- చివరి రోజు వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు
- జిల్లా కేంద్రంలో పరీక్షలు రాసిన 22,346 మంది
- అభ్యర్థులతో నిండిపోయిన ఆటోలు, సిటీ బస్సులు
- గుంటూరులో పలు చోట్ల ట్రాఫిక్ జామ్
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలో డీఎస్సీ పరీక్షల కోలాహలం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన పరీక్షలకు వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులతో నగరంలోని పరీక్ష కేంద్రాలు కిటకిటలాడాయి.
చివరి రోజు సోమవారం పరీక్షకు హాజరైన 22,346 మంది అభ్యర్థులతో నగరంలోని ప్రధాన రహదారులు నిండిపోగా ఆటోలు, సిటీ బస్సులకు కాసుల వర్షం కురిసింది. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించడంతో డీఎస్సీ పరీక్షలు రాసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభ్యర్థులు నగరానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు ఆర్టీసీ అధికారులు నడిపిన బస్సులు కొంత వరకూ ప్రయోజనం కలిగించాయి. మొత్తం మీద మూడు రోజుల పాటు పరీక్షలు సజావుగా జరగడంంతో ఇటు అభ్యర్థులు, అటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు 25 కేంద్రాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 5,260 మంది అభ్యర్థుల్లో 4,466 మంది హాజరయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు 92 కేంద్రాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్షలకు దరఖాస్తు చేసిన 20,420 మంది అభ్యర్థుల్లో 17,880 మంది హాజరయ్యారు.
పాఠశాల విద్య ఆర్జేడీ పి. పార్వతి 17 కేంద్రాలు, డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి 14 కేంద్రాలతో పాటు ఐదుగురు డీవైఈవోలు ఆయా కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 6.15 గంటలకు నగరంలోని 92 కేంద్రాల నుంచి అభ్యర్థులు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మూడు రోజుల వ్యవధిలో 28,996 మంది హాజరు ...
జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసిన 33,380 మంది అభ్యర్థుల్లో 28,996 మంది హాజరయ్యారు. పరీక్షల తంతు ముగియడంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ముగిసిన డీఎస్సీ కోలాహలం
Published Tue, May 12 2015 5:05 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement