నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
తొలిరోజు ఎస్జీటీలకు పరీక్ష
35 కేంద్రాలు... 8,216 మంది అభ్యర్థులు
చీకట్లోనే నంబర్లు వేసిన వైనం
అనంతపురం ఎడ్యుకేషన్ : నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. డీఎస్సీ-14 పరీక్షలు రాసేందుకు రోజుల తరబడి పుస్తకాలతో కసరత్తు చేసిన అభ్యర్థులకు వారి ప్రతిభాపాటవాలు నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ డీఎస్సీ తొలిరోజు ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 8216 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. డీఈఓ అంజయ్య, డెప్యూటీ డీఈఓ మునెయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
చీకటిలో నంబర్లు వేసిన వైనం
పరీక్షల నిర్వహణపై అనుమానాలు తలెత్తడంతో కలెక్టర్ కోన శశిధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్విజిలేషన్ విధులు మొదులుకుని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించడంలో అత్యంత గోప్యంగా ఉంచారు. మరీ ముఖ్యంగా కేంద్రాల కేటాయింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఫలితంగా ఆర్డర్లు ఇవ్వడంలో శుక్రవారం ఆలస్యమైంది. ఎట్టకేలకు సాయంత్రం ఆర్డర్లు తీసుకున్న చీఫ్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు ఆయా కేంద్రాలకు పరుగులు తీశారు.
ముఖ్యంగా శనివారం జరిగే పరీక్షకు నియమించిన ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో ఆయా కేంద్రాలకు వెళ్లారు. అప్పటికి చీకటి పడింది. చాలా కేంద్రాల్లో కరెంటు సదుపాయం లేకపోవడంతో సెల్‌ఫోన్ల వెలుగుతో నంబర్లు వేయడం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనూ కొన్ని కేంద్రాల్లో నంబర్లు వేశారు.