చాం. దీంతో 1.26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతి కూడా ఇచ్చారు. 

అత్యంత ప్రతిభావంతుల ఎంపిక
ఏపీపీఎస్సీ పకడ్బందీ చర్యలతో వివిధ కేడర్‌ పోస్టుల్లో అత్యంత ప్రతిభావంతులు ఎంపికవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 గ్రూప్‌–1 పోస్టులకు అత్యంత ప్రతిభావంతులు ఎంపికయ్యారు. 2018 గ్రూప్‌–1 మెయిన్స్‌ డిజిటల్‌ వాల్యుయేషన్‌పై న్యాయ వివాదం ఏర్పడడంతో హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా 55 రోజుల్లో మూల్యాంకనాన్ని పూర్తి చేయించాం. ఇంటర్వ్యూలను గతంలో మాదిరి ఒక్క బోర్డుతో కాకుండా మూడు బోర్డులతో నిర్వహించాం. గతంలో కమిషన్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో ఒకే బోర్డుతో వీటిని నిర్వహించేవారు. ఇప్పుడు మూడు బోర్డుల్లోనూ కమిషన్‌ సభ్యులతోపాటు ఇద్దరు చొప్పున సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులుగా యూనివర్సిటీ వీసీ/విశ్రాంత వీసీలను నియమించాం. దీంతో 11 రోజుల్లోనే ఇంటర్వ్యూలను పూర్తిచేశాం. ఐఏఎస్‌కు ఎంపికైననలుగురు, ఐపీఎస్‌కు ఎంపికైన ఇద్దరు ఈ గ్రూప్‌–1 పోస్టులకు ఎంపికయ్యారు. 

సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ 
ఈసారి గ్రూప్‌–1 పోస్టులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా న్యాయపరమైన అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట విధానాలను రూపొందించాం. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా çసహకారాలు అందుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement