ఎస్జీటీ పరీక్షకు హాజరైన 6396 మంది అభ్యర్థులు
1296 మంది గైర్హాజరు
ఉదయాన్నే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : అమ్మయ్యా... అంటూ విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్సీ-14 పరీక్షల్లో భాగంగా తొలిరోజు శనివారం జరిగిన ఎస్జీటీ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. ఎస్జీటీ తెలుగు, కన్నడ, ఉర్దూకు మొత్తం 8216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాల వల్ల 524 దరఖాస్తులను తిరస్కరించారు. తక్కిన 7692 మందికిగాను...6396 మంది హాజరయ్యారు. వీరికి 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎస్జీటీ తెలుగులో 1255 మంది, ఉర్దూ 38, కన్నడలో ముగ్గురు అభ్యర్థులు కలిసి మొత్తం1296 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ఎక్కువగా డబుల్ ఎంట్రీ, నాన్ లోకల్ అభ్యర్థులు ఉంటారని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ముందురోజు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల పరీక్ష కేంద్రాల కేటాయింపులో కాస్త గందరగోళమైనా... ఏ కేంద్రం నుంచి ఎలాంటి సమస్య తలెత్తలేదు. నియమించిన ఉద్యోగులందరూ విధులకు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.అంజయ్య పలు సెంటర్లను పరిశీలించారు.
ఉదయాన్నే చేరుకున్న అభ్యర్థులు
ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, అభ్యర్థుల గంట ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించగా... చాలామంది అభ్యర్థులు ఉదయాన్నే చేరుకున్నారు. 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు తిరగని కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు రవాణాకు ఇబ్బందులు పడ్డారు. కొందరైతే కార్లు, ఆటోలకు వేలాది రూపాయలు చెల్లించి అద్దెకు తెచ్చుకున్నారు.
దాదాపు ఏ సెంటర్‌లోనూ అభ్యర్థులు ఆలస్యంగా రాలేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు చాలామంది చిన్న పిల్లల తల్లులు పరీక్షకు హాజరుకావడంతో చంటిపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తండ్రి, బంధువులు పిల్లలను లాలించారు. ఆయా కేంద్రాలో చెట్లకు ఊయళ్లు వేసి పిల్లలను నిద్దరూపారు.
ఏఐఎస్‌ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్ట్
పరీక్షకు ఆటంకం కల్గిస్తారనే అనుమానంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు జాన్సన్‌బాబు, ప్రధానకార్యదర్శి నరేష్, నగర కార్యదర్శి మనోహర్‌ను ఉదయాన్నే అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరీక్ష ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1 గంట పైన సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
డీఎస్సీ.. తొలిరోజు ప్రశాంతం
Published Sun, May 10 2015 4:08 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement