18 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీ! | 18 thousand teacher posts recruits by telangana state soon | Sakshi
Sakshi News home page

18 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీ!

Published Sat, Jan 2 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

18 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీ!

18 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీ!

డీఎస్సీపై నేడు కేబినెట్ ఆమోదానికి ఫైలు
     పాఠశాల విద్యలో 12 వేలు.. ఇతర గురుకులాల్లో 3 వేల పోస్టులు
     3 వేల వరకు కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ
     అన్ని మేనేజ్‌మెంట్ల పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహణకు నిర్ణయం
     పరీక్ష నిర్వహణ బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఇవ్వడంపై యోచన

 
 సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఈ ఏడాది 18 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పోస్టులకు అనుమతి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఒక్కో మేనేజ్‌మెంట్‌లోని పోస్టులకు వేర్వేరుగా డీఎస్సీల ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసి పోస్టులను భర్తీ చేయడం కాకుండా ఒకే నోటి ఫికేషన్ ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశాన్ని ముందుగా కేబినెట్‌లో పెట్టిన దాఖలాలు లేవు. ఆర్థికశాఖ ఆమోదం లభించాక కేబినెట్‌లో ర్యాటిఫై చేసేవారు. అయితే ఈసారి ఒకే డీఎస్సీ అన్నది విధానపరమైన నిర్ణయం కావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం ఉండటంతో ప్రభుత్వం దీన్ని ముందుగానే కేబినెట్ ఆమోదానికి పెడుతోంది. ఈ అంశాన్ని ఎజెండాలో పెట్టకుండా టేబుల్ ఐటెమ్‌గా కేబినెట్ సమావేశంలో ఆమోదానికి పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

 అన్నింటికీ ఒకే డీఎస్సీ
 ఇప్పటివరకు మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ సంక్షేమ గురుకులాల్లో పోస్టులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా శాఖలు ఆ పనుల్లోనే బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని మేనేజ్‌మెంట్‌లలోని పోస్టులన్నింటినీ ఒకే డీఎస్సీ.. ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు సర్కారు చర్యలు చేపడుతోంది. విద్యార్హతలు, దరఖాస్తు చేసుకునే కేటగిరీనిబట్టి ఎంపిక చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్స్ పరీక్షల విధానం తరహాలో అర్హతలనుబట్టి పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను కేటాయిస్తే బాగుంటుందని ప్రభుత్వం అవగాహనకు వచ్చింది. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 నిర్వహణ బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ?
 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని విద్యాశాఖ ఆధ్వర్యంలోనే చేపట్టాలా లేక టీఎస్‌పీఎస్సీకి ఇచ్చేయాలా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలి స్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. డీఎస్సీ నియామకాల ప్రక్రియ ప్రారంభమైతే విద్యాశాఖతోపాటు జిల్లా యంత్రాంగం మొత్తం దీనికి సంబంధిం చిన ప్రక్రియపైనే దాదాపు 3 నెలలపాటు బిజీగా ఉంటోంది. దీంతో సాధారణ విద్యా కార్యక్రమాలు దెబ్బతింటున్నాయి.

అలాగే జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయ నియామకాలకు పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నందున జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల ఎంపిక కమిటీకి (డీఎస్‌సీ) చైర్మన్లు కావడంతో వారు ఈ పనుల్లోనే బిజీగా ఉంటున్నారు. దీంతో ఇతర కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి డీఎస్సీ నిర్వహణ బాధ్యత అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్లే భర్తీ చేస్తుండటంతో దీనిపైనా ప్రభుత్వం కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
 
 నేరుగా 15 వేల పోస్టుల భర్తీ...
 మొత్తం 18 వేలకుపైగా పోస్టుల్లో  దాదాపు 15 వేల పోస్టులను ప్రభుత్వం డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా మరో 3 వేల వరకు పోస్టుల్లో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది. పాఠశాల విద్యలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న, వచ్చే మూడు నెలల్లో ఖాళీ అయ్యేవి కలుపుకొని దాదాపు 10 వేల పోస్టులతోపాటు (పదోన్నతులుపోగా ఇప్పటివరకు ఉన్న క్లియర్ వేకెన్సీలు 8,900) కొన్ని కొత్త పోస్టులను సృష్టించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. దీంతో 12 వేల వరకు పోస్టులు పాఠశాల విద్యలో రానున్నాయి. అలాగే మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోనూ మరో 3 వేల వరకు ఖాళీలు ఉండగా గురుకులాల్లో పని చేసే మరో 3 వేల మంది కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. వీటితోపాటు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), బీఎడ్ కాలేజీలు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో (ఎస్‌సీఈఆర్‌టీ) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చే సేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement