భృతి.. భ్రమే..! | Nirudyoga Bruthi Not Important Examples Wrath On TDP Government | Sakshi
Sakshi News home page

భృతి.. భ్రమే..!

Published Mon, Jul 30 2018 8:28 AM | Last Updated on Fri, Aug 10 2018 6:56 PM

Nirudyoga Bruthi Not Important Examples Wrath On TDP Government - Sakshi

టీడీపీ సర్కార్‌ నిరుద్యోగభృతిని గాలికొదిలేసింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి. ఈ ఏడాది చివర్లో.. లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. నిరుద్యోగ భృతి హామీ అమలుకు అడుగులు వేసింది. అయితే కొర్రీలు పెట్టడం గమనార్హం

ఎర్రగుంట్ల (వైఎస్సార్‌ కడప): ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపుతోంది. 2014 ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఆశతో టీడీపీకి ఓటేశారు. అధికారం చేపట్టాక మొండిచేయి చూపింది. అదే హామీని మళ్లీ అమలు చేస్తామని చెబుతుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రూ.2వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సవాలక్ష కొర్రీలు పెట్టడమే కాకుండా రూ.1000కి కుదించడం.. 35 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇస్తామని చెబుతుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. గ్రామాల్లో ప్రజాసాధికార సర్వేల్లో పేర్లు నమోదై ఉండాలని షరతులు విధించడంతో యువత నుంచి నిరాశ వ్యక్తమవుతోంది.

ఆశ..అడియాస..
 జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 25 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు సుమారు 15 వేల మందిపైనే ఉన్నారు. వీరంతా భృతి అందుతుందని ఆశించి భంగపడినవారే.

భర్తీకానీ పోస్టులు...
 వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా... వాటిని భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు డీఎస్సీ పేరిట రెండు సార్లు టెట్‌ నిర్వహించింది. అయితే ఇప్పుడు బీఈడి అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు అర్హులని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగావకాశాలు కల్పించకుండా అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చుతున్న సీఎం చంద్రబాబు నయవంచనకు గురి చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సబ్సిడీ రుణాలు, పథకాలను కూడా తమ అనుచరలకే ఇప్పించుకుంటూ వేలమంది నిరుద్యోగులు పొట్టకొడుతున్నారని అంటున్నారు. భృతిని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ నాయకుల సమక్షంలో కొందరికే ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.

నాలుగున్నరేళ్లకు గుర్తొచ్చిందా..?
అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి కింద రూ.2వేలు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్లు ఏమీ పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీకి భయం పుట్టింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అది చెప్పి కూడా రెండు నెలలు అయింది. ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ 600 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.     – మూలె హర్షవర్థన్‌రెడ్డి, 
వైఎస్సార్‌ సీపీ నేత, ఎర్రగుంట్ల మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement