ఇన్‌చార్జి డీఆర్‌ఓ స్వర్ణలతకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన అందని ద్రాక్షగా మారిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలతో కాలం గడుపుతున్నారని, ఆయన ఉద్యోగాల కల్పనను పట్టించుకోవడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
లక్ష ఉద్యోగాల వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ వెంటనే ఆమేరకు ఉద్యోగాలు కల్పించాలని నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యోగాల కోసం పోరాడాల్సిన దౌర్భాగ్యం నెలకొందన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లలోనూ ఇబ్బడిముబ్బడిగా తప్పులు దొర్లుతుండడం, నిర్దిష్ట నియమ నిబంధనలను పేర్కొనకపోవడాన్ని చూస్తే నియామకాలపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందని చెప్పారు.
వీటి కారణంగానే 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–2, గతేడాది చేపట్టిన గురుకుల పరీక్షల ఫలితాలు విడుదల చేయడం లేదని ఆయన ఉదహరించారు. టీఎస్ పీఎస్సీ తప్పిదాల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమని నిరుద్యోగులను అవహేళన చూస్తూ మాట్లాడడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం 12 వేల మందికే ఉద్యోగాలు వచ్చాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేదాకా తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పురాకుండా దశల వారీగా తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్, యూత్ విభాగం అధ్యక్షుడు శీలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పత్తి సంతోష్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇబ్రహీం, జిల్లా యూత్ కార్యదర్శి తాళ్ల అఖిలేష్‌గౌడ్, నాయకులు అంజిబాడు, రాంరెడ్డి, వంశీరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గైడ్, నరేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment