![Fake IAS Officer Caught at Telangana Secretariat](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/telangana.jpg.webp?itok=4Uhxqwsu)
సాక్షి,హైదరాబాద్ : ‘నేను ఐఏఎస్‌ని. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి. మీకున్న అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పిస్తా. ముందుగా అడిగినంత డబ్బులు ఇవ్వండి. అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇంటికి పంపిస్తా. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్‌లో జాయినింగ్ తేదీ ఎప్పుడు ఉంటే అప్పుడు సచివాలయానికి రండి’ అంటూ బాధితుల్ని మోసం చేసిన ఘటన తెలంగాణ సచివాలయంలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో ఇద్దరు నకిలీ ఉద్యోగుల్ని అరెస్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఐఏఎస్ పట్టుబడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన కేటుగాడికి సచివాలయంలోని రెగ్యులర్ ఉద్యోగులు సహకరించడం గమనార్హం.
నిందితుడు నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక్కో బాధితుడి నుంచి ఒక్కో ఉద్యోగానికి 20వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. అలా ఏడుగురు బాధితులు నిందితుడ్ని నమ్మి డబ్బులు ఇచ్చినట్లు సైఫదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నిందితుడు నకిలీ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
అంతేకాదు, ఫేక్ అపాయింట్మెంట్ ఇచ్చి బాధితుల్ని డైరెక్ట్‌గా సచివాలయానికి రప్పించడంపై ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, నిందితుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరి నుంచి భారీ మొత్తంలో డబ్బుల్ని వసూలు చేసినట్లు గుర్తించారు. నకిలీ ఐఏఎస్‌కు సచివాలయంలో పలువురు రెగ్యులర్ ఉద్యోగులు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment