Replace posts
-
నోటిఫికేషన్లపై నాన్చుడు
సాక్షి, అమరావతి: లక్షల మంది నిరుద్యోగులు దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న గ్రూప్ – 1, గ్రూప్ – 2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గ్రూప్ – 2 కేటగిరీలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను ‘గ్రూప్ – 1 బి’ కింద భర్తీ చేసేందుకు అనుమతించాలంటూ ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పోస్టులను గ్రూప్– 1లో కలిపితే నష్టపోతామనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. గ్రూప్ – 1లో విలీనానికి వీలుకాకుంటే గ్రూప్ – 2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి నివేదించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో గ్రూప్ – 1, గ్రూప్ – 2 నోటిఫికేషన్ల విడుదల సందిగ్ధంలో పడింది. నెలలు గడుస్తున్నా విడుదల కాని నోటిఫికేషన్లు గ్రూప్ – 1, గ్రూప్ – 2తో సహా వివిధ కేటగిరీల్లోని 18,450 పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది. అయితే మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. వీటిల్లో గ్రూప్ – 1 పోస్టులు 182 ఉండగా, గ్రూప్ – 2లో 337 పోస్టులు (ఎగ్జిక్యూటివ్ 138, నాన్ ఎగ్జిక్యూటివ్ 199) ఉన్నాయి. భారీగా దండుకునే ఎత్తుగడ! ఏపీపీఎస్సీ ఇప్పుడు మళ్లీ గ్రూప్ – 2 పోస్టుల భర్తీకి పాత ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ –1లో కలిపేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి జీవో 141 ప్రకారం గ్రూప్ – 2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను పాత పద్ధతిలోనే యధాతథంగా భర్తీ చేసేందుకు అవకాశమున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలంటూ ఏపీపీఎస్సీ కాలయాపన చేస్తోంది. గ్రూప్– 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ – 1లో విలీనం చేసేందుకు అంగీకరించకున్నా కనీసం ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకైనా అనుమతించాలంటూ తాజాగా ఏపీపీఎస్సీ కొత్త మెలిక పెడుతోంది. గతంలో గ్రూప్ – 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటిని రద్దు చేస్తూ గ్రూప్ –1 పోస్టులు, మరికొన్ని గెజిటెడ్ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలను పరిమితం చేస్తూ జీవో 420 ఇచ్చారు. అప్పటి నుంచి గ్రూప్ –2లో కొన్ని గెజిటెడ్ పోస్టులకు తప్ప ఇంటర్వ్యూలు లేవు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా సివిల్ సర్వీస్, మరికొన్ని కేడర్ పోస్టులకు తప్ప కిందిస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం చూసినా ఇంటర్వ్యూలు నిర్వహించ కూడదు. కానీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ఇంటర్వ్యూలు చేపట్టేందుకు వీలుగా ఏపీపీఎస్సీ ద్వారా ప్రతిపాదనలను రూపొందించి పంపారు. ఇంటర్వ్యూల ద్వారా దండుకొనే వ్యవహారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలలో మార్కులు వేసే పేరుతో నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ ప్రతిపాదన తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం జీవోలు ఇవ్వగా ఇప్పుడు వాటిని నిర్వహించాలని ప్రయత్నించడం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముగిసిపోతున్న గరిష్ట వయోపరిమితి గ్రూప్స్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో కేబినెట్ ఆమోదం తెలిపినా ఇప్పటివరకు నోటిఫికేషన్లు రాకపోవడం, గరిష్ట వయో పరిమితి దాటిపోతుండడంతో లక్షల మంది నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచినా నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆ వయసు కూడా దాటిపోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ – 2 పోస్టులకు పాత పద్ధతిలోనే వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విలీనంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత గ్రూప్ – 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మెయిన్స్‌ను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తున్నారు. మెయిన్స్‌లో ఆరు పేపర్లను రాయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు వీటితోపాటు ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కొనాలి. ఇక గ్రూప్ – 2 పరీక్షను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు అదే తరహాలో సన్నద్ధమవుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి శిక్షణ కూడా తీసుకుంటున్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గ్రూప్ – 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను ‘గ్రూప్ – 1 బి’ కింద మార్పు చేస్తూ జీవో 622 జారీచేశారు. దీనిపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో జీవో నిలిపివేశారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన సమయంలో గ్రూప్ – 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ – 1లో విలీనం చేయాలని నిర్ణయించడంతో నిరుద్యోగులు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రతిపాదనను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం జీవో 356ను, ఆ తరువాత 622 జీవో స్థానంలో 141 జీవోను విడుదల చేసింది. చివరకు గ్రూప్ – 2 పోస్టులకు పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించారు. -
ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో 209 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 209 వైద్యుల పోస్టులు, ఇతర పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అందులో 173 పారామెడికల్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా, 36 వైద్యుల పోస్టులను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. 173 పారామెడికల్ పోస్టుల్లో అధికంగా 85 స్టాఫ్ నర్సు పోస్టులున్నాయి. 16 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, 10 ల్యాబ్ అటెండెంట్, 10 థియేటర్ అటెండెంట్, 10 రేడియోగ్రాఫర్ గ్రేడ్–2 పోస్టులున్నాయి. 36 వైద్యుల పోస్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టులున్నాయి. -
1,10,012 పోస్టులు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 83,048 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 52,724 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు జారీ అయ్యాయని, అందులో 28,116 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిందని పేర్కొంది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ఎన్.రాంచంద్రారావు, సభావత్ రాములు నాయక్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఖాళీ పోస్టులు, వాటి నియామకానికి తీసుకుంటున్న చర్యల్లో పురోగతి వివరాలు వెల్లడించింది. -
వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 13,496 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వైద్యా రోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వీటిలో 5,766 నర్సుల పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నా సభకొచ్చా: శ్రీనివాస్‌గౌడ్ తన తండ్రికి ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతోందని, అయినా గీత కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు సభకు వచ్చానని, తనకు అదనపు సమయం కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పీకర్ మధుసూదనాచారికి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. తాటి, ఈత చెట్లపై దళారీల పెత్తనం పెరుగుతోందన్నారు. బార్లు, రెస్టారెంట్ల లైసెన్సుల్లో గీత కార్మిక యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పద్మారావు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.69 కోట్లకు పైగా ఈత చెట్లు నాటామని, వాటిని సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కల్లును ఔషధంగానే చూస్తున్నామని, దాని వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే భావన ఉందన్నారు. ప్రమాదవశాత్తూ మరణించే గీత కార్మికులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. -
సింగరేణిలో 750 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో 750 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్మికుల విభాగంలో 643, అధికారుల కేటగిరీలో 107 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి శనివారమే నోటిఫికేషన్ వెలువడనుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించడంతో సింగరేణి యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది. ఆయా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, పేస్కేలు, రోస్టర్, స్థానికత తదితర పూర్తి వివరాలను ఠీఠీఠీ.టఛిఛిజీఝజీn్ఛట.ఛిౌఝ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే.. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ పోస్టుల భర్తీతో సింగరేణిలో కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 7,198కి చేరనుందని పేర్కొన్నారు. పోస్టుల వివరాలు కార్మిక శ్రేణి విభాగంలో.. పోస్టులు సంఖ్య ఫిట్టర్ ట్రైనీ 288 ఎలక్ట్రీషియన్ ట్రైనీ 143 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ 69 టర్నల్/మెషినిస్ట్ ట్రైనీ 51 సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) 35 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 24 మౌల్డర్ ట్రైనీ 24 మోటార్ మెకానిక్ ట్రైనీ 8 మౌల్డర్ 1 అధికార శ్రేణి కేటగిరీలో.. మేనేజ్మెంట్ ట్రైనీ ఈఅండ్ఎం 68 మైనింగ్ 37 హైడ్రో జియాలజిస్టు 1 జియో ఫిజిస్ట్ 1 -
అటవీ, వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ
2,345 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,345 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీ శాఖలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్–67, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్–90, ఫారెస్టు బీట్ ఆఫీసర్–1,857 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 21 నుంచి వచ్చే నెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. వైద్యారోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టులు)–205, డెంటల్ అసిస్టెంట్ సర్జన్–10, వైద్య విద్యలో ట్యూటర్స్–65, వైద్య విద్యలో లెక్చరర్స్ ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ ఫిజిసిస్ట్స్–6, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్–43, అసిస్టెంట్ పిజియోథెరపిస్టు–2 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 22 నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను, పరీక్ష తేదీల వివరాలను తమ వెబ్సైట్లో పొందొచ్చని టీఎస్పీఎస్సీ పేర్కొంది. -
మెడికల్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
వచ్చేవారంలో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు మెడికల్ కళాశాలలో భర్తీకి ప్రభుత్వం అనుమతి ఎంసీఐ పుణ్యమాని మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ కొలిక్కి వచ్చింది. రెగ్యులర్ భర్తీని కాకుండా తక్షణమే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏదీ ఏమైనా ఖాళీల కొరత కొంత మేరకు తగ్గనుంది. పోస్టుల భర్తీకి సంబంధించి కళాశాల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద సమావేశాలు నిర్వహించి కొలిక్కి తీసుకొచ్చారు. – నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ అర్బన్ : ఐదో సంవత్సరానికి రద్దయిన 100 సీట్లను పొందేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. ఇదివరకే ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించిన అధికారులు పోస్టుల భర్తీపై పడ్డారు. వీటిని జనవరిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమైన ఖాళీలను తక్షణమే భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన 150 జీవో ప్రకారం 880 పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాల్సి ఉండేది. ఇది తక్షణమే సాధ్యం కాకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేపట్టాలని నిర్ణయించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, జనరల్ ఆస్పత్రి సూపరింటిండెంట్ రాములు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించారు. వారం రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించారు. అనంతరం సీఎం ఆమోదం కోసం ఫైల్ పంపగా ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రశేఖర్‌రావు అనుమతి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ఉంది. గత శుక్ర, శనివారం కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, డీఎంఈ రమణిలు కలువగా ఈ విషయంను ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిసింది. కాగా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో 150 పోస్టులు తక్షణమే భర్తీచేయాలని కళాశాల అధికారులు విన్నవించారు. కానీ.. ఇందులో ఎన్ని పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారన్నది ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి రెండో వారంలో పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చిలో ఎంసీఐ పర్యటన ఉన్నందున ఈ పోస్టుల భర్తీపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రికి సంబంధించి వైద్యసిబ్బంది, స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరందరిని ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఇంకా ఆలస్యం మెడికల్ కళాశాల ఏర్పడగానే 2012 సంవత్సరంలో 150 జీవోను పోస్టుల భర్తీకి సంబంధించి నాటి ప్రభుత్వం విడుదల చేసింది. 880 పోస్టులను భర్తీచేసేందుకు నిర్ణయించారు. ఇందులో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, పరిపాలన విభాగంలోని జూనియర్, సీనియర్, సూపరింటెండెంట్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఆస్పత్రి విభాగంలో నాలుగో తరగతి ఉద్యోగులు, టెక్నికల్ ఉద్యోగులు, ఎక్స్‌రే, రేడియేషన్, అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్‌టెక్నిషన్‌లు, ఫార్మాసిస్టులు, డ్రైవర్లు, దోబీలు, సెన్నో, లైబ్రేరియన్, పారామెడికల్ సిబ్బంది తదితర పోస్టులను మంజూరు చేశారు. వీటిని రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నాలుగేళ్లు గడుస్తున్న ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తెరపైకి రావడంతో రెగ్యులర్ ఉద్యోగాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తక్షణ కొరతను తీర్చేందుకు ఔట్ సోర్సింగ్‌ను తెరపైకి తేవడంతో దీనినే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్నెళ్లుగా రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎందరో నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నవారు సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ పోస్టులు పడితే పరిస్థితి మారుతుందని వారు ఆలోచనలో ఉన్నారు. వీరు కూడా నిరాశ చెందుతున్నారు. జనవరిలో నియామకాలు.. మెడికల్ కళాశాలలో తక్షణమే అవసరమైన పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకం చేపడుతాం. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోస్టుల అవసరాన్ని తెలియజేశాం, అనుమతి వచ్చింది. ఎన్ని పోస్టుల భర్తీ, ఎప్పుడు అన్నది మరో వారం రోజుల్లో అధికారికంగా తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ఔట్ సోర్సింగ్ నియామకాలు జరిగే అవకాశం ఉంది. – ఇందిర, కళాశాల ప్రిన్సిపల్. -
గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్
మార్కులు, సిలబస్ ఖరారు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం గ్రూప్2లో అత్యధికంగా ఉండే అభ్యర్థులను వడపోసేందుకు ముందుగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. గ్రూప్2కు నిర్దేశించిన 3 పేపర్లకు ఇది అదనంగా ఉంటుంది. వ డపోత అనంతరం మిగిలిన వారిని పోస్టులకు నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరికి ఆన్లైన్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇదివరకు ఇచ్చిన జీవో 623కి సవరణ చేస్తూ ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు సిలబస్ ఎ:- కరెంటు అఫైర్స్-ఇష్యూస్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్, ఎకనమిక్స్, సొసైటీ, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ గవర్నెన్స్ బి:- కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఫెడరలిజమ్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియ న్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, జ్యుడీషియరీ, జ్యుడికల్ రివ్యూ, లోకల్ గవర్నమెంట్, డైరక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూని యన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్టేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూని యన్ అండ్ స్టేట్ గవర్నెమెంట్స్, షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్. సి:- ఎకనమిక్ డెవలప్మెంటు ఆఫ్ ఇండియా-ఎకనామీ ఆఫ్ మీడీవల్ ఇండియా, ప్రి ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ, డెవ లప్‌మెంటు ప్లాన్స్ అండ్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్సు, రోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా, ఎకనమిక్ డిస్పారిటీస్ బిట్వీన్ రీజియన్స్ అండ్ పాప్యులేషన్ కేటగిరీస్. మెయిన్స్ సిలబస్, మార్కులు సబ్జెక్టు మార్కులు పేపర్1: జనర్ స్టడీస్ 150 పేపర్2: 1.సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ (ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్, కల్చరల్ మూవ్మెంట్సు) 2. జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ 150 పేపర్3:- ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ కాంటెంపరరీ ప్రాబ్లెమ్స్ అండ్ డెవలప్మెంటు ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్సు టు ఏపీ 150 మొత్తం 450 -
అధికారాంతమున.. అడ్డగోలు నియామకాలు
విశాఖపట్నం : అధికారాంతమున ఏయూ పెద్దలు అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు. వీసీగా బాధ్యతల నుంచి వైదొలగడానికి రెండు నెలలు ముందు నుంచి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదన్నది సంప్రదాయం. కానీ అస్మదీయులకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేందుకు ఏయూ పెద్దలు అన్నింటినీ గాలికి వదిలేశారు. బాధ్యతల నుంచి వైదొలగానికి రెండురోజుల ముందు వీసీ జీఎస్‌ఎన్‌రాజు అడ్డదారిలో అస్మదీయులకు అందలం ఎక్కించారు. అందుకోసం అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఇదీ అక్రమాల దొంతర ఏయూ వుమెన్ స్టడీ సెంటర్‌కు ఇటీవల యూజీసీ భారీ గ్రాంటు మంజూరు చేసింది. అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏయూ పెద్దలు వ్యవహరించారు. అప్పటికే ఆ విభాగంలో కన్సాలిడెటెడ్ వేతనంతో పనిచేస్తున్న ఆరుగురిని టైంస్కేల్ కిందకు మార్చేశారు. అలా ఒక్కొక్కరి వేతనాన్ని రెట్టింపు చేసేశారు. అంతేగానీ కొత్తగా పోస్టులు భర్తీ చేసి అర్హులైన నిరుద్యోగులు న్యాయం చేయాలని భావించలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. అందుకే హడావుడిగా పదవీ కాలం ముగియడానికి ఒక రోజు ముందు ఫైలు రూపొందించి ఆమోదముద్ర వేశారు. జపనీస్ స్టడీస్ విభాగంలో ఒకర్ని టీచింగ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఆయనకు నెలకు రూ.20వేల వేతనం నిర్ణయించడం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ సెంటర్(ఐఏఎస్సీ)లో అడ్డగోలుగా ఓ మహిళకు పోస్టింగు ఇచ్చారు. గతంలో విజయనగరం పీజీ సెంటర్లో పనిచేసిన ఆమె దాదాపు 8 నెలల క్రితం విధుల నుంచి వైదొలగారు. కానీ ఆమెను ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా ఐఏఎస్సీ విభాగంలో టీచింగ్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ వ్యవహారంలో కూడా అధికార పార్టీ నేతల సిఫారసుతోపాటు పెద్దమొత్తం చేతులు మారినట్లు సమాచారం. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఒకర్ని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నియామకానికి ఆ విభాగ పెద్దలు సమ్మతించలేదని తెలుస్తోంది. ఆయన్ని చేర్చుకోవడానికి వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరో ముగ్గురిని టీచింగ్ అసిస్టెంట్లుగా నియమించడానికి కూడా ఫైలు రూపొందించారు. కానీ ఇంతలో ఇన్చార్జ్ వీసీని నియమిస్తూ ఆదేశాలు రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. అయినాసరే ఉత్తర్వులు ఇచ్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు తిలోదకాలు అస్మదీయులకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించడానికి ఏయూ పెద్దలు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం కొత్త పోస్టులు నియమించాలంటే రోస్టర్ పాయింట్లు పాటించాలి. రిజర్వేషన్లను పాటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇంట ర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయాలి. అలా చేస్తే అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లభిస్తుంది. కానీ ఇవేవీ లేకుండా అడ్డదారిలో ఏయూ పెద్దలు తమ వారిని అందలం ఎక్కించేశారు. నియామకాలు చెల్లుతాయా? నిబంధనల ప్రకారం పదవీకాలం ముగియడానికి రెండు నెలల ముందు నుంచి వీసీలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకడదు. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త పోస్టుల భర్తీ అనేది జీతభత్యాల రూపంలో ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన అంశమే. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీసీ జీఎస్ఎన్ రాజు పోస్టులు కట్టబెట్టేయడం గమనార్హం. గతంలో కూడా ఒకరిద్దరు వీసీలు తమ పదవీకాలం చివరిరోజుల్లో భర్తీ చేసిన పోస్టులను తరువాత రద్దు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీసీ జీఎస్‌ఎన్‌రాజు తన పదవీకాలం చివర్లో ఆమోదించిన ఈ నియామకాల అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.