కెమెరాలతో కనిపెడతాం | cctv camera vigilance in Inter practical exams | Sakshi
Sakshi News home page

కెమెరాలతో కనిపెడతాం

Published Tue, Dec 13 2016 4:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

కెమెరాలతో కనిపెడతాం

కెమెరాలతో కనిపెడతాం

- సీసీ కెమెరాల నిఘా నీడన ఇక ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌
- ఇష్టారాజ్యం మార్కుల విధానానికి అడ్డుకట్ట వేసే చర్యలు
- ఆన్‌లైన్‌లో పరీక్ష పత్రం.. అప్పటికప్పుడే మార్కుల నమోదు
- పరీక్ష కేంద్రాల జంబ్లింగ్‌కు పట్టుదలతో ఉన్న ప్రభుత్వం
- ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు


సాక్షి, హైదరాబాద్‌:
ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు  ఇంటర్మీడియెట్‌ బోర్డు  సీసీ కెమెరాల సాయం తీసుకోనుంది. ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతోంది. తద్వారా ప్రాక్టికల్స్‌లో ఒక్కో పాఠ్యాంశంలో 30కి 30 మార్కులు వేసే పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది. పారదర్శకత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరిగే ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణను నిఘా నీడన చేపట్టడంతో పాటు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేయడం, వాల్యుయేషన్‌ చేసిన తరువాత నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే మార్కుల నమోదు వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు ఈసారి ప్రయోగ పరీక్షలకు జంబ్లింగ్‌ పెట్టాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అయితే దీనిపై ఇంటర్‌ బోర్డు ఏ నిర్ణయం తీసుకోలేదు.

‘ప్రైవేటు’ కేంద్రాల్లోనూ కెమెరాలు
ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానం అమల్లో ఉంది. ప్రైవేటు కాలేజీల్లో కూడా    మిగతా 3వ పేజీలోu
వీటిని తప్పనిసరి చేయనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించే ప్రతి పరీక్ష కేంద్రంలో యాజమాన్యం ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందే. వాటికే పరీక్ష కేంద్రాలను కేటాయించేలా బోర్డు చర్యలు చేపట్టింది. వీటితోపాటు కంప్యూటర్, ఇంటర్నెట్‌ సదుపాయం తప్పని సరి.

ఇక వారిష్టం కుదరదు...
గతంలో యాజమాన్యాలు సూచించిన విద్యార్థులకు వారు కోరుకున్న పేపరు ఇవ్వడం, ముందుగానే ప్రాక్టికల్‌ పరీక్ష పేపరును లీక్‌ చేయడం, యాజమాన్యాల నుంచి ఎగ్జామినర్లు ముడుపులు పుచ్చుకొని ప్రతిభావంతులు కాకపోయినా విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు. దీనికి బోర్డు చెక్‌ పెట్టనుంది. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రికార్డు చేస్తారు. తద్వారా ఎగ్జామినర్‌ ఇష్టానుసారం వ్యవహరించలేరు. బయటివారు పరీక్ష కేంద్రంలోకి వచ్చే వీలు ఉండదు.గతంలో ముందుగా ఎగ్జామినర్‌కు వచ్చిన ప్రశ్నాపత్రాల సెట్‌లోని ఏ కోడ్‌ పేపర్‌లో ఏ ప్రయోగంపై ప్రశ్న ఇచ్చారన్న విషయాలను విద్యార్థులకు తెలియజేసేవారు. దాంతో విద్యార్థి కోరుకున్న కోడ్‌ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఆ విద్యార్థికి ఇచ్చే వారు.

ఇప్పుడు అలాంటి మార్పులకు ఆస్కారం ఉండదు. ర్యాండమ్‌గా ఇంటర్‌ బోర్డే విద్యార్థి హాల్‌టికెట్‌ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని సదరు విద్యార్థికి కేటాయిస్తుంది. పైగా అది ఎగ్జామినర్‌కు కూడా ముందుగా తెలియదు. పరీక్ష సమయానికి అరగంట ముందుగా ఎగ్జామినర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పరీక్షకేంద్రం ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యాక, అతని మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఉపయోగించిన ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్‌ చేస్తారు. అందులో ఏ హాల్‌టికెట్‌ నెంబరు విద్యార్థికి ఏ ప్రశ్నాపత్రం అన్నది ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాలు చేయించాలి. ప్రతి రోజు రెండు బ్యాచ్‌లుగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రాక్టికల్స్‌ చేయిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. అవి పూర్తి కాగానే ఎగ్జామినర్‌ ఆ బ్యాచ్‌లోని 20 మంది విద్యార్థుల రికార్డులను దిద్ది, ప్రాక్టికల్స్‌ ఫలితాలను, మార్కుల వివరాలను 12 గంటల నుంచి 2 గంటలలోగా అప్‌లోడ్‌ చేయాలి.

నిర్ణీత వేళలో అప్‌లోడ్‌ చేయకుంటే వెబ్‌సైట్‌ క్లోస్‌ అవుతుంది. ఆ విద్యార్థి మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు కావు. దీంతో అక్రమాలు జరక్కుండా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు జరిగే రెండో బ్యాచ్‌కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు. గతంలో ఎగ్జామినర్‌ అదే పరీక్ష కేంద్రంలో 3 రోజులు విధులు నిర్వహించేవారు కనుక యాజమాన్యాలతో బేరం కుదుర్చుకొని ఇష్టారాజ్యంగా యాజమాన్యం సూచించిన వారికి ఎక్కువ మార్కులు వేసేవారు. చివరలో మూడో రోజు విద్యార్థులు అందరి మార్కులను వేసి వెళ్లేవారు. ఇప్పుడు అలా కుదరదు. ఎప్పటికప్పుడు మార్కులను అప్‌లోడ్‌ చేయాలి. తద్వారా బేరసారాలకు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

గతంలో ఏం జరిగేది..
యాజమాన్యాలు సూచించిన విద్యార్థులకు వారు కోరుకున్న పేపరు ఇవ్వడం, ముందుగానే ప్రాక్టికల్‌ పరీక్ష పేపరును లీక్‌ చేయడం, యాజమాన్యాల నుంచి ఎగ్జామినర్లు ముడుపులు పుచ్చుకొని ప్రతిభావంతులు కాకపోయినా విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు.

ఇప్పుడు ఏం చేస్తారు..
ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ర్యాండమ్‌గా ఇంటర్‌ బోర్డే విద్యార్థి హాల్‌టికెట్‌ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని కేటాయిస్తుంది. పరీక్ష పూర్తి కాగానే ఎగ్జామినర్‌ విద్యార్థుల రికార్డులను దిద్ది, ప్రాక్టికల్స్‌ ఫలితాలను, మార్కుల వివరాలను 12 గంటల నుంచి 2 గంటలలోగా అప్‌లోడ్‌ చేయాలి. నిర్ణీత వేళలో అప్‌లోడ్‌ చేయకుంటే వెబ్‌సైట్‌ క్లోస్‌ అవుతుంది. ఆ విద్యార్థి మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు కావు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే రెండో బ్యాచ్‌కీ ఇదే పద్ధతి అమలు చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement