డీఎస్సీ పోస్టులకు రేషనలైజేషన్ గండి
- జాబితాలో 1204 పోస్టులు
- డీఎస్సీ లిస్టులో 700 ఖాళీలకు కోత?
- గణితం, సోషల్ ఆశలు గల్లంతేనా
సాక్షి, విశాఖపట్నం : డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రేషనలైజేషన్ పిడుగుపాటుగా మారనుంది. తొలుత సిద్ధం చేసిన జాబితాలో ఏకంగా 700 పోస్టుల వరకు గండి పడనున్నట్టు సమాచారం. ఏ సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులకు కోత వేస్తారన్నది తెలియని పరిస్థితి. తొలుత రేషనలైజేషన్ కాకుండా కేవలం సర్దుబాటుతోనే సరిపెట్టుకోవాలనుకున్నప్పటికీ డీఎస్సీ ప్రకటనతో రేషనలైజేషన్ దిశగా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.
మిగిలి.. పోయేవెన్ని? : జిల్లా విద్యాశాఖ తాజా అంచనాల మేరకు జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1714 పోస్టులు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సిద్ధం చేశారు. రేషనలైజేషన్ తప్పనిసరన్న వార్తలతో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి కంటే ఎక్కువ పోస్టులున్న చోట వాటిని అవసరమైన చోటికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదే జరిగితే డీఎస్సీ పోస్టుల్లో ఏకంగా 700 వరకు కోతపడే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా. రేషనలైజేషన్ అంచనాల మేరకు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 502 ఎస్జీటీలు మిగులు పోస్టులుగా లెక్కతేల్చారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు భాషా పండితులు నాలుగు, ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెక్టుల్లో 780 మంది ఉపాధ్యాయులు అధికంగా ఉన్నట్టు తాజా నివేదికలో స్పష్టం చేశారు.ఎస్జీటీ కేటగిరీలో 1474, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 615, ఉన్నత పాఠశాలల్లో 266 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది.
గణితం, సోషల్ ఆశలు గల్లంతేనా?
తాజా డీఎస్సీకి గతేడాది సిద్ధం చేసిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పోస్టులతో గణితం(106), సోషల్(131) ఆశావహులు ఆనందపడ్డారు. తాజా రేషనలైజేషన్ లెక్కల మేరకు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ గణితంలో 144, సోషల్ సబ్జెక్టులో 108 పోస్టులు మిగులు పోస్టులుగా నిర్థారించారు. దీంతో వీటిలో ఎన్ని పోస్టుల్ని రేషనలైజేషన్ పేరిట తొలగిస్తారోనన్న ఆందోళన నెలకొంది. అదే జరిగితే జిల్లాలో ఎస్జీటీ కేటగిరీ మినహా స్కూల్ అసిస్టెంట్ పోస్టులపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేనట్టే..!