పసుపు రాజ్యం..ఇసుక భోజ్యం | Sand Mafia In YSR Kadapa | Sakshi
Sakshi News home page

పసుపు రాజ్యం..ఇసుక భోజ్యం

Published Thu, Apr 4 2019 11:35 AM | Last Updated on Thu, Apr 4 2019 11:59 AM

Sand Mafia In YSR Kadapa - Sakshi

సాక్షి కడప : కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇసుక, సుద్ద, మట్టి అక్రమ రవాణాకు అడ్డం కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నారో... లేక ఎలాగోలాగా అడ్డంగానైనా సంపాదించాలని తెగబడ్డారో తెలియదుగానీ ఏకంగా నదులను లూటీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణమన్నట్లు అన్నిచోట్ల అక్రమాలే పరమావధిగా టీడీపీ నేతలు తెగబడుతున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపులను సాకుగా చూపి ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా తోడేస్తున్నారు. అనుక్షణం తవ్వకాలతో ఇసుకను సమీప ప్రాంతాలకేగాక గతంలో సరిహద్దు రాష్ట్రాలకు కూడా రవాణా చేశారు. చిత్రావతి, పెన్నా,  చెయ్యేరు, బాహుదా, పాపాగ్ని, కుందూ తదితర నదులలో ఉన్న ఇసుకను అంతా తరలించడంతో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. పైగా ఇసుక కొరత కూడా ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.  

ఇసుకను తోడేస్తున్న తమ్ముళ్లు
 తెలుగు తమ్ముళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను లోడ్‌ చేసి పంపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని ఎంతపడితే అంత అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జమ్మలమడుగుతోపాటు కొండాపురం మండలాల్లోని పలు ప్రాంతాల నుంచి ఏకంగా టిప్పర్ల ద్వారా ఇసుకను బెంగళూరుతోపాటు ఇతర రాష్ట్రాలకు పంపుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. అక్కడే కాకుండా అన్నిచోట్ల నదుల్లో ఇసుకను తోడేస్తూ....లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నది నుంచి ట్రాక్టర్‌ ఇసుకను బయటికి తెచ్చి సమీప ప్రాంతాలకు రూ. 3 వేలు–5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇసుక పుణ్యమా అని తమ్ముళ్లు లక్షలకు లక్షలు వెనకేసుకున్నారని ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారు. 

ఎండుతున్న బోర్లు...తాగునీటికి గండం
జిల్లాలో ఇసుక పేరుతో తమ్ముళ్లు దోపిడీ చేస్తుండడంతో నదుల్లో ఇసుక లేక భూగర్భ జలాల సమస్య తలెత్తుతోంది. ఏకంగా పెనగలూరు మండలంలోని కోనంతరాజపురం గ్రామ సమీపంలో చెయ్యేరు నదిలో ఇసుక అంతా లూటీ కావడంతో...అక్కడ సీపీడబ్లు్య స్కీముకు సంబంధించి 45 గ్రామాలకు తాగునీరు అందించే పథకం నిలువునా ఎండిపోయింది. అంతేకాదు...తిప్పిరెడ్డిపల్లె, చెరువుకిందపల్లె, జంగంపల్లె, కొండాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకంతో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. చివరకు రైతులకు సాగుకు అందించే బోర్లు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి.  

నదులకు తప్పని గర్భశోకం
జిల్లాలోని నదీమ తల్లులు గర్భశోకంతో తల్లడిల్లుతున్నాయి. నదుల్లో ఉన్న ఇసుకను లూటీ చేయడంతో.. పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. పాపాగ్ని, పెన్నా, చిత్రావతి, చెయ్యేరు, బాహుదా, కుందూ నదుల్లో నీటి చెమ్మ లేక కన్నీరు పెడుతున్నాయి. నందిమండలం, చెన్నూరు, తిప్పిరెడ్డిపల్లె, రాజుపాలెం, వేంపల్లె, ఏటూరు, కోమంతరాజపురం, ప్రొద్దుటూరు,దేవగుడిపల్లెలు, దొమ్మర నంద్యాల, లావనూరు, పార్నపల్లె, చెరువుకిందపల్లె, జంగంపల్లె, సుండుపల్లె, సిద్దవటం మండలంలోని పలు పల్లెల్లో ఇసుక నిరంతరాయంగా సరిహద్దులు దాటుతూ వచ్చింది.  

చెయ్యేరును చెరబట్టారు
రాజంపేట: చెయ్యేరులో ఇసుకాసురుల దందా కొనసాగుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన చోట కాకుండా మిగిలిన చోట్ల నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. చెయ్యేరు యేటి పొడవునా రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న చెయ్యేటిలో ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇసుక తోడేసిన ప్రభావం బోర్లపై పడుతుందని, భూగర్భజలాలు అడుగంటిపోతాయని రైఉతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా వ్యవహారం చెయ్యేటి మూడు మండలాల్లో ప్రస్తుత టీడీపీ నాయకుల కనుసన్నల్లో జరుగుతోంది.  

పోట్లదుర్తి బ్రదర్స్‌.. అక్రమాలకు అడ్రస్‌
ఎర్రగుంట్ల :  మండల పరిధిలోని పోట్లదుర్తి, బిస్మిల్లాబాదు, కేజీవీ పల్లె గ్రామాల సమీపంలో ఉన్న పెన్నానదిలోని ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు.  అధికార పార్టీ అండదండలతో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో తొలుత పోట్లదుర్తిలో ఇసుక క్వారీకి అనుమతి తీసుకొని ఇసుకను పోట్లదుర్తి బ్రదర్స్‌గా  పేరు పొందిన సీఎం రమేష్, సీఎం సురేష్‌లు తోడేశారు. తర్వాత బిస్మిల్లాబాదు గ్రామ సమీపంలో ఇసుక క్వారీకి అనుమతి తీసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రస్తుతం కేజీవీ పల్లె గ్రామం నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ గ్రామంలో గతంలో రెండు ట్రాక్టర్లు ఉండగా ప్రస్తుతం అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో 30 దాకా ట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఇసుక ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా  మైనింగ్, రెవెన్యూ , పోలీసు శాఖ వారు పట్టించుకోకపోవడంతో  వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారు. టీడీపీ పాలనలో ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ నుంచి రూ.2000 వసూలు చేస్తున్నారు.

ఇసుక నుంచి తైలం తీశారు
 కడప కార్పొరేషన్‌: కడపలో గండివాటర్‌ వర్క్స్, ఓబులంపల్లె ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలించారు.  వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చిన రైతు రథం ట్రాక్టర్లనే టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు వినియోగించడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణా వల్ల రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి.  అయా మార్గాలలో ఉండే పంట పొలాలు,   మామిడి వనాలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో తాగు నీటిని సరఫరా చేసే బోర్లు, రైతుల బోర్లు  ఇసుకాసురుల ధాటికి పూర్తిగా ఎండిపోయాయి. 

ఇసుక అక్రమ రవాణాతో తాగునీటి ఎద్దడి
ఇసుకను ఇష్టం వచ్చినట్లు నదుల నుంచి తోడేయడం వల్ల కడపలోని గండి, లింగంపల్లి వాటర్‌ వర్క్స్‌ల వద్ద ఈ వేసవిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. గండి వద్ద కడపకు నీటిని సరఫరా చేసే బోరు బావుల వద్ద ఇసుక శాతం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బోరుబావులు ఒక పక్కకు ఒరిగిపోతున్నాయి. కడపకు తాగునీటి ఎద్దడి తలెత్తడంతో అలగూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రతిరోజూ 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు కుందూనది ద్వారా పెన్నాలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే నదుల్లో  ఇసుక మాఫియా తవ్విన లోతైన గోతుల వల్ల ఆ నీరు 20 రోజులవుతున్నా ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు కూడా చేరని పరిస్థితి ఏర్పడింది. 

స్పందించని అధికార యంత్రాంగం
ఐదేళ్లుగా ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మిన్నకుండి చూసింది తప్పితే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదును దొరికినప్పుడల్లా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలించారు.  ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుక జిల్లా సరిహద్దులు దాటి పోతోంది. ట్రాక్టర్‌ ఇసుక రూ.3వేలు చొప్పున ప్రతిరోజూ 200 ట్రిప్పులు తోలినా రూ.6లక్షలు సంపాదించవచ్చు. ఈ లెక్కన 20రోజులు తోలితే చాలు కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాల వల్ల నదులు గుల్ల కావడంతోపాటు ఈ ప్రాంతా ల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. 

ఇసుక దోపిడీ
కమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి స్వయానా సోదరులు వల్లూరు మండలంలోని జంగంపల్లె సమీపంలో పాపాగ్ని నది నుంచి ఇసుకను తరలిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుక ఇక్కడి నుంచి తరలుతోంది. పాపాగ్ని నది నుంచి పెండ్లిమర్రి మండలం నందిమండలం సమీపంలో  , కమలాపురం మండలంలోని సముద్రంపల్లె వద్ద నుంచి, వీరపునాయునిపల్లె మండలంలోని అనిమెల సమీపం నుంచి, వల్లూరు మండలంలోని చెరువుకిందిపల్లె సమీపం నుంచి  అక్రమంగా ఇసుక తరలుతోంది.  ఇసుక మేటలు తరిగిపోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయ , తాగు నీటి బోర్లు ఎండిపోతున్నాయి.     వల్లూరు

మంత్రి ఇలాఖా నుంచే ఇసుక సరఫరా
ప్రొద్దుటూరు :మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక సరఫరా అవుతోంది.  ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వకపోగా జమ్మలమడుగు మండలంలోని సుగుమంచిపల్లె, సున్నపురాళ్లపల్లె, దేవగుడి గ్రామాల్లోని ఇసుక క్వారీల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారు.  ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉన్నా మంత్రి ఒత్తిడి కారణంగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్వయంగా కలెక్టర్‌ హరికిరణ్‌తో, జెడ్పీ సమావేశాల్లో చర్చించారు. చివరగా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఇసుక క్వారీ మాత్రం మంజూరు కాలేదు. రోజూ ఉదయాన్నే కొన్ని వందల ట్రాక్టర్ల ఇసుక జమ్మలమడుగు పరిధిలోని ఇసుక క్వారీల నుంచి ప్రొద్దుటూరుకు ఇసుక సరఫరా అవుతోంది. పెద్దశెట్టిపల్లె, శంకరాపురం ప్రాంతాల నుంచి లారీలతో అధికార పార్టీ నేతలు ఇసుకను తరలిస్తుండగా గతంలో అధికారులు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ట్రాక్టర్ల యజమానులను జమ్మలమడుగు ఇసుక క్వారీకి రాకుండా అడ్డుకట్ట వేశారు. తాము మాత్రమే ఇసుకను సరఫరా చేస్తామని బయటి ట్రాక్టర్లు రావద్దని జమ్మలమడుగు నేతలు నిబంధనలు విధించారు. 

ఇసుకకు డిమాండ్‌ పెరిగింది
స్థానికంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. ట్రాక్టర్‌ ఇసుక రూ.2వేలు అమ్ముతున్నారు. ప్రొద్దుటూరులో ఇసుక దొరికినప్పుడు రూ.1000 లోపే వచ్చేది. 

– యనమల రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు.  

పెన్నాను తవ్వేసుకున్నారు
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌: జమ్మలమడుగు మండలంలోని పొన్నతోట, అంబవరం, దేవగుడి, సుగుమంచిపల్లి, సున్నపురాళ్లపల్లి, మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల, కొండాపురం మండలంలోని ఏటూరు ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఇదే అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. దేవగుడి పరిసర గ్రామాల్లోనే అధికంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అంబవరం ఇసుక రీచ్‌లను అధికారులు సూచించిన క్యూబిక్‌ మీటర్‌ కంటే ఎక్కువగా తవ్వుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మోరగుడి గ్రామ సమీపంలో ఇసుక రీచ్‌ లేకపోయినా స్థానిక అధికార పార్టీ నాయకులు గేట్‌ పేరుతో ట్రాక్టర్‌కు రెండు వందల రూపాయలు వసూలు చేస్తూ ఆదాయం గడిస్తున్నారు. కొండాపురం మండలంలో టీడీపీ నాయకులు మరింతగా రెచ్చిపోయి పొక్లెయిన్‌లు పెట్టి టిప్పర్‌ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో పెన్నానది ఇసుకను ఇతర జిల్లాలతోపాటు తెలంగాణ, కర్నాటక ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. 

మాఫియాకు మైనింగ్‌ అధికారుల వత్తాసు..
పెన్నానది బ్రిడ్జి కింద ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం వల్ల బ్రిడ్జి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మైనింగ్‌ అధికారులు నియోజవర్గంలో ఉన్నా ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు లేవు.  
 
– పాలూరు నరసింహులు, జమ్మలమడుగు

భవిష్యత్తు ప్రమాదమే.. 
పెన్నానదిలో ఇసుకను పూర్తిగా తరలించుకెళుతున్నారు. ఇలాగే అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

–శివకుమార్, యువజన సంఘం నాయకుడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

పెన్నానదిలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లకు నింపుతున్న దృశ్యం

2
2/5

పెన్నానదిలో ఇసుకను తీసుకెళ్లేందుకు బారులు తీరిన ట్రాక్టర్లు

3
3/5

పోట్లదుర్తి గ్రామ పరిధిలోని పెన్నానదిలో నుంచి ఇసుకను తరలిస్తున్న దృశ్యం

4
4/5

పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాచేస్తున్న దృశ్యం

5
5/5

పెద్దదండ్లూరు పెన్నా నదిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement