Telangana Staff Nurse Exam: Strict Rules For Staff Nurse Exam - Sakshi
Sakshi News home page

స్టాఫ్‌ నర్స్‌ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!

Published Mon, Jul 31 2023 2:13 AM | Last Updated on Mon, Jul 31 2023 8:54 PM

Strict rules for staff nurse exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ నర్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ కాబట్టి ఆన్‌లైన్‌ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్‌ మూసేస్తారు. రెండో సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్‌ మూసేస్తారు. ఇక మూడో సెషన్‌ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి.  3.45 గంటలకు గేట్‌ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్‌ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

అభ్యర్థులకు సూచనలు

  • అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్‌ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్‌ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. 
  • హాల్‌ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. 
  • అభ్యర్థులు పాస్‌పోర్ట్‌/పాన్‌ కార్డ్‌/ఓటర్‌ ఐడీ/ఆధార్‌ కార్డ్‌/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. 
  • రిజిస్ట్రేషన్‌ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్‌ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు.  
  • గేట్‌ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.  
  • అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్‌లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్‌ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.   
  • అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్‌ టికెట్, నలుపు/నీలం బాల్‌ పాయింట్‌ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్‌ బాటిల్‌ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్‌ షీట్లను ఇన్విజిలేటర్‌ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్‌ కేసు 
  •  అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్‌ ఫోన్లు, టాబ్స్, పెన్‌ డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, వాచ్, లాగ్‌ టేబుల్స్, వాలెట్, హ్యాండ్‌ బ్యాగ్‌లు, రైటింగ్‌ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్‌ షీట్‌లు లేదా మరే ఇతర గాడ్జెట్‌లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్‌ సాధనాలను అనుమతించరు.  
  •  అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు.  
  • నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. 

ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు 
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్‌ టికెట్‌ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్‌ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement