భువనగిరి : ఒకే రోజు భాషా పండితులకు సంబంధించిన గ్రేడ్–1, గ్రేడ్–2 పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి జనవరి 31వ తేదీన టీఆర్టీ షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా మంది అభ్యర్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాయగరని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 పోస్టులు ఉండగా మూడువేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఒకేరోజు రెండు పరీక్షలు
దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు గ్రేడ్–2 పరీక్ష రాసేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు సొంత జిల్లాల ఆప్షన్ ఉండడంతో అభ్యర్థులు సొంత జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. అక్టోబర్ 21న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉదయం గ్రేడ్–2 పరీక్ష హైదరాబాద్‌లో జరగనుంది. ఈ పరీక్ష రాసి గ్రేడ్–1 పరీక్ష కోసం తిరిగి అభ్యర్థుల సొంత జిల్లాలకు రావాల్సి ఉంటుంది. కాగా అలాగే గ్రేడ్–1 పరీక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఉన్నట్లుగా ఆప్షన్ రావడంతో ప్రతిఒక్కరూ అదే ఎంపిక చేసుకున్నారు. సాధారణంగా భాషా పండితుల పోస్టులకు పరీక్ష రాసే అభ్యర్థులు గ్రేడ్–1, గ్రేడ్–2కు దరఖాస్తులు చేసుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు పరీక్ష నిర్వహణకు మధ్య వ్యవధి ఉండాలి. కానీ జనవరి 31వ తేదీన టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీనే రెండు పరీక్షలు నిర్వహించే విధంగా ప్రకటించారు. సాధారణంగా ఈ పరీక్షల వ్యవధి రెండున్నర గంటల వరకు ఉంటుంది. ఒకేరోజు రెండు పరీక్షలు నిర్వహించడం వల్ల హైదరాబాద్ నుంచి సొంత జిల్లాలకు వెళ్లి గ్రేడ్–1 పరీక్ష రాసే పరిస్థితి ఉండదు. వేల రూపాయాల ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఆవేదన వ్య్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీఎస్‌పీఎస్సీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
3వేల దరఖాస్తులు
ఉపాధ్యాయ నియామక పరీక్ష–2017 కోసం ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువుగా ప్రకటించింది. కొత్త జిల్లాల ప్రకారం కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికనే నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశాల మేరకు దరఖాస్తు గడువును డిసెంబర్ 15 తేదీ వరకు పొడిగించింది. ఆపై దరఖాస్తు గడువును ఇదే నెల 30 వరకు పొడిగించింది. మరో విడతగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు జనవరి 7వ తేదీ వరకు పొడిగించిది. దీంతో భాషపండితుల దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్న 100 భాషాపండితుల ఖాళీలకు గాను మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలి
టీఎస్‌పీఎస్సీ దరఖాస్తు షెడ్యూల్‌లో భాషా పండితుల నిర్వహణపై చేసిన ప్రకటన అస్పష్టంగా ఉంది. నోటిఫికేషన్ సమయంలో గ్రేడ్–2 పరీక్ష హైదరాబాద్, గ్రేడ్–1 పరీక్ష సొంత జిల్లాల్లో నిర్వహించుకునే విధంగా వీలు కల్పించారు. కానీ పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌లో మాత్రం ఒకేరోజు ఈ పరీక్ష ఉండటం వల్ల రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలి.
– మల్లికార్జున్, అభ్యర్థి, యాదాద్రిభువనగిరి జిల్లా
పరీక్షల మధ్య వ్యవధి ఉండాలి
భాషా పండితుల పరీక్ష నిర్వహణ విషయంలో వ్యవధి ఉండాలి. ఒకేరోజు పరీక్షను నిర్వహించడం వల్ల రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఒక పరీక్ష హైదరాబాద్‌లో రాసి, మరో పరీక్ష సొంత జిల్లాకు వచ్చి ఎలా రాస్తారు. భాషా పండితుల పరీక్షల నిర్వహణలో వ్యవధి ఉండే విధంగా చూడాలి.
– పాండు, అభ్యర్థి, యాదాద్రిభువనగిరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment