ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదీ బీజేపీ వ్యూహం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన వరకూ వేచిచూసే ధోరణి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల తరఫున బరిలో దిగే అభ్య ర్థుల ఖరారు తర్వాతే కార్యరంగంలోకి దిగాలని భావిస్తోంది. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ (రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్)లో రెండింటిని గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ ముఖ్యనేతలు పట్టుదలగా ఉన్నారు.
కరీంనగర్–ఆదిలాబాద్ –నిజామాబాద్–మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు (ఒక్కో సీటు), వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉత్తర తెలంగాణలో కమలనాథులు సత్తా చాటిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని పట్టభద్రులు, టీచర్లలోనూ బీజేపీకి ఆదరణ ఉందని రుజువు చేయాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఖరారు విషయంలోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన పట్టును నిరూపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ముందుకు కదలాలని కాషాయదళం భావిస్తోంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పో టీ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..ఆ పార్టీ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగితే త్రిముఖ పోటీ లో ఎలాంటి మార్పులొచ్చే అవకాశాలుంటాయనే దానిపైనా దృష్టి సారించింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పోటీకి బీఆర్‌ఎస్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మూడింటిలో రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ముఖ్యనేతలున్నారు.
అన్ని పార్టీల కంటే ముందే అని అనుకున్నా...
అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ప్రచారం ముమ్మరం చేయాలని తొలుత బీజేపీ నాయకత్వం భావించింది. అయితే ఆ తర్వాత వ్యూహం మార్చుకుంది. బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేందుకు పార్టీపరంగా ప్రాథమిక కసరత్తు జరిగినా ప్రస్తుతం అది నిలిచిపోయింది. వచ్చే ఏడాది మార్చి 29తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఆ లోగానే ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది.
బీజేపీలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. పట్టభద్రుల టికెట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీచేసిన సుగుణాకరరావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి, అనంతరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పార్టీకి పట్టుండడంతోపాటు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్నందున ముందుగానే అభ్యర్థుల ప్రకటన మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఖమ్మం–నల్లగొండ–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment