departmental officers
-
డీఎస్సీ.. తొలిరోజు ప్రశాంతం
ఎస్జీటీ పరీక్షకు హాజరైన 6396 మంది అభ్యర్థులు 1296 మంది గైర్హాజరు ఉదయాన్నే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : అమ్మయ్యా... అంటూ విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్సీ-14 పరీక్షల్లో భాగంగా తొలిరోజు శనివారం జరిగిన ఎస్జీటీ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. ఎస్జీటీ తెలుగు, కన్నడ, ఉర్దూకు మొత్తం 8216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాల వల్ల 524 దరఖాస్తులను తిరస్కరించారు. తక్కిన 7692 మందికిగాను...6396 మంది హాజరయ్యారు. వీరికి 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్జీటీ తెలుగులో 1255 మంది, ఉర్దూ 38, కన్నడలో ముగ్గురు అభ్యర్థులు కలిసి మొత్తం1296 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ఎక్కువగా డబుల్ ఎంట్రీ, నాన్ లోకల్ అభ్యర్థులు ఉంటారని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ముందురోజు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల పరీక్ష కేంద్రాల కేటాయింపులో కాస్త గందరగోళమైనా... ఏ కేంద్రం నుంచి ఎలాంటి సమస్య తలెత్తలేదు. నియమించిన ఉద్యోగులందరూ విధులకు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.అంజయ్య పలు సెంటర్లను పరిశీలించారు. ఉదయాన్నే చేరుకున్న అభ్యర్థులు ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, అభ్యర్థుల గంట ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించగా... చాలామంది అభ్యర్థులు ఉదయాన్నే చేరుకున్నారు. 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు తిరగని కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు రవాణాకు ఇబ్బందులు పడ్డారు. కొందరైతే కార్లు, ఆటోలకు వేలాది రూపాయలు చెల్లించి అద్దెకు తెచ్చుకున్నారు. దాదాపు ఏ సెంటర్లోనూ అభ్యర్థులు ఆలస్యంగా రాలేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు చాలామంది చిన్న పిల్లల తల్లులు పరీక్షకు హాజరుకావడంతో చంటిపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తండ్రి, బంధువులు పిల్లలను లాలించారు. ఆయా కేంద్రాలో చెట్లకు ఊయళ్లు వేసి పిల్లలను నిద్దరూపారు. ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్ట్ పరీక్షకు ఆటంకం కల్గిస్తారనే అనుమానంతో ఏఐఎస్ఎఫ్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు జాన్సన్‌బాబు, ప్రధానకార్యదర్శి నరేష్, నగర కార్యదర్శి మనోహర్‌ను ఉదయాన్నే అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరీక్ష ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1 గంట పైన సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
తొలిరోజు ఎస్జీటీలకు పరీక్ష 35 కేంద్రాలు... 8,216 మంది అభ్యర్థులు చీకట్లోనే నంబర్లు వేసిన వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. డీఎస్సీ-14 పరీక్షలు రాసేందుకు రోజుల తరబడి పుస్తకాలతో కసరత్తు చేసిన అభ్యర్థులకు వారి ప్రతిభాపాటవాలు నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ డీఎస్సీ తొలిరోజు ఎస్జీటీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 8216 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. డీఈఓ అంజయ్య, డెప్యూటీ డీఈఓ మునెయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. చీకటిలో నంబర్లు వేసిన వైనం పరీక్షల నిర్వహణపై అనుమానాలు తలెత్తడంతో కలెక్టర్ కోన శశిధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్విజిలేషన్ విధులు మొదులుకుని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించడంలో అత్యంత గోప్యంగా ఉంచారు. మరీ ముఖ్యంగా కేంద్రాల కేటాయింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఫలితంగా ఆర్డర్లు ఇవ్వడంలో శుక్రవారం ఆలస్యమైంది. ఎట్టకేలకు సాయంత్రం ఆర్డర్లు తీసుకున్న చీఫ్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఆయా కేంద్రాలకు పరుగులు తీశారు. ముఖ్యంగా శనివారం జరిగే పరీక్షకు నియమించిన ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో ఆయా కేంద్రాలకు వెళ్లారు. అప్పటికి చీకటి పడింది. చాలా కేంద్రాల్లో కరెంటు సదుపాయం లేకపోవడంతో సెల్ఫోన్ల వెలుగుతో నంబర్లు వేయడం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనూ కొన్ని కేంద్రాల్లో నంబర్లు వేశారు. -
ఈ 'సారీ' జంబ్లింగ్ లేనట్టే!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పట్లో జంబ్లింగ్ విధానానికి మోక్షం కలిగేటట్లు కనిపించించడంలేదు. మూడేళ్లగా ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు చెబుతూ వస్తున్న పరీక్షల ముందుకొచ్చేసరికి మాట తప్పుతున్నాయి. దీంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రతిభ కలిగిన విద్యార్థులకు తీసిపోని విధంగా సాధారణ విద్యార్థులు సైతం మార్కులు అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రతిభకు పాతరేసినట్లవుతోంది. కాగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల ఆగడాలకు ఇప్పట్లో అడ్డుకట్ట వేసే విధానమేదీ కనిపించడంలేదు స్వయం గా ఓ కార్పొరేట్ కళాశాలల అధినేతే రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ, ముఖ్యనేతకు సన్నిహితంగావుంటూ అంతా తానై చక్రం తిప్పుతుండటంతో ఇప్పట్లో జంబ్లింగ్ విధానం అమలయ్యే అవకాశమే లేదని విద్యావేత్తలు, విశ్రాంత ఇంటర్ విద్యాధికారుల అభిప్రాయం. ప్రాక్టికల్స్‌కు 12,179 మంది జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలలు, 11 సాంఘిక, 4 గిరిజన, 14 మోడల్, కోపరేటివ్ 2, ప్రైవేటు 89 కళాశాలను కలుపుకొని మొత్తం 163 జూనియర్ కళాశాలలు ఉన్నాయి.ఈ ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు జిల్లా నుంచి 57,829 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 27,294 మంది జనరల్, 1,621 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానుండగా... ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ప్రైవేటు, ఒకేషనల్, జనరల్ కలిపి 28,915 మంది హాజరుకానున్నారు. కాగా ప్రాక్టికల్ పరీక్షలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రాక్టికల్ పరీక్షలకు సైన్స్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు 16,160 మంది విద్యార్థులు హాజరుకానుండగా... ఇందు లో బైపీసీ నుంచి 3,981 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానుండగా, మిగిలిన (12179) వారంతా ఎంపీసీ విద్యార్థులు. జంతర్ మంతర్ అస్త్రాలకు సిద్ధం! ఫిబ్రవరి 12 నుంచి నాలుగు విడతల్లో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానంలో లేకపోవడంతో ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటాయి. చాలావరకు కళాశాలల్లో కనీస సదుపాయాలు లేనప్పటికీ ప్రాక్టికల్స్‌ను తమ కళాశాలల కేంద్రాలుగానే నిర్వహించుకునేందుకు అధికారులతో కుమ్మక్కవుతున్నట్లు విమర్శలు వస్తున్నారు. ప్రాక్టికల్స్ విడతలవారీగా జరుగుతుండటంతో సమీప కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ముగిసిన తర్వాత వాటిని తమ కళాశాలకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పర్యవేక్షణాధికారుల వివరాలు తెలుసుకుని వారితో లాబీయింగ్‌లకు షురూ చేస్తున్నారు. డీవోలుగా ఇతర శాఖల ఉద్యోగులు? ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ అధికారులు(డీవో)గా ఇతరశాఖల ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు జేఎల్స్, ఎంటీఎస్, సీఎల్స్ అధ్యాపకులనే డీవోలుగా నియమించడం ఆనవాయితీ. అయితే అధికారులు, లెక్చరర్లు లాబీయింగ్‌లకు పాల్పడుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భావించిన సర్కారు ఇతర శాఖల ఉద్యోగులను తెరపైకి తీసుకొచ్చింది. డీవోలగా ఇతరశాఖ ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. చేతనైతే జంబ్లింగ్‌లో నిర్వహించాలి! కార్పొరేట్ లాబీయింగ్‌లకు అలవాటు పడ్డ ప్రభుత్వం చేతనైతే జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అంతే తప్ప లెక్చరర్లను కాదని ఇతర శాఖల సిబ్బందిని డీవోలులగా నియమిస్తే ఊరుకునేది లేదు. - వి.వెంకటేశ్వరరావు, జేఎల్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోభావాలను దెబ్బతీయొద్దు ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి దశాబ్దాల కాలంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు డీవోలుగా లెక్చరర్లనే నియమించడం అనయివాతీగా వస్తోంది. అలాకాదని కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యే ఇతరశాఖల సిబ్బందిని నియమించి అధ్యాపకుల మనోభావాలను దెబ్బతీయూలని చూస్తే ప్రతిఘటిస్తాం! - బి.శ్యామ్‌సుందర్, జేఎల్స్ అసోసియేషన్ ప్రతినిధి ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు చేసుకోవాలి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి నాలుగు విడతలపాటు జరుగుతాయి. అన్ని కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలి. పరికరాలు సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి అసౌర్యం కలుగుజేసినా కేంద్రాలను రద్దుచేస్తాం. డీవోలుగా ఎవరిని నియమించలన్నది ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిర్ణయిస్తుంది. - ఎ.అన్నమ్మ, ఇంటర్ బోర్డు జిల్లా ఆర్ఐవో