
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహణకు ఇంటర్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. తాగునీరు, విద్యుత్ సదుపాయం, టాయిలెట్ వంటి వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమయ్యే నిధులను జిల్లా అధికారుల ద్వారా కాకుండా నేరుగా ప్రిన్సిపాళ్ల ఖాతాలకే చేరేలా చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. మూల్యాంకన లోపాలు తలెత్తకుండా మూల్యాంకన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ విధానంలో పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ముగిసింది. దీంతో వచ్చే మార్చిలో మొత్తంగా 9,65,493 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు లెక్కలు వేసింది.
వెబ్ క్యాస్టింగ్ విధానంలో పర్యవేక్షణ..: వచ్చే మార్చి 4వ తేదీ నుంచి జరిగే రాత పరీక్షల కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, వాటి జంబ్లింగ్ ప్రక్రియను చేపట్టింది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయ్యే ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల గుర్తింపును పూర్తి చేసింది. రాత పరీక్షల నిర్వహణ కోసం 1,317 కేంద్రాలను గుర్తించింది. ప్రాక్టికల్ పరీక్షల కోసం (జనరల్) 1,517 కేంద్రాలను, వొకేషనల్ ప్రాక్టికల్స్ కోసం 449 కేంద్రాలను గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment