ఈ 'సారీ' జంబ్లింగ్ లేనట్టే! | there is no possibilities for intermediate jumbling pattern | Sakshi
Sakshi News home page

ఈ 'సారీ' జంబ్లింగ్ లేనట్టే!

Published Sun, Jan 18 2015 11:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

there is no possibilities for intermediate jumbling pattern

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పట్లో జంబ్లింగ్ విధానానికి మోక్షం కలిగేటట్లు కనిపించించడంలేదు. మూడేళ్లగా ప్రాక్టికల్స్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు చెబుతూ వస్తున్న పరీక్షల ముందుకొచ్చేసరికి మాట తప్పుతున్నాయి. దీంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.

ప్రతిభ కలిగిన విద్యార్థులకు తీసిపోని విధంగా సాధారణ విద్యార్థులు సైతం మార్కులు అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రతిభకు పాతరేసినట్లవుతోంది. కాగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల ఆగడాలకు ఇప్పట్లో అడ్డుకట్ట వేసే విధానమేదీ కనిపించడంలేదు స్వయం గా ఓ కార్పొరేట్ కళాశాలల అధినేతే రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ, ముఖ్యనేతకు సన్నిహితంగావుంటూ అంతా తానై చక్రం తిప్పుతుండటంతో ఇప్పట్లో జంబ్లింగ్ విధానం అమలయ్యే అవకాశమే లేదని విద్యావేత్తలు, విశ్రాంత ఇంటర్ విద్యాధికారుల అభిప్రాయం.
 
ప్రాక్టికల్స్‌కు 12,179 మంది
జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలలు, 11 సాంఘిక, 4 గిరిజన, 14 మోడల్, కోపరేటివ్ 2, ప్రైవేటు 89 కళాశాలను కలుపుకొని మొత్తం 163 జూనియర్ కళాశాలలు ఉన్నాయి.ఈ ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు జిల్లా నుంచి 57,829 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 27,294 మంది జనరల్, 1,621 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానుండగా... ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ప్రైవేటు, ఒకేషనల్, జనరల్ కలిపి 28,915 మంది హాజరుకానున్నారు. కాగా ప్రాక్టికల్ పరీక్షలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రాక్టికల్ పరీక్షలకు సైన్స్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు 16,160 మంది విద్యార్థులు హాజరుకానుండగా... ఇందు లో బైపీసీ నుంచి 3,981 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానుండగా, మిగిలిన (12179) వారంతా ఎంపీసీ విద్యార్థులు.

జంతర్ మంతర్ అస్త్రాలకు సిద్ధం!
ఫిబ్రవరి 12 నుంచి నాలుగు విడతల్లో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానంలో లేకపోవడంతో ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటాయి. చాలావరకు కళాశాలల్లో కనీస సదుపాయాలు లేనప్పటికీ ప్రాక్టికల్స్‌ను తమ కళాశాలల కేంద్రాలుగానే నిర్వహించుకునేందుకు అధికారులతో కుమ్మక్కవుతున్నట్లు విమర్శలు వస్తున్నారు. ప్రాక్టికల్స్ విడతలవారీగా జరుగుతుండటంతో సమీప కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ముగిసిన తర్వాత వాటిని తమ కళాశాలకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పర్యవేక్షణాధికారుల వివరాలు తెలుసుకుని వారితో లాబీయింగ్‌లకు షురూ చేస్తున్నారు.

డీవోలుగా ఇతర శాఖల ఉద్యోగులు?
ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్‌మెంటల్ అధికారులు(డీవో)గా ఇతరశాఖల ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు జేఎల్స్, ఎంటీఎస్, సీఎల్స్ అధ్యాపకులనే డీవోలుగా నియమించడం ఆనవాయితీ. అయితే అధికారులు, లెక్చరర్లు లాబీయింగ్‌లకు పాల్పడుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని భావించిన సర్కారు ఇతర శాఖల ఉద్యోగులను తెరపైకి తీసుకొచ్చింది. డీవోలగా ఇతరశాఖ ఉద్యోగులు, సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.  
 
చేతనైతే జంబ్లింగ్‌లో నిర్వహించాలి!
కార్పొరేట్ లాబీయింగ్‌లకు అలవాటు పడ్డ ప్రభుత్వం చేతనైతే జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అంతే తప్ప లెక్చరర్లను కాదని ఇతర శాఖల సిబ్బందిని డీవోలులగా నియమిస్తే ఊరుకునేది లేదు.                                           - వి.వెంకటేశ్వరరావు, జేఎల్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి

మనోభావాలను దెబ్బతీయొద్దు    
ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి దశాబ్దాల కాలంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు డీవోలుగా లెక్చరర్లనే నియమించడం అనయివాతీగా వస్తోంది. అలాకాదని కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యే ఇతరశాఖల సిబ్బందిని నియమించి అధ్యాపకుల మనోభావాలను దెబ్బతీయూలని చూస్తే ప్రతిఘటిస్తాం!              - బి.శ్యామ్‌సుందర్, జేఎల్స్ అసోసియేషన్ ప్రతినిధి

ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు చేసుకోవాలి
ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి నాలుగు విడతలపాటు జరుగుతాయి. అన్ని కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలి. పరికరాలు సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి అసౌర్యం కలుగుజేసినా కేంద్రాలను రద్దుచేస్తాం. డీవోలుగా ఎవరిని నియమించలన్నది ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిర్ణయిస్తుంది.          - ఎ.అన్నమ్మ, ఇంటర్ బోర్డు జిల్లా ఆర్‌ఐవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement