కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్‌సెల్‌కు భారీగా హాజరైన రైతులు (ఫైల్)
రైతుల రుణమాఫీపై తొలినాళ్ల నుంచి టీడీపీ ప్రభుత్వం ఎగవేత ధోరణి ప్రదర్శించింది. గత ఎన్నికల్లో ఈ అంశంపై ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత తర్వాత అమలులో చూపలేదు. ఆరంభంలోనే సవాలక్ష ఆంక్షలు విధించి అర్హుల జాబితాను వడపోసి కుదించింది. తర్వాత మాఫీ ఒక్కసారిగా కాదు అయిదు విడతలని ప్రకటించింది. ఊరించి ఊరించి ఈ అయిదేళ్లలో మూడు విడతలుగా మాఫీ నిధులు విదిల్చింది. నాలుగో విడతకు కాలం కాస్తా ముగిసిపోయింది. ఐదో విడతదీ అదే పరిస్థితి. నాలుగు నెలలుగా అదిగో ఇదిగో అంటూ సర్కారు మాయమాటలు చెబుతోంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటన విడుదలకు ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలింది. దీంతో అసలు సర్కారు మాఫీకి సంబంధించి నిధులు ఇస్తుందా లేదా అన్న అనుమానం రైతులను వెంటాడుతోంది. కొందరైతే ఆశలే వదులుకున్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది.
సాక్షి కడప : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే రుణమాఫీ అవుతుందని అన్నదాతలు భావించారు. కానీ వెంటనే దీని ప్రస్తావన తేలేదు. కసరత్తు పేరిట కాలహరణం చేశారు. తర్వాత అనేక రకాల ఆంక్షలు.. నిబంధనలను రూపొందించారు. అర్హులైన అన్నదాతల జాబితాను కుదించారు. బాబు హయాంలో ఇప్పటి వరకూ నాన్చుతూ మూడు విడతల సొమ్ము మాత్రమే విడుదల చేసింది. ఇంకా రెండున్నర లక్షల మంది రైతులకు నాలుగు ..ఐదు విడతల మాఫీ నిధులు విడుదల చేయాల్సి ఉంది.
సర్కార్ నాలుగో ఏడాదిలోనే మాఫీ సొమ్ముకు సంబంధించిన మొత్తాలను అందిస్తామని గొప్పలు చెప్పింది. ఇప్పటివరకు రైతుల ఖాతాలకు జమ కాకపోవడంతో మంత్రుల నుంచి ఇతర నేతల వరకు సమాధానం చెప్పలేకపోతున్నారు. వారం వారం రైతులు సోమవారం అధికారులను కలిసి అర్జీలిస్తున్నారు. ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో రుణమాఫీ సొమ్ము ఖాతాలో ఎప్పుడు వేస్తారనని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నందున ఈ అంశంపై ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవల్సి వస్తుందని టీడీపీ నాయకులు కూడా బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది.
ఎన్నికల ముందు గిమ్మిక్కులు
ఎన్నికల ముందు సర్కార్ గిమ్మిక్కులకు తెర తీస్తుంది. రుణమాఫీ సొమ్ము ఇప్పటివరకు అందించలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు ప్రకటించింది.విడతల వారీగా పంపిణీ చేసి ఓట్లకు గాలం వేయాలనేది సర్కారు వ్యూహం. అదే తరహాలోనే రుణమాఫీ సొమ్మును చివరిలో ఖాతాల్లో వేసి ఓట్లు దండుకోవాలనే పన్నాగం పడుతోందని కూడా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. చిత్తశుద్ది ఉంటే ముందస్తుగానే పంపిణీ చేసి నిజాయితీ చాటుకోవాలని విపక్షనాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ సర్కారు ఎన్నికలకు సమీపంలో మాఫీని మమ అనిపించి ఓట్లకు స్కెచ్ వేయాలని చూస్తుండడంపై పలుచోట్ల చర్చ జరుగుతోంది.
ఏదీ ఆ ప్రస్తావన
జిల్లాలో సుమారు 33 బ్యాంకులకు సంబంధించి 330కి పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. తొలి విడత రుణమాఫీ నాటికి దాదాపు 4.50 లక్షల ఖాతాలుండగా, నాల్గవ విడతకు వచ్చేనాటికి 2.50 లక్షలకు పరిమితమయ్యాయి. బంగారు, పంట రుణాలు తీసుకున్న మాఫీ లబ్దిదారులు రోజూ బ్యాంకుల వద్దకు వెళ్లి విచారిస్తున్నారు. మాఫీ సొమ్ము ఎప్పుడు పడుతుందని బ్యాంకర్లను వాకబు చేసి నిరాశగా ఇంటిముఖం పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తాకిడి అధికంగానే కనిపిస్తోంది. నాలుగు, ఐదు విడతలకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కులు అందిస్తారా? లేక డైరెక్టుగా అకౌంట్లలో జమ చేస్తారా? అన్నది ఇంతవరకు తెలియడం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మాఫీ సొమ్ము ఇప్పటికిప్పుడు రైతులకు అందించడం సాధ్యమా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. తాజా క్యాబినెట్ సమావేశంలో కూడా మాఫీపై చర్చ లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి.
అనుమానంగా ఉంది
నా పేరు బోవిళ్ల తిరుపాల్‌రెడ్డి. అట్లూరు మండలంలోని కొండూరు. రూ.1.50లక్షలకు సంబంధించి తొలి విడత, రెండవ విడత కలిపి రూ. 60 వేలు అందించారు. మూడవ విడత సొమ్ము అందలేదు. నాలుగు, ఐదు విడతలు కూడా వస్తాయో, రావోనన్న అనుమానం ఉంది. బాండ్లు ఇచ్చినా మాఫీ సొమ్ము పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment