చిక్కుముళ్ల డీఎస్సీ | DSC schedule confuse candidates | Sakshi
Sakshi News home page

చిక్కుముళ్ల డీఎస్సీ

Published Mon, Dec 1 2014 2:21 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

DSC schedule confuse candidates

న్యాయపరమైన ఎలాంటి సమస్యలు ఎదురవకూడదని ఆలస్యంగానైనా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రకటించామని ప్రభుత్వం చెబుతున్న ఉపాధ్యాయుల నియామక (డీఎస్సీ) షెడ్యూల్ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది.ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభ్యర్థులు, తరువాత తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అర్హత మార్కుల నుంచి సిలబస్, పరీక్షా సమయం, సబ్జెక్టులకు మార్కుల కేటాయింపు ఇలా అన్ని నిర్ణయాలు అభ్యర్థులకు అశనిపాతంలా  మారాయి. దీంతో జిల్లాలోని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
 
 విజయనగరం అర్బన్ :  జిల్లాలో వెయ్యికి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 316 పోస్టుల భర్తీకి మాత్రమే డీఎస్సీలో అవకాశం ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్లు-104, భాషా పండితులు -28, పీఈటీలు-06, ఎస్జీటీలు-178 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ సారి జిల్లాలో 20 వేల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం టెట్ కం టెర్ట్(టీఆర్‌టీ- టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పేరిట టెట్, డీఎస్సీ కలిపి పరీక్ష నిర్వహిస్తుండడంతో గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో నిర్వహించిన టెట్ అర్హత పొందిన వారు జిల్లాలో తొమ్మిది వేల మంది వరకు ఉన్నారు. నిబంధనల మేరకు ఏడు సంవత్సరాల వరకు ఈ అర్హత వర్తిస్తుంది. రెండు పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావడం అసాధ్యమనే అభిప్రాయంతో అప్పుడు వేర్వేరుగా నిర్వహించారు. తాజా నిర్ణయం మేరకు టెట్ సబ్జెక్టులు కూడా డీఎస్సీలో కలిపేయడం వల్ల అధిక మార్కులు సాధించడం కష్టమనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయా రిజర్వేషన్ వర్గాలకు అర్హత మార్కులను పెంచడం కూడా అభ్యర్థుల్లో ఆందోళన  కలిగిస్తోంది. అలాగే పరీక్ష కోసం కేటాయించిన మూడు గంటల సమయం ఏ మాత్రం సరిపోదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
 
 భాషా పండితులకు భాషేతర సబ్జెక్టు భయం
 తెలుగు, హిందీ, ఉర్దూ, ఒడియా భాషా పండితులకు గతంలో మాదిరిగా కాకుండా సిలబస్ మర్పు, ప్రశ్రాపత్రంలో ఇతర సబ్జెక్టులకు అధిక మార్కులు ఇవ్వడం వంటి మార్పులు చేశారు. అర్హత విద్యలో లేని ఇతర సబ్జెక్టులకు ప్రశ్నావళిలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 200 మార్కులలో అర్హత సబ్జెక్టుకు 70, ఎప్పుడు చదువుకోని సాంఘికశాస్త్రం నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఉపాధ్యాయ పోస్టులకు సైకాలజీ, జీకే వంటి అంశాలపై ప్రశ్నలు ఉండడం సహజం. కానీ భాషాపండిత పోస్టులకు అర్హత విద్యలో ఎప్పుడూ చదువుకోని సాంఘికశాస్త్రం సిలబస్ ఉండడంపై అభ్యర్థులు  ఆందోళన పడుతున్నారు. భాషా పండిత పోస్టులకు జిల్లాలో ఐదు వేల మంది వరకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు గతంలో టెట్ రాసి మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు తాజా డీఎస్సీలో తిరిగి టెట్‌ను రాయాల్సి ఉంది. పాసయ్యామనే ధైర్యంతో చాలా మంది సబ్జెక్టులపైనే దృష్టి సారిస్తున్నారు. వీరి పరిస్థితి గందరగోళంగా మారింది.
 
 అర్హత మార్కులపై రిజర్వేషన అభ్యర్థుల
 ఆందోళన
 కొత్త డీఎస్సీ ఎంపికలో రిజర్వేషన్ కేటాయింపులు మార్చుచేయడం వల్ల అర్హులు దొరక్క పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో ఈ పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు పరీక్షలో 40 శాతం, బీసీలకు 50 శాతం, ఏసీలకు 60 శాతం మార్కులు తెచ్చుకోవాలని కొత్తగా నిబంధన పెట్టారు.   గతంలో తక్కువ మార్కులు సాధించినా ఎస్సీ, ఎస్టీలు ఉపాధ్యాయ పోస్టులు సాధించారు. తాజా నిబంధనలతో  ఆయా రిజర్వేషన్ వర్గాల్లో అర్హులైన వారు లభించక పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది.
 
 భాషాపండితల అన్యాయంపై  పోరాటం
 డీఎస్సీ పరీక్ష పత్ర విధానాన్ని మార్చకపోతే న్యాయ పోరాటం చేస్తామని నిరుద్యోగ భాషాపండిత అభ్యర్థుల సంఘం ప్రకటించింది.
 
 సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పోలినాయుడు అధ్యక్షతన స్థానిక కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన సమావేశంలో సంఘం సభ్యులు ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోవిందనాయుడు, శ్రీనివాసరావు సమావేశానికి హాజరయ్యారు.
 
 భాషా పండితులకు తీరని నష్టం
 తాజా డీఎస్సీలో 200 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తున్నారు. ఇందులో భాషా పండితుల (తెలుగు, ఉర్దు, హిందీ, ఒడియా)కు మాత్రం వారి సబ్జెక్టు 70 మార్కులు ఇచ్చి, మిగిలిన 130 మార్కులకు సాంఘిక శాస్త్రం, భాషేతర అంశాల ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. వంద మార్కులకు పైగానే సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు ఉండేవి. దీని వల్ల భాషా పండితులకు తీరని నష్టం జరుగుతుంది.
 - ఎం. పోలినాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, భాషాపండిత నిరుద్యోగ అభ్యర్థుల పోరాట సమితి.
 
 పరీక్షా సమయం సరిపోదు
 తాజా డీఎస్సీలో 200 మార్కులకు 3 గంటల సమయం ఏ మాత్రం సరిపోదు. సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 150 మార్కులకు మూడు గంటల సమయం ఇస్తారు. దీనికి తోడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, బబ్లింగ్ చేయాలంటే సమయం సరిపోదు.
 -కె.శివకృష్ణ, డీఎస్సీ అభ్యర్థి, కృష్ణరాయిపురం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement