కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న డీఎస్సీ విద్యార్థులు, వైఎస్సార్ నాయకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘జాబు కావాలంటే బాబు రావాల’ని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే భిక్షమేసినట్లు ఏడు వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మోసం చేశారని, వారికి వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం వారు వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
అంతకుముందు నగరంలోని శకుంతల కల్యాణ మండపం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. డీఎస్సీ పోస్టులను పెంచాలని, సిలబస్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, గంటాకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మద్దతు ప్రకటించి.. వారితో పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిస్తోందన్నారు.
ప్రభుత్వ శాఖల్లో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఏడు వేల పోస్టులను నోటిఫికేషన్‌లో చూపించి అందులోనూ వెయ్యి పోస్టులను కుదించడం అన్యాయమన్నారు. ఏటా డీఎస్సీని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం..నాలుగున్నరేళ్లుగా మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. ప్రస్తుత డీఎస్సీలో కొన్ని విభాగాల్లో పోస్టులే లేవని, అలాంటప్పుడు ఏళ్లుగా వాటి కోసమే చదువుతున్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక అభ్యర్థితో రెండు పరీక్షలకు డబ్బు కట్టించుకున్న ప్రభుత్వం..పరీక్ష మాత్రం ఒక్కదానినే రాయాలని పేర్కొనడం దారుణమన్నారు.
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
మోసం చేసిన ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థులు బుద్ధి చెప్పాలని బీవై రామయ్య పిలుపునిచ్చారు. 22 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలు ఓపిక పడితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యి.. ప్రతి పోస్టు భర్తీకి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ కోసం ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే ఏడు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. ఇది కూడా ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. నిరుద్యోగ భృతి కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి డీఎస్సీ పోస్టులను పెంచాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాయకులు సయ్యద్ ఆసిఫ్, కృష్ణకాంత్‌రెడ్డి, రవిబాబు, జగన్నాథరెడ్డి, వై.రాజశేఖరరెడ్డి, ధనుంజయాచారి, భాస్కరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment