టెట్, డీఎస్సీలకు వేర్వేరు పరీక్షలు! | different exams for tet, dsc | Sakshi
Sakshi News home page

టెట్, డీఎస్సీలకు వేర్వేరు పరీక్షలు!

Published Mon, Nov 2 2015 2:31 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

టెట్, డీఎస్సీలకు వేర్వేరు పరీక్షలు! - Sakshi

టెట్, డీఎస్సీలకు వేర్వేరు పరీక్షలు!

విద్యాశాఖ నిర్ణయం
* జనవరి 24న టెట్ నిర్వహించేందుకు కసరత్తు
* మార్చి లేదా ఏప్రిల్‌లో డీఎస్సీ నోటిఫికేషన్
* వేర్వేరు పరీక్షలపై 3 లక్షల మంది అభ్యర్థుల ఆందోళన
* ఏపీ తరహాలో రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్

* గతంలో టెట్ రాసినవారికి వెయిటేజీ ఇవ్వాలని విజ్ఞప్తి


 సాక్షి, హైదరాబాద్: టెట్, డీఎస్సీ కలిపి నిర్వహిస్తారా? వేర్వేరుగా నిర్వహిస్తారా అన్న సందిగ్ధానికి తెరపడింది. ఈ రెండు పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,961 ఉపాధ్యాయ నియామకాలకు జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ఆధ్వర్యంలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. వచ్చే జనవరిలో టెట్‌ను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. జనవరి 24న టెట్‌ను నిర్వహించాలని భావిస్తోంది.

నిర్వహణ తేదీపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనవరిలో టెట్ నిర్వహిస్తే మార్చి లేదా ఏప్రిల్  నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. టెట్ కన్వీనర్‌గా పాఠశాల విద్యాశాఖ అదనపు డెరైక్టర్ గోపాలరెడ్డిని నియమించినట్టు తెలిసింది. ఇలా వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడాన్ని డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. టెట్, డీఎస్సీ రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా టెట్‌లో అర్హత సాధించాలన్న పేరుతో ఉద్యోగ నియామక పరీక్షలకు అభ్యర్థులను దూరం చేయడం సరైంది కాదని పేర్కొంటున్నారు. రెండూ కలిపి పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గతంలో టెట్ రాసి అర్హత సాధించిన వారికి ఆంధ్రప్రదేశ్ తరహాలో వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

ఎప్పట్నుంచో డిమాండ్
 రాష్ట్రంలో టెట్, డీఎస్సీలను (టీఆర్‌టీ) కలిపి నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించి, ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసి వస్తున్న అభ్యర్థులు టీఆర్‌టీలో మెరిట్ సాధిస్తేనే ఉద్యోగం పొందుతున్నారు. ఏ ఉద్యోగానికి కూడా ఇన్ని రకాల పరీక్షలు లేనపుడు.. ఉపాధ్యాయ పోస్టుకు మాత్రం అదనంగా మళ్లీ టెట్‌లో అర్హత సాధించాలన్న నిబంధన సరికాదని అభ్యర్థులు చెబుతున్నారు. 2013లో టెట్, టీఆర్‌టీ కలిపి నిర్వహించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల మేరకు టెట్, టీఆర్‌టీ కలిపి టెర్ట్‌గా (టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్‌మెంట్ టెస్టు) నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే అప్పట్లో రాష్ట్ర విభజన ఆందోళనల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టలేదు. అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ను కూడా రద్దు చేశారు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ప్రత్యేకంగా టెట్ అవసరం లేదని పేర్కొంది. గతంలో డీఎస్సీని 100 మార్కులకు నిర్వహించేవారు. ఏపీలో టెర్ట్, డీఎస్సీ కలిపి 200 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మెరిట్, రోస్టర్ కమ్ రిజర్వేషన్ల ఆధారంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. అలాగే గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారికి 20 శాతం వెయిటేజీ ఇస్తామని తెలిపింది. అయితే ఇది, ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. చివరకు ప్రభుత్వ నిర్ణయంతో హైకోర్టు ఏకీభవించింది. అభ్యర్థుల పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement