విశాఖపట్నం : అధికారాంతమున ఏయూ పెద్దలు అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు. వీసీగా బాధ్యతల నుంచి వైదొలగడానికి రెండు నెలలు ముందు నుంచి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదన్నది సంప్రదాయం. కానీ అస్మదీయులకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేందుకు ఏయూ పెద్దలు అన్నింటినీ గాలికి వదిలేశారు. బాధ్యతల నుంచి వైదొలగానికి రెండురోజుల ముందు వీసీ జీఎస్‌ఎన్‌రాజు అడ్డదారిలో అస్మదీయులకు అందలం ఎక్కించారు. అందుకోసం అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేశారు.
ఇదీ అక్రమాల దొంతర
ఏయూ వుమెన్ స్టడీ సెంటర్‌కు ఇటీవల యూజీసీ భారీ గ్రాంటు మంజూరు చేసింది. అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏయూ పెద్దలు వ్యవహరించారు. అప్పటికే ఆ విభాగంలో కన్సాలిడెటెడ్ వేతనంతో పనిచేస్తున్న ఆరుగురిని టైంస్కేల్ కిందకు మార్చేశారు. అలా ఒక్కొక్కరి వేతనాన్ని రెట్టింపు చేసేశారు. అంతేగానీ కొత్తగా పోస్టులు భర్తీ చేసి అర్హులైన నిరుద్యోగులు న్యాయం చేయాలని భావించలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. అందుకే హడావుడిగా పదవీ కాలం ముగియడానికి ఒక రోజు ముందు ఫైలు రూపొందించి ఆమోదముద్ర వేశారు. జపనీస్ స్టడీస్ విభాగంలో ఒకర్ని టీచింగ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఆయనకు నెలకు రూ.20వేల వేతనం నిర్ణయించడం గమనార్హం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ సెంటర్(ఐఏఎస్‌సీ)లో అడ్డగోలుగా ఓ మహిళకు పోస్టింగు ఇచ్చారు. గతంలో విజయనగరం పీజీ సెంటర్‌లో పనిచేసిన ఆమె దాదాపు 8 నెలల క్రితం విధుల నుంచి వైదొలగారు. కానీ ఆమెను ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా ఐఏఎస్‌సీ విభాగంలో టీచింగ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ వ్యవహారంలో కూడా అధికార పార్టీ నేతల సిఫారసుతోపాటు పెద్దమొత్తం చేతులు మారినట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఒకర్ని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నియామకానికి ఆ విభాగ పెద్దలు సమ్మతించలేదని తెలుస్తోంది. ఆయన్ని చేర్చుకోవడానికి వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరో ముగ్గురిని టీచింగ్ అసిస్టెంట్లుగా నియమించడానికి కూడా ఫైలు రూపొందించారు. కానీ ఇంతలో ఇన్‌చార్జ్ వీసీని నియమిస్తూ ఆదేశాలు రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. అయినాసరే ఉత్తర్వులు ఇచ్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలకు తిలోదకాలు
అస్మదీయులకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించడానికి ఏయూ పెద్దలు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం కొత్త పోస్టులు నియమించాలంటే రోస్టర్ పాయింట్లు పాటించాలి. రిజర్వేషన్లను పాటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇంట ర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. అలా చేస్తే అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లభిస్తుంది. కానీ ఇవేవీ లేకుండా అడ్డదారిలో ఏయూ పెద్దలు తమ వారిని అందలం ఎక్కించేశారు.
నియామకాలు చెల్లుతాయా?
నిబంధనల ప్రకారం పదవీకాలం ముగియడానికి రెండు నెలల ముందు నుంచి వీసీలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకడదు. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త పోస్టుల భర్తీ అనేది జీతభత్యాల రూపంలో ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన అంశమే. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీసీ జీఎస్‌ఎన్ రాజు పోస్టులు కట్టబెట్టేయడం గమనార్హం. గతంలో కూడా ఒకరిద్దరు వీసీలు తమ పదవీకాలం చివరిరోజుల్లో భర్తీ చేసిన పోస్టులను తరువాత రద్దు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీసీ జీఎస్‌ఎన్‌రాజు తన పదవీకాలం చివర్లో ఆమోదించిన ఈ నియామకాల అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.
అధికారాంతమున.. అడ్డగోలు నియామకాలు
Published Fri, Feb 5 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM
Advertisement
Advertisement