‘పోటీ’లో ఇంజనీరింగ్ అభ్యర్థులు
♦ ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి
♦ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు
♦ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నదీ 6.75 లక్షలు
♦ అందులో రెండు లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే
♦ తరువాత స్థానంలో బీకాం, బీఎస్సీ నిరుద్యోగులు
♦ నాలుగు, ఐదు స్థానాల్లో బీఏ, ఎంబీయే అభ్యర్థులు
♦ అందరి దృష్టి గ్రూప్స్‌పైనే!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత సాంకేతిక కోర్సులు చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. సాంకేతికపరమైన పోస్టులతో పాటు సాధారణ పోస్టులకూ పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. బీఏ, బీకాం వంటి సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినవారికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. అసలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేయించుకున్న 6.75 లక్షల మందిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారే 2,06,406 మంది ఉండటం గమనార్హం.
ఇంజనీరింగ్ అర్హతతో పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం, అవసరమైన దానికన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తుండడం, ప్రభుత్వ కొలువులపై ఆశ వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పోగా.. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీలు చేసిన వారు 2,60,825 మంది, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారు 1,61,620 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర కేంద్ర ప్రభుత్వ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఇందుకు అదనం. ఇక గ్రూప్స్ నోటిఫికేషన్లు జారీ అయితే ఓటీఆర్ చేయించుకునే వారి సంఖ్య బాగా పెరగనుంది.
కోర్సుల వారీగా చూస్తే..
కోర్సుల వారీగా పరిశీలిస్తే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిలో బీకాం గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తంగా బీకాం గ్రాడ్యుయేట్లు 1,17,817 మంది ఓటీఆర్ చేసుకోగా.. అందులో సాధారణ బీకాం వారు 65,571 మంది, బీకాం కంప్యూటర్స్ చేసినవారు 52,246 మంది ఉన్నారు. ఇక బీఎస్సీ (వివిధ కోర్సులు) పూర్తి చేసినవారు 91,691 మంది, బీఏ పూర్తి చేసిన వారు 51,317 మంది ఓటీఆర్ చేసుకున్నారు.
పోస్టుల సంఖ్యే కీలకం..
నిరుద్యోగులందరి చూపూ భర్తీ చేసే పోస్టుల సంఖ్యపైనే ఉంది. ఇప్పటివరకు ఇంజనీర్, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫైనాన్స్ అసిస్టెంట్, వాటర్ వర్క్స్ మేనేజర్ వంటి సాంకేతిక, ప్రత్యేక కోర్సుల అర ్హతతో పరీక్షలు నిర్వహించిన పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్స్ కేటగిరీల్లో పోస్టులు చాలాతక్కువగా ఉన్నాయి. గ్రూప్-1లో 52 పోస్టులకు, గ్రూప్-2లో 434 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్-3, గ్రూప్-4, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి అనుమతే రాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిన ఫైలులోని దాదాపు 10 వేల పోస్టుల్లో ఇవే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.