సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య, పులి సరోత్తమ్‌రెడ్డి
కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా సి.అంజిరెడ్డి
ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కొమురయ్య నల్లగొండ–వరంగల్– ఖమ్మం జిల్లాల
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఎన్నికలు జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్య ర్థులను ప్రకటించింది. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి, ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాల మేరకు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సి.అంజిరెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామచంద్రాపురానికి (ప్రస్తుతం సంగారెడ్డి) చెందిన సి.అంజిరెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్తగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలకు దగ్గరయ్యారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా పలు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పేద విద్యార్థులు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తున్నారు. అంజిరెడ్డి భార్య గోదావరి అంజిరెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
మల్క కొమురయ్య: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన కొమురయ్య ఉస్మానియా వర్సిటీ నుంచి బీఈ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పలు విద్యాసంస్థలను నెలకొల్పారు. పాఠశాల స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ చైర్మన్‌గా ఉన్నారు.
పులి సరోత్తమ్‌రెడ్డి: వరంగల్‌కు చెందిన సరోత్తమ్‌రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 21 ఏళ్లపాటు స్కూల్ అసిస్టెంట్‌గా, పదేళ్లు హెడ్‌మాస్టర్‌గానూ సేవలందించారు. 2012 నుంచి 2019 దాకా పీఆర్‌టీయూకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. టీచర్స్ జేఏసీలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, యూనియన్ నాయకుడిగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment