మెడికల్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
వచ్చేవారంలో ఔట్
సోర్సింగ్‌లో ఉద్యోగాలు
మెడికల్ కళాశాలలో
భర్తీకి ప్రభుత్వం అనుమతి
ఎంసీఐ పుణ్యమాని మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ కొలిక్కి వచ్చింది. రెగ్యులర్ భర్తీని కాకుండా తక్షణమే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీని చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏదీ ఏమైనా ఖాళీల కొరత కొంత మేరకు తగ్గనుంది. పోస్టుల భర్తీకి సంబంధించి కళాశాల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద సమావేశాలు నిర్వహించి కొలిక్కి తీసుకొచ్చారు. – నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్ : ఐదో సంవత్సరానికి రద్దయిన 100 సీట్లను పొందేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. ఇదివరకే ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించిన అధికారులు పోస్టుల భర్తీపై పడ్డారు. వీటిని జనవరిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమైన ఖాళీలను తక్షణమే భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన 150 జీవో ప్రకారం 880 పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాల్సి ఉండేది. ఇది తక్షణమే సాధ్యం కాకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేపట్టాలని నిర్ణయించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, జనరల్ ఆస్పత్రి సూపరింటిండెంట్ రాములు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించారు. వారం రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించారు. అనంతరం సీఎం ఆమోదం కోసం ఫైల్ పంపగా ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రశేఖర్‌రావు అనుమతి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ఉంది. గత శుక్ర, శనివారం కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, డీఎంఈ రమణిలు కలువగా ఈ విషయంను ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిసింది. కాగా ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో 150 పోస్టులు తక్షణమే భర్తీచేయాలని కళాశాల అధికారులు విన్నవించారు.
కానీ.. ఇందులో ఎన్ని పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారన్నది ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి రెండో వారంలో పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చిలో ఎంసీఐ పర్యటన ఉన్నందున ఈ పోస్టుల భర్తీపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రికి సంబంధించి వైద్యసిబ్బంది, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరందరిని ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమించనున్నారు.
రెగ్యులర్ ఉద్యోగాలు ఇంకా ఆలస్యం
మెడికల్ కళాశాల ఏర్పడగానే 2012 సంవత్సరంలో 150 జీవోను పోస్టుల భర్తీకి సంబంధించి నాటి ప్రభుత్వం విడుదల చేసింది. 880 పోస్టులను భర్తీచేసేందుకు నిర్ణయించారు. ఇందులో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, పరిపాలన విభాగంలోని జూనియర్, సీనియర్, సూపరింటెండెంట్‌లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఆస్పత్రి విభాగంలో నాలుగో తరగతి ఉద్యోగులు, టెక్నికల్ ఉద్యోగులు, ఎక్స్‌రే, రేడియేషన్, అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌టెక్నిషన్‌లు, ఫార్మాసిస్టులు, డ్రైవర్లు, దోబీలు, సెన్నో, లైబ్రేరియన్, పారామెడికల్ సిబ్బంది తదితర పోస్టులను మంజూరు చేశారు. వీటిని రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నాలుగేళ్లు గడుస్తున్న ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తెరపైకి రావడంతో రెగ్యులర్ ఉద్యోగాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తక్షణ కొరతను తీర్చేందుకు ఔట్ సోర్సింగ్‌ను తెరపైకి తేవడంతో దీనినే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్నెళ్లుగా రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎందరో నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నవారు సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ పోస్టులు పడితే పరిస్థితి మారుతుందని వారు ఆలోచనలో ఉన్నారు. వీరు కూడా నిరాశ చెందుతున్నారు.
జనవరిలో నియామకాలు..
మెడికల్ కళాశాలలో తక్షణమే అవసరమైన పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకం చేపడుతాం. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోస్టుల అవసరాన్ని తెలియజేశాం, అనుమతి వచ్చింది. ఎన్ని పోస్టుల భర్తీ, ఎప్పుడు అన్నది మరో వారం రోజుల్లో అధికారికంగా తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ఔట్ సోర్సింగ్ నియామకాలు జరిగే అవకాశం ఉంది.
– ఇందిర, కళాశాల ప్రిన్సిపల్.